Share News

మామిడి చెట్ల మాయ

ABN , Publish Date - Apr 14 , 2026 | 02:49 AM

గుడ్లూరు మండలం చేవూరు, రావూరు గ్రామాలలో మామిడిచెట్లకు పరిహారం చెల్లింపు వ్యవహారంలో కోట్లాది రూపాయల కుంభకోణం చోటుచేసుకుంది. రామాయపట్నం పోర్టు అనుబంధంగా ఏర్పాటుకానున్న బీపీసీఎల్‌ ప్రాజెక్టు కోసం జరుగుతున్న భూసేకరణలో ఈ వ్యవహారం నడిచింది.

మామిడి చెట్ల మాయ
చేవూరులోని మామిడితోటలు

చేవూరు, రావూరులలో కుంభకోణం

చిన్న మొక్కలను పెద్ద చెట్లుగా, పెద్దవి చిన్నవిగా చిత్రీకరణ

పరిహారం చెల్లింపుల్లో చక్రం తిప్పిన ఉద్యాన శాఖాధికారులు

చెట్లు లేని భూములకూ చెల్లింపు

కోట్లు వసూలు చేసుకున్న వైనం

పంపకాల్లో తేడాతో పోలీసు కేసులతో వెలుగులోకి వ్యవహారం

లంచం ఇవ్వలేని రైతులకు తీరని అన్యాయం

గుడ్లూరు మండలం చేవూరు, రావూరు గ్రామాలలో మామిడిచెట్లకు పరిహారం చెల్లింపు వ్యవహారంలో కోట్లాది రూపాయల కుంభకోణం చోటుచేసుకుంది. రామాయపట్నం పోర్టు అనుబంధంగా ఏర్పాటుకానున్న బీపీసీఎల్‌ ప్రాజెక్టు కోసం జరుగుతున్న భూసేకరణలో ఈ వ్యవహారం నడిచింది. రెండు గ్రామాల పరిధిలో వేలాది ఎకరాలలో మామిడి తోటలు విస్తరించి ఉండగా పరిహారం చెల్లింపుల్లో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయి. అక్కడ గత నాలుగేళ్ల నుంచి ఉద్యాన అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగి ఈ గోల్‌మాల్‌లో ముఖ్యపాత్ర పోషించారు. ప్రస్తుతం హెచ్‌వోగా ఉన్న అధికారిణి కూడా కీలక భూమిక వహించినట్లు చెబుతున్నారు.

కందుకూరు, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఏపీ మారిటైం బోర్డు జారీచేసిన మార్గదర్శకాలు, రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని గుడ్లూరు మండల ఉద్యాన శాఖాధికారులు పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారు. బీపీసీఎల్‌ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూసేకరణ చేస్తున్న విషయం విదితమే. ఈ సంద ర్భంగా మామిడి చెట్లకు పరిహారం చెల్లింపు కోసం వాటి వయస్సు, పొలంలో ఉన్న మొక్కల సంఖ్య ఆధా రంగా నిబంధనలు రూపొందించారు. ఏడాది వయస్సు దాటని మొక్కలైతే రూ.వెయ్యి చొప్పున, ఆరున్నరేళ్లు దాటిన పెద్ద చెట్లు అయితే గరిష్ఠంగా చెట్టుకు రూ.8,500 వరకు పరిహారం చెల్లించాలని ఆ మార్గదర్శ కాలలో పేర్కొన్నారు. ఎకరంలో గరిష్ఠంగా 40చెట్ల వర కు ఉండే అవకాశం ఉన్నందున అంతకు మించకుండా వాస్తవంగా ఎన్ని ఉంటే అన్నింటికి వాటి వయస్సు ఆధారంగా పరిహారం చెల్లించాలని నిర్దేశించారు. మొక్కల వయస్సు ఆధారంగా పరిహారాన్ని నిర్ణయించే అధికారం ఉద్యానశాఖ అధికారులకిచ్చారు. ఇదే అవకాశంగా వారు భారీ కుంభకోణానికి తెరతీశారు. నాలుగేళ్లుగా అక్కడి రైతులతో మంచి పరిచయాలు ఉన్న ఉద్యాన సహాయకుడు (వీహెచ్‌ఏ) రఘు పర్యవేక్షణలో ఉద్యానవన శాఖ అధికారులు వ్యవహారం నడిపించారు.

రైతులతో బేరసారాలు

40 చెట్లకు గరిష్ఠ పరిహారం నమోదు చేస్తే ఎకరాకు రూ.3.4లక్షల వరకూ దక్కుతోంది. కనిష్ఠంగా నమోదు చేస్తే రూ.40వేలు మాత్రమే వస్తుంది. ఆ మధ్యలో ఎంత పరిహారం చెల్లింపునకు నిర్ణయం జరిగినా కీలకం ఉద్యాన శాఖ అధికారులే కావటంతో రైతులతో బేరసారాలు ప్రారంభించారు. ‘మీకు గరిష్ఠం వచ్చేలా చూస్తాం.. మామూలుగా అయితే అరవై డెబ్భై వేలే వస్తుంది. కానీ మీకు 60 చెట్లు ఉన్నట్లు నమోదు చేసి ఎకరాకు రూ.4లక్షలకుపైగా వచ్చేలా చూస్తాం. ఆ మొత్తంలో మీకు సగం మాకు సగం.. ఓకేనా!’ అని బేరసారాలు సాగించారు. దానికి ఇష్టపడి ముందుగానే ఉద్యాన అధికారులకు చెల్లింపులు చేసిన రైతులకు చెందిన చిన్న మొక్కలను కూడా పెద్దచెట్లుగా చూపించి పరిహారం ఇచ్చారు. ముందుగా లంచం ఇవ్వటానికి చేతిలో డబ్బులు లేకనో, లక్షల్లో ఇస్తే వారు చెప్పి నట్లు నిజంగా పరిహారం దక్కుతుందో లేదోనన్న సందేహంతోనో ఆ ప్రతిపాదనకు ఆమోదించని రైతులకు మాత్రం కనిష్ఠ పరిహారాలే జమ అయ్యాయి.

చెట్లు లేని భూములకు పరిహారం

దశాబ్దాల నాటి చెట్లు ఉన్న రైతులకు కూడా లంచం ఇవ్వకుంటే పరిహారం ఎకరానికి లక్షకు మించలేదని సమాచారం. ఈ వ్యవహారంలో కోట్లు చేతులు మారడంతో మరో అడుగు ముందుకేసిన ఉద్యాన అధికారులు అసలు మామిడి చెట్లు లేని భూముల్లో కూడా ఉన్నట్లు చూపించి కొందరికి పరిహారం చెల్లించేశారు. ఇలా చేవూరుకి చెందిన మాకనబోయిన శేషయ్యకు 8 ఎకరాలకు మామిడిచెట్ల పరిహారం రూ.25 లక్షల వరకు జమ చేయిస్తామని పది లక్షలకు బేరం మాట్లాడుకోగా అడ్వాన్సుగా ఐదు లక్షలు ఉద్యాన అధికారులు జమ చేయించుకున్నారు. అయితే అతనికి పరిహారం జమకావడంలో జాప్యం కావడం, ఈలోసే ఆ ఐదు లక్షల పంపకాల విషయంలో హెచ్‌వోకు, వీహెచ్‌ఏకు తేడా రావడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

పోలీసు కేసులదాకా వెళ్లిన ఉద్యాన అధికారులు

ఉద్యాన అధికారి జ్యోతి చేవూరుకు చెందిన మాకనబోయిన శేషయ్య, తమ శాఖలో చేవూరు గ్రామ ఉద్యాన సహాయకుడిగా ఉన్న రఘు తనను వేధిస్తున్నారని గుడ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదుతో వారిద్దరినీ విచారణకు పిలిపించిన పోలీసులు వారు చెప్పిన సమాచారంతో విస్తుపోయినట్లు తెలిసింది. అయితే ఈ వ్యవహారాన్ని బయటకు రానీయకుండా గోప్యంగా ఉంచటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేవూరులో ఖాళీగా ఉన్న తన ఎనిమిది ఎకరాల మెట్ట భూమికి మామిడి చెట్ల పరిహారం ఇప్పిస్తామని అందుకోసం పదిలక్షలు లంచం మాట్లాడుకున్నారని అందులోభాగంగా వారు సూచించిన గుడ్లూరులోని ఓ గోల్డ్‌షాప్‌ నిర్వాహకుడికి రూ.లక్ష, నెల్లూరు జిల్లా కలిగిరి ఎస్‌బీఐలో ఖాతా కలిగి ఉన్న ఓ వ్యక్తికి రూ.4లక్షలు తన అకౌంటు నుంచి ట్రాన్స్‌ఫర్‌ చేశానని శేషయ్య పోలీసులకు వివరించాడు. అయితే మిగిలిన రూ.5లక్షలు కూడా ఇవ్వమని రఘు అడగ్గా తనకు పరిహారం జమ అయ్యాక కదా మిగిలిన సగం ఇచ్చేదని చెప్పానని, అంతకుమించి నేనేమీ వేధించలేదని తెలిపారు. అయితే ముందు ఇచ్చిన రూ.5 లక్షలు హెచ్‌వోకు వెళ్లగా వాటిలో తనవాటా ఇవ్వమని అడగ్గా రైతు వద్ద వసూలు చేసుకోమని ఆమె చెప్పటం వివాదానికి దారితీసింది. దీంతో ఆ నగదును వీహెచ్‌ఏ ఖాతాకు కలిగిరి ఎస్‌బీఐ ఖాతాదారుడు నుంచి ట్రాన్స్‌ఫర్‌ చేయించి ఆ తర్వాత ఖాతాను సీజ్‌ చేయించి హెచ్‌వో ఫిర్యాదు చేసినట్లు రఘు ఆరోపిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని హెచ్‌వో చెబుతుండగా అందరి ప్రమేయం ఉందని వీహెచ్‌ఏ రఘు చెబుతుండటం విశేషం. ప్రస్తుతం రఘు పరారీలో ఉన్నట్లు తెలిసింది.

మిగతా చోట్ల ఇదేతరహా కుంభకోణం

చేవూరు, రావూరులలోనే ఇప్పటికే రమారమి 600 హెక్టార్లకు మామిడి తోటల పరిహారం చెల్లింపులు జరగ్గా ఇంకా వందల ఎకరాలకు చెల్లింపులు జరగాల్సి ఉంది. అదేవిధంగా బీపీసీఎల్‌కు భూసేకరణ జరుగుతున్న కావలి రూరల్‌ మండల పరిధిలోని గ్రామాలలో కూడా ఇదేతరహా కుంభకోణం జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కోట్ల రూపాయల ప్రభుత్వధనం అక్రమంగా చెల్లింపులు జరగ్గా రమారమి రూ.కోటికిపైగా ఉద్యాన అధికారులకు ముట్టినట్లు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఉద్యాన శాఖ ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ స్థితిలో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు నిగ్గుతేల్చాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొందరు రైతులకు ప్రయోజనం కలిగించటం ద్వారా జరిగిన కుంభకోణం ఒక ఎత్తైతే లంచం ఇవ్వలేదని వాస్తవంగా దక్కాల్సిన పరిహారం కూడా రైతులకు దక్కకుండా చేయటం ద్వారా నష్టపోయిన వారు గణనీయంగా ఉన్నారని చేవూరు, రావూరు రైతులు ముక్తకంఠంతో విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నారు.

Updated Date - Apr 14 , 2026 | 02:49 AM