Share News

రాత్రికి రాత్రే భూంఫట్‌

ABN , Publish Date - Feb 01 , 2026 | 02:20 AM

సింగరాయ కొండ మండలంలో ఐదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగో లుగా అసైన్డ్‌, ప్రభుత్వ, పోరంబోకు, తీరప్రాంత భూములను సైతం వైసీపీ నాయకులు కొల్లగొట్టారు. ఖాళీస్థలం కనిపిస్తే కబ్జా చేశారు. ఈక్రమంలో ప్రభుత్వ భూములకు సైతం నకిలీ పట్టాలు సృష్టించి హస్తగతం చేసుకోవడంలో ఆరితేరిన ముఠా కన్ను సుమారు రూ.5కోట్ల విలువ చేసే భూమిపై పడింది.

రాత్రికి రాత్రే భూంఫట్‌
వైసీపీ నాయకులు ఆక్రమించి కంచెవేసిన భూమి

మొక్కలు నాటి.. రాళ్లుపాతి.. కంచెలు వేసి..!

యథేచ్ఛగా ప్రభుత్వ భూమి ఆక్రమణ

పాగా వేసిన వైసీపీ నాయకులు

దీని విలువ రూ.5కోట్లపైనే..!

గత ప్రభుత్వంలో నకిలీ పత్రాలతో ప్లాట్లు వేసి విక్రయం

పత్రికల్లో వచ్చిన కథనాలతో భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు

వైసీపీ ప్రభుత్వం చివరలో చక్రంతిప్పిన కబ్జాదారులు

వీఆర్వోకి తాయిలాలు ఇచ్చి రికార్డులో మార్పులు

గత అధికారుల మోసాలతో దిక్కుతోచని పరిస్థితిలో రెవెన్యూ యంత్రాంగం

వైసీపీ ప్రభుత్వం చివరిలో రికార్డులను తారుమారు చేయడంలో ప్రావీణ్యం కలిగిన గ్రామ రెవెన్యూ అధికారికి తాయిలాలు ఇచ్చి ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించారు. ఆయన పక్కా ప్రణాళికతో వైసీపీ నేతల బినామీకి అనుకూలంగా ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ తప్పుడు నివేదికలు, నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిలోకి వైసీపీ నాయకులు ప్రవేశించి రాత్రికి రాత్రే మామిడి మొక్కలు నాటారు. రాళ్లుపాతి, కంచెలు వేసి ఆక్రమించుకున్నారు.

సింగరాయకొండ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): సింగరాయ కొండ మండలంలో ఐదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అడ్డగో లుగా అసైన్డ్‌, ప్రభుత్వ, పోరంబోకు, తీరప్రాంత భూములను సైతం వైసీపీ నాయకులు కొల్లగొట్టారు. ఖాళీస్థలం కనిపిస్తే కబ్జా చేశారు. ఈక్రమంలో ప్రభుత్వ భూములకు సైతం నకిలీ పట్టాలు సృష్టించి హస్తగతం చేసుకోవడంలో ఆరితేరిన ముఠా కన్ను సుమారు రూ.5కోట్ల విలువ చేసే భూమిపై పడింది. సింగరాయకొండ పంచాయతీ పరిధి సోమరాజుపల్లి గ్రామ రెవెన్యూలోని బాలయోగినగర్‌ వద్ద హైవే పక్కన సర్వే నెం.659-3లో 2.74 ఎకరాలు ఉంది. సదరు భూమిలో గత వైసీపీ ప్రభుత్వంలోనే ఆ పార్టీ నాయకులు ప్లాట్లువేసి అమ్మ కాలు ప్రారంభించారు. భూఆక్రమణపై ‘ఆంధ్రజ్యోతి’తోపాటు పలు పత్రికల్లో అప్పట్లో వార్తలు ప్రచురితమయ్యాయి. దీంతో అప్పటి రెవెన్యూ అధికారులు అది ప్రభుత్వ భూమి అని, అందులోకి ప్రవేశిస్తే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో అక్రమార్కులు వెనక్కి తగ్గారు. అయితే ప్రస్తుతం ఓ రెవెన్యూ అధికారిని మంచి చేసుకుని రికార్డుల మాయ చేసినట్లు సమాచారం.

అసైన్డ్‌ పట్టాతో మోసం.!

సర్వే నెం. 659-3లో 2.74 ఎకరాల ప్రభుత్వ భూమిని 1994లో సింగరాయకొండకు చెందిన కుంచాల విజయ అనే మహిళకు అసైన్డ్‌ పట్టా కేటాయించినట్లు రికార్డుల్లో నమోదై ఉందని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ పట్టాను కొన్నేళ్ల క్రితం ప్రభుత్వ అవసరాల కోసం రద్దు చేసినట్లు సమాచారం. దీంతో ఆ భూమి దాదాపు పదేళ్ల నుంచి ఖాళీగానే ఉంది. అందులో ఎటువంటి పంటలు సైతం సాగు చేయలేదు. జాతీయ రహదారి సమీపంలో ఆవాసాల పక్కనే ఉండటంతో వైసీపీ నాయకుల కన్ను దానిపై పడింది. గతంలో పట్టా ఉన్న మహిళకు కొంత నగదును ఎరవేశారు. ఆమె దగ్గర తాము కొనుగోలు చేసినట్లు అందులోకి ప్రవేశించారు.

నకిలీ పట్టాలతో ప్లాట్ల అమ్మకం

భూమిని కొనుగోలు చేసినట్లు, అందుకు సంబంధించిన అన్ని పత్రాలు తమ దగ్గర ఉన్నట్లు ప్రజలను వైసీపీ నాయ కులు మభ్యపెట్టారు. అనంతరం లేఅవుట్‌ వేసి 3 సెంట్ల చొప్పున ఒక ప్లాట్‌గా ఏర్పాటు చేసి అమ్ముకున్నారు. దీనికి సంబంధించి కొనుగోలుదారులకు తమ బినామీల చేత అగ్రిమెంట్‌ చేయించారు. నకిలీ పట్టాలను సైతం ఇచ్చారు. ఈక్రమంలో వైసీపీ నేతల భూ ఆక్రమణపై పత్రికల్లో వరుసగా కథనాలు వచ్చాయి. దీంతో అప్పటి తహసీల్దార్‌ అందులో ఆ భూమి ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయించారు. దీంతో వైసీపీ నాయకుల దందాకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి.

చక్రంతిప్పిన గ్రామ రెవెన్యూ అధికారి

గత వైసీపీ ప్రభుత్వంలో భూదోపిడీకి పాల్పడే కొంతమంది వైసీపీ నాయకుల తాయిలాలకు తలొగ్గిన ఒక గ్రామ రెవెన్యూ అధికారి సర్వే నెం.659-3 సంబంధించిన రికార్డును తారుమారు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అందులో భూమి ప్రభుత్వ భూమేనని తన చేతులతో హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశారు. ఆ తర్వాత పొరపాటున ప్రభుత్వ భూమి అని అందులో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినట్లు అందులో ఓ మహిళకు అసైన్డ్‌ పట్టా ఉందని ఆమె సాగులో ఉన్నట్లు తప్పుడు నివేదిక ఉన్నతాధికారులకు ఇచ్చారు. తొలుత ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేసి, ఆ తర్వాత సాగులో లేకపోయిన ఉన్నట్లు, పట్టా ఉన్నట్లు ధ్రువీకరణ చేయడంలో పక్కాగా వైసీపీ నేతల తాయిలాలకు తలొగ్గినట్లు తెలుస్తోంది. గ్రామ రెవెన్యూ అధికారితోపాటు గత వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన ఒక తహసీల్దార్‌, కార్యాలయ సిబ్బంది పాత్ర సైతం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

20 నెలల తర్వాత రంగప్రవేశం చేసిన వైసీపీ నాయకులు

వైసీపీ ప్రభుత్వంలో భూమిని కాజేయడానికి ప్రయత్నించి విఫలమైన వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దాదాపు 20నెలల తరువాత ఆ భూమిలోకి రంగప్రవేశం చేశారు. గతంలో వారికి సహకరించిన గ్రామ రెవెన్యూ అధికారి ఇప్పుడు కూడా అక్కడే పనిచేస్తుండటంతో కలిసొచ్చింది. గతంలో ఆయన ఇచ్చిన తప్పుడు నివేదికలు, అసైనీని అడ్డుపెట్టుకొని పదేళ్లకుపైగా సాగులో లేని భూమిలో రాత్రికి రాత్రే మామిడి మొక్కలు వేసి కంచెలు వేశారు. ఆ తరువాత కూడా అందులో పేపర్‌ లేఅవుట్‌ మీద ప్లాట్లు విక్రయించడం చర్చనీయాంశంగా మారింది.

పట్టా ఉన్న మహిళను విచారించిన తహసీల్దార్‌

అసైన్‌మెంట్‌ పట్టా ఉన్న మహిళను తహసీల్దార్‌ ఎన్‌వీబీ.రాజేష్‌ విచారించారు. విచారణ సమయంలో కూడా మహిళ వద్ద గతంలో ప్రభుత్వం కేటాయించినట్లు ఒర్జినల్‌ పట్టాను సైతం చూపలేకపోయింది. అంతేకాకుండా సుమారు 10ఏళ్లు భూమి సాగులో లేకపోవడం, గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ భూమి రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ఈ భూమి ప్రభుత్వ భూమేనని నిర్ధారణ బలపరుస్తున్నాయి.

ప్రజాప్రయోజనాలకు వినియోగించాలంటున్న స్థానికులు

659-3 ఉన్న భూమి ఎప్పటి నుంచో ప్రభుత్వ భూమిని, దానిని కొంతమంది వైసీసీ నాయకులు నకిలీపత్రాలతో ఆక్రమించుకుని అమ్మకాలు చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరిపించి ఆ భూమిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ, ప్రజాప్రయోజనాలకు ఉపయోగించాలని కోరుకుంటున్నారు.

Updated Date - Feb 01 , 2026 | 02:20 AM