విచారణాధికారి ఔట్
ABN , Publish Date - Mar 17 , 2026 | 03:07 AM
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)పై ప్రభుత్వం చేపట్టిన సెక్షన్ 51 విచారణ మలుపు తిరిగింది. ఎట్టకేలకు ప్రభుత్వ పెద్దలు స్పందించారు. ఎంపీ పురందేశ్వరి ప్రత్యేక చొరవ తీసుకుని ఏకంగా సీఎంకు లేఖలు రాయడంతో సీఎంవోలో కదలిక వచ్చింది.
మలుపు తిరిగిన డీసీసీబీపై సెక్షన్ 51 విచారణ
గడువు ముగిసినా పూర్తికాని పరిస్థితి
సీఎంకు లేఖరాసిన ఎంపీ పురందేశ్వరి
స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం
హైకోర్టును ఆశ్రయించిన మరికొందరు
ఇతర రూపాల్లో అనేక ఫిర్యాదులు
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)పై ప్రభుత్వం చేపట్టిన సెక్షన్ 51 విచారణ మలుపు తిరిగింది. ఎట్టకేలకు ప్రభుత్వ పెద్దలు స్పందించారు. ఎంపీ పురందేశ్వరి ప్రత్యేక చొరవ తీసుకుని ఏకంగా సీఎంకు లేఖలు రాయడంతో సీఎంవోలో కదలిక వచ్చింది. విచారణాధికారిగా ఉన్న సహకారశాఖ అదనపు కమిషనర్ గౌరీశంకర్‌ను తొలగించి ఆ స్థానంలో నిజాయితీపరుడు, నిష్పక్షపాతంగా విచారణ చేసే మరో అధికారిని నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు కలెక్టర్, సహకార శాఖ కమిషనర్‌లకు సూచిస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి బి .రాజశేఖర్ ఉత్తర్వులు ఇచ్చారు.
ఒంగోలు, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : డీసీసీబీలో జరిగిన అక్రమాలపై చేపట్టిన విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణాధికారిని మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో డీసీసీబీలో భారీగా అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ విషయమై ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజులకే జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధులు సీఎం చంద్రబాబు, ఇతర ఉన్నతాధి కారులకు ఫిర్యాదు చేశారు. తదనుగుణంగా అప్పటి కలెక్టర్ అన్సారియా ఆ ఫిర్యాదులపై ప్రభుత్వ ఆదేశా లతో ఎస్‌డీసీ లోకేశ్వరరావు నేతృత్వంలో కమిటీతో విచారణ చేయించారు. అనేక అంశాలలో అవినీతి, అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలు నడిచినట్లు లోకేశ్వరరావు కమిటీ తేల్చింది. ఈ నేప థ్యంలో సమగ్ర విచారణ కోసం బ్యాంకుపై సెక్షన్ 51 విచారణకు నాటి కలెక్టర్ సిఫార్సు చేశారు. కానీ వైసీపీ పాలనలో అక్రమాలకు పాల్పడిన వారికి అండగా నిలిచిన ఉన్నతాధికారులు విచారణ పట్ల అయిష్టతతో కాలయాపన చేయగా ఉన్నత స్థాయి జోక్యంతో విచారణ చేపట్టక తప్పలేదు.
తొలి నుంచి వివాదాస్పదమే
సజావుగా విచారణ కోసం జిల్లా నేతలు ఒక అధి కారి పేరును సూచించగా అందుకు విరుద్ధంగా ఆ శాఖ ఉన్నతాధికారులు వ్యవహారించడంతో వారు సూచించిన సహకారశాఖ అదనపు కమిషనర్ గౌరీశంకర్‌ను నాటి కలెక్టర్ విచారణాధికారిగా నియమించారు. అయితే సదరు అధికారి తీరు తొలి నుంచి అనేక విమర్శలుకు తావిచ్చింది. నాలుగు మాసాలలోపు విచారణ పూర్తిచేయాలని ఆదేశాలు ఇవ్వగా ఆ సమయంలోపు ప్రాథమిక ప్రక్రియ కూడా పూర్తిచేయలేదు. మరో రెండు మాసాలు అదనపు గడువుకు అనుమతి తీసుకున్నప్పటికీ అది కూడా ఈనెల 17తో పూర్తయింది. అయినప్పటికి విచారణ ముందుకు సాగలేదు. తొలి నుంచి ఈ విషయంలో విచారణకు మోకాలడ్డుతున్న సహకార శాఖ ఉన్నతాధికారుల సూచనలు, నాటి అక్రమాలలో భాగస్వాములైన ప్రస్తుత డీసీసీబీ పాలన వ్యవహారాలలో చక్రంతిప్పుతున్న అత్యంత అవినీతిపరులుగా పేరున్న కొందరు బ్యాంకు ఉద్యోగుల పైరవీల ప్రభావంతో గౌరీశంకర్ విచారణ సజావుగా సాగడం లేదన్న ఆరోపణలు, విమర్శలు ఆ సమయంలో వచ్చాయి. అ అధికారి తీరు కూడా అలాగే సాగింది. ఆ విషయంపై ‘ఆంధ్రజ్యోతి’లో పలు కథనాలు రావడంతోపాటు కొందరు ఇక్కడి కలెక్టర్‌కు, సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు చేశారు. మరికొందరు విచారణాధికారిని మార్చాలని ఏకంగా హైకోర్టును ఆశ్రయించారు.
సీఎం దృష్టికి డీసీసీబీ వ్యవహారం
డీసీసీబీలో అక్రమాలపై తొలి నుంచి పోరాడుతున్న బ్యాంకు మాజీ చైర్మన్ ఈదర మోహన్‌బాబు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతోపాటు బ్యాంకులో వైసీపీ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలు, విచారణాధికారి తీరు, బ్యాంకు ఉద్యోగుల పాత్ర తదితర అంశాలను బీజేపీ కీలక నేత, ఎంపీ పురందేశ్వరి దృష్టికి తీసుకెళ్లారు. దానిపై స్పందించిన పురందేశ్వరి సదరు అంశాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడుకు ఒకటికి రెండు సార్లు లేఖలు రాశారు. దీంతో వ్యవహారంపై సీఎం కార్యాలయం దృష్టి సారించింది. విచారణ విషయంలో ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతోంది? ఇందులో ఉన్నతాధికారులు, బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఏమిటి? అన్న అంశాలపై సీఎంవో అధికారులు ఆరా తీశారు. వారు నెల క్రితమే విచారణాఽధికారిని మార్చాలని సూచించినట్లు సమాచారం. సంబంధిత ఫైళ్లను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా పరిశీలించినట్లు ప్రచారం సాగుతోంది.
అయినా కాలయాపనే..
విచారణాధికారి మార్పు ఇష్టం లేని కొందరు ఉన్నత స్థాయి అధికారులు న్యాయపరమైన సలహా పేరుతో కాలయాపన చేస్తూ వచ్చినట్లు తెలుస్తోంది. విచారణాధికారి ఇచ్చిన గడువు పెంపు సమయం కూడా గత నెలలోనే పూర్తికావడం, న్యాయ సలహా కూడా అధికారి మార్పునకే అనుకూలంగా రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎట్టకేలకు విచారణాధికారిని మార్చాలన్న నిర్ణయానికి ఉన్నతాధికారులు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విచారణాధికారి గౌరీశంకర్ స్థానంలో మరొక నిజాయితీపరుడైన, నిష్పక్షపాత సీనియర్ అధికారిని నియమించాలని కలెక్టర్‌కు సూచిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈసారి అయినా విచారణ సజావుగా జరిగేలా అధికారిని నియమిస్తారా, అవినీతి, అక్రమ వ్యవహారాలను ఏ మేరకు వెలుగులోకి తెస్తారన్నది వేచిచూడాల్సిందే.