డీసీసీబీపై విచారణ అటకెక్కినట్లేనా!
ABN , Publish Date - May 06 , 2026 | 02:49 AM
సహకార శాఖలో అక్రమాలపై చేపట్టిన విచారణ అడుగు ముందుకు పడటం లేదు. డీసీసీబీలో చోటుచేసుకున్న రుణ కుంభకోణంపై విచారణాధికారిగా ఏడాది క్రితం నియమితులైన ఏసీ గౌరీశంకర్ విచారణను కొలిక్కి తీసుకురాలేదు.
ఏడాది దాటినా పూర్తికాని సెక్షన్ 51 ఎంక్వైరీ
రెండు విడతలుగా ఆరు మాసాలు కాలయాపన చేసిన తొలి విచారణాధికారి
ఆరోపణలు, కోర్టుకు ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన తొలగింపు
మరొకరి నియామకంలో రెండు మాసాలుగా ప్రతిష్టంభన
ఐఏఎస్ స్థాయి అధికారిని నియమిస్తేనే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం
సహకార శాఖలో అక్రమాలపై చేపట్టిన విచారణ అడుగు ముందుకు పడటం లేదు. డీసీసీబీలో చోటుచేసుకున్న రుణ కుంభకోణంపై విచారణాధికారిగా ఏడాది క్రితం నియమితులైన ఏసీ గౌరీశంకర్ విచారణను కొలిక్కి తీసుకురాలేదు. మరోవైపు ఆయన తీరుపై అనేక ఆరోపణలు, ఫిర్యాదులు ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతోపాటు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈనేపథ్యంలో ఈఏడాది మార్చిలో అతనిని విచారణ నుంచి ప్రభుత్వం తొలగించి మరో సమర్థత, నిజాయితీ ఉన్న అధికారిని నియమించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకూ కొత్త అధికారి నియామకమే జరగలేదు. ఇలా ప్రతిష్టంభన నెలకొనడానికి జిల్లా, రాష్ట్ర సహకార శాఖ అధికారులే కారణం అన్న చర్చ సహకారవర్గాల్లో సాగుతోంది. అసలు విచారణను అటకెక్కించేందుకే ఇలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒంగోలు, మే 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లా సహకార కేంద్ర బ్యాంకుపై సెక్షన్ 51 విచారణ అటకెక్కిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏడాది గడిచినా ఇంత వరకూ కొలిక్కి రాకపోవడమే కాక తొలి నుంచి విచారణ తీరు సరిలేకపోవడం అందుకు ఊతమిస్తోంది. మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో డీసీసీబీలో భారీగా అక్రమాలు, అవినీతి వ్యవహారాలు చోటుచేసుకున్నాయి. నాటి వైసీపీ ప్రభుత్వ నామినేటెడ్ పాలకవర్గం, వారికి మించి కొందరు అవినీతిపరులైన ఉద్యోగులు పలు రూపాల్లో బ్యాంకు ధనం తినేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. తమకు వచ్చిన వినతుల ఆధారంగా విచారణ చేయించి చర్యలు తీసుకోవాలని జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధులైన మంత్రి డాక్టర్ స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, అప్పట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి తదితరులు కూడా ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే జనార్దన్ అయితే స్వయంగా సీఎంను కలిసి ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో ఉన్నతాధికారుల సూచన మేరకు 2024 సెప్టెంబరులో అప్పటి కలెక్టర్ తమీమ్ అన్సారియా ఈ వ్యవహారంపై దృష్టిపెట్టారు. అప్పట్లో ఫారెస్టు సెటిల్‌మెంట్ ఆఫీసర్‌గా ఉన్న డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు నేతృత్వంలో త్రిసభ్య కమిటీని విచారణకు నియమించారు. వారు రెండు మాసాలు విచారణ చేసి పలు అవినీతి, అక్రమాలు జరిగాయని నివేదించారు. ఆ నివేదిక ఆధారంగా సమగ్ర విచారణ చేయాల్సి ఉందని, అందుకు సహకార చట్టంలోని సెక్షన్ 51 విచారణ చేయాలని అప్పటి కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరుతూ నివేదించారు. దానిపై ఉన్నత స్థాయిలో కొంతకాలం కదలిక లేకపోవడంతో విషయం సీఎం దృష్టికి తీసుకెళుతూ పురందేశ్వరి లేఖ రాశారు. దీంతో ఎట్టకేలకు 2025 మార్చిలో సెక్షన్ 51 విచారణకు సహకారశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే వారు విచారణాధికారిని నియమించకుండా కాలయాపన చేయడం అప్పట్లో కొంత వివాదస్పదమైంది. చివరకు సహకార శాఖ ఉన్నతాధికారుల సూచనలకు అనుగుణంగా గత ఏడాది ఆగస్టులో ఆశాఖ అదనపు కమిషనర్ గౌరీశంకర్‌ను విచారణాధికారిగా నియమించి నాలుగు నెలల్లోపు విచారణ పూర్తి చేసి నివేదించాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఆ గడువు డిసెంబరు 17తో ముగియగా విచారణ అడుగు ముందుకు సాగలేదు.
తూతూమంత్రంగా విచారణ
తూతూమంత్రంగా వచ్చిపోవడం మినహా సరైన రీతిలో గౌరిశంకర్ విచారణ కొనసాగలేదు. గడువులోపు విచారణ పూర్తిచేయని సదరు అధికారి తనకు మరో రెండు నెలలు అదనపు సమయం కావాలని కోరగా అందుకు ప్రస్తుత కలెక్టర్ రాజాబాబు అనుమతి ఇచ్చారు. అది కూడా ఈ ఏడాది ఫిబ్రవరి 17తో అయిపోగా విచారణ కొలిక్కి రాలేదు. ఈలోపు గౌరీశంకర్ విచారణ తీరుపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. కొందరు అయితే ఆయన సారఽథ్యంలో విచారణ సజావుగా సాగదు కనుక తొలగించాలని హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో విచారణ కొలిక్కి రాకుండానే మార్చి 12న గౌరీశంకర్‌ను తొలగించి మరో నిజాయితీ, నిబద్ధత గల అధికారిని నియమించి వెంటనే విచారణ నిర్వహించి నివేదించాలని కలెక్టర్‌కు సహకార శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. అయితే కొత్త విచారణాధికారరి సహకారశాఖకే చెందిన వారే. అయితే జిల్లా స్థాయిలోనా, రాష్ట్రంలో ఎక్కడి వారైనా అనేది కానీ జిల్లాలో ఇతర శాఖల అధికారిని అయినా నియామకం చేసుకోవచ్చా అనేది ఆ ఉత్తర్వుల్లో స్పష్టత లేనట్లు సమాచారం. ఇక్కడే తొలి నుంచి విచారణకు మొకాలొడ్డుతున్న రాష్ట్ర, జిల్లా సహకారశాఖ అధికారులు కూడబలుక్కోని ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదనలను కలెక్టర్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం.
నిబంధల పేరుతో కాలయాపన
తొలుత ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా కొత్త విచారణాధికారి నియామకంపై నెల్లూరు డీసీవో, పల్నాడు జిల్లా డీసీఏవోల పేర్లను ప్రతిపాదిస్తూ కలెక్టర్‌కు డీసీవో కార్యాలయం నుంచి నివేదించారు. ఇతర జిల్లాల అధికారులను విచారణకు నియమించాలంటే రాష్ట్ర స్థాయి అధికారులు ఆదేశాలు ఇవ్వాలి. లేదా ఆ జిల్లాల కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకొని మాత్రమే ఇక్కడి కలెక్టర్ నియమించే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కాలయాపన చేసే రీతిలో జిల్లా సహకారశాఖ అధికారులు వ్యవహరించి అలా పైల్ పెట్టడంతో ఆ ఇరువురికి సంబంధించి అనుమతి కోరుతూ నెల్లూరు, పల్నాడు కలెక్టర్లకు లేఖలు రాయాలని అందులో ఎవరి నుంచి అనుమతి లభిస్తే వారిని విచారణాధికారిగా నియమించాలని కలెక్టర్ రాజాబాబు జిల్లా సహకార అధికారులకు సూచించారు. అలా వారు ఆ కలెక్టర్లకు లేఖలు రాయగా అందుకు వారు అనుమతించలేదని సమాచారం. ఈ ఉత్తర, ప్రత్యుత్తరాలకు దాదాపు నెలరోజులు సమయం గడిచిపోయింది. ఆ జిల్లాల నుంచి తిరస్కరణలు వచ్చాక మరో రెండు ఇతర జిల్లాల అధికారుల పేర్లతో డీసీవో కార్యాలయం నుంచి మళ్లీ ఫైల్ వారంక్రితం రాగా సదరు అధికారులపై సీరియస్ అయిన కలెక్టర్ ప్రస్తుత పరిస్థితిని సహకారశాఖ కమిషనర్‌కు వివరిస్తూ విచారణాధికారి పేరు సూచించాలని కోరుతూ లేఖ రాయాలని సూచించినట్లు సమాచారం. ఇలా వెనక్కి, ముందుకు సాగుతూ మళ్లీ సహకారశాఖ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల వద్దకే వ్యవహారం చేరింది తప్పా విచారణలో పురోగతి లేదు.
ఉన్నతస్థాయి అధికారితోనే సాధ్యం
నిజానికి విచారణ సజావుగా జరిగి అక్రమాలు నిగ్గుతేల్చాలి అనే ఆలోచన ఉన్నతాధికారులకు ఉంటే తొలుతే కాలయాపన లేకుండా ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించి తద్వారా విచారణ పూర్తిచేయాల్సింది. గతంలో గుంటూరు జిల్లా బ్యాంకులో ఈ తరహా అక్రమాలపై అక్కడ జాయింట్ కలెక్టర్‌తో విచారణ చేయించగా అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చి అక్రమార్కులపై చర్యలు తీసుకున్నారు. అలాగే జిల్లాలోనూ డీసీసీబీతో పోల్చితే ఒక బ్రాంచి స్థాయి సహకార సంస్థ అయిన గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘంపై ఫిర్యాదులు వస్తే గత ఏడాది ఇక్కడి ఏసీ గోపాలకృష్ణ విచారణ చేశారు. ఆయన నివేదిక ఆధారంగా పలువురిపై ఇటీవల చర్యలు తీసుకున్నారు. అలాంటి ఉన్నతస్థాయి అధికారిచే విచారణ చేయించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన డీసీసీబీ విషయంలో మాత్రం తొలి నుంచి సహకారశాఖ ఉన్నతాధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండగా జిల్లాలో ఆ శాఖ అధికారులు కూడా ఇక్కడి కలెక్టర్లకు వాస్త పరిస్థితిని వివరించి సజావుగా విచారణ సాగేలా తగు సమాచారం ఇవ్వడం లేదన్న ఆరోపణలు సహకారశాఖ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లాలో సమర్థత గల అధికారిగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న జాయింట్ కలెక్టర్ చేత విచారణ చేపిస్తే డీసీసీబీలో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలన్ని వెలుగుచూసే అవకాశం ఉంది.