ఉద్యానానికి ఊతం
ABN , Publish Date - Jan 11 , 2026 | 11:38 PM
మార్కాపురం జిల్లా మొత్తం ఉద్యాన పంటలకు కేంద్రంగా మారనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు కానుంది.
మార్కాపురం జిల్లాలోని 21 మండలాలకు మహర్దశ
రూ.950 కోట్లతో హార్టికల్చర్ హబ్
ఉమ్మడి జిల్లాలో ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 60 : 40 శాతం
రానున్న ఐదేళ్లలో ఈ నిధులన్నీ ఖర్చుచేసేలా ప్రాజెక్ట్ రూపకల్పన
రెండు జిల్లాల రైతులకు ఎంతో ప్రయోజనం
మార్కాపురం జిల్లా మొత్తం ఉద్యాన పంటలకు కేంద్రంగా మారనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు కానుంది. దీనివల్ల ఉద్యానపంటలు సాగు చేసే రైతులకు బహుముఖప్రయోజనం కలగనుంది. ఇప్పటికే కొత్త జిల్లాలోని పలు మండలాల్లో మిర్చి, బొప్పాయి, అరటి తదితర పంటలు సాగుచేస్తున్నారు. హార్టికల్చర్ హబ్ ద్వారా 18 రకాల పంటలకు అన్ని విధాలా తోడ్పాటు అందనుంది. ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడంతోపాటు ప్రాసెసింగ్ యూనిట్లు, వాటి అనుబంధ రంగాలు ఏర్పాటవుతాయి. దీనివల్ల రైతులు ఆర్థికంగా బలపడడంతోపాటు యువకులు, మహిళలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
మార్కాపురం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి) : ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు పూర్తిస్థాయిలో చేయూత ఇచ్చి వారిని లాభాలబాటలో నడిపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు రూ.950కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు మేలు జరిగేలా త యారు చేసిన ఈ ప్రాజెక్ట్‌కు పూర్వోదయ స్కీం ద్వారా కేంద్రప్రభుత్వం వాటాగా 60 శాతం నిధులు సమకూర్చనుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 40 శాతం అందించనుంది. ఆ మొత్తాన్ని రానున్న ఐదేళ్లలో ఖర్చు చేసి రైతులకు మేలు జరిగేలా హబ్‌ను తీర్చదిద్దనుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా రైతులందరికీ మేలు జరగనుండగా ఉద్యాన పంటల సాగులో ముందంజలో ఉన్న మార్కాపురం జిల్లా రైతులకు దీనిద్వారా మరింత ప్రయోజనం చేకూరనుంది.
మార్కాపురం జిల్లాలోని 21 మండలాల్లోనూ ఉద్యాన పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. త్వరలో ఈ కార్యక్రమం ప్రారంభమైతే జిల్లా రైతుల వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మారిపోయి అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడతాయని ఉద్యానశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.
18 రకాల పంటలకు చేయూత
ప్రధానంగా మార్కాపురం జిల్లాలో మిర్చి, బొప్పాయి, అరటి తదితర పంటలను ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏటా సుమారు 52వేల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తుంటే అందులో కొత్తగా ఏర్పడిన జిల్లాలోనే 32వేల ఎకరాల సాగు ఉంటుందని అంచనా. అలాగే అరటి, బొప్పాయి పంటలు కూడా ఇక్కడే ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ హబ్ ద్వారా మొత్తం 18 రకాల పంటల సాగుకు చేయూత ఇచ్చేలా రూపకల్పన చేశారు. అరటి, మామిడి, బొప్పాయి, నిమ్మ, టమాటా, మిర్చి తదితర పంటల సాగుకు మేలు చేకూరుతుంది. హార్టికల్చర్ హబ్ ఏర్పాటు ద్వారా రైతుల ఆదాయం పెంపు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల పెంపు, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి ప్రాధాన్యత దక్కుతుంది.
హబ్ ఏర్పాటుతో ఉద్యాన రైతులకు మేలు
గోపీచంద్, జిల్లా ఉద్యానశాఖ అధికారి
హార్టికల్చర్ హబ్ ద్వారా ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు మేలు చేకూరుతుంది. ఆర్థిక అభివృద్ధితోపాటు వారికి కొత్తరకం సాగు విధానాలు, స్థానికంగానే ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకింగ్ సదుపాయాలు, పంటలకు కచ్చితమైన ధరల నిర్ణయం వంటి అంశాల ద్వారా ప్రయోజనం కలుగుతుంది. ఈ కార్యక్రమం ప్రారంభించిన తరువాత ఐదేళ్లపాటు రైతుల కోసం నిధులు ఖర్చు చేసి వారికి లబ్ధిచేకూరేలా హబ్ కార్యకలాపాలు సాగుతాయి.