గూడెం.. గోడు
ABN , Publish Date - Jul 14 , 2026 | 03:14 AM
అది పుల్లలచెరువు మండలం లోని నరజాముల తాండా. స్వాతంత్ర్యానికి ముందు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలో ఆ ఊరు ఉంది. ఆతర్వాత రెవెన్యూ అధికారులు పట్టాలివ్వడంతో అక్కడి గిరిజనులు ఇళ్లు నిర్మించుకున్నారు. అన్ని మౌలిక వసతులు పొందారు. కానీ అదంతా అటవీ భూమి అని, మీకు ఎటువంటి హక్కులు లేవని రెండేళ్ల నుంచి అటవీశాఖ అధికారులు చెప్తున్నారు.
స్వాతంత్ర్యానికి ముందు నుంచే అక్కడ గ్రామం
ఇప్పుడు ఎలాంటి హక్కులులేవంటున్న అటవీ అధికారులు
జాతీయ ఎస్టీ కమిషన్ ముందుకు సమస్య
రెండేళ్లుగా తిరుగుతున్న నరజాముల తాండా గిరిజనులు
మరోమారు కొనసాగిన విచారణ... కొలిక్కిరాని సమస్య
మార్కాపురం, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : అది పుల్లలచెరువు మండలం లోని నరజాముల తాండా. స్వాతంత్ర్యానికి ముందు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలో ఆ ఊరు ఉంది. ఆతర్వాత రెవెన్యూ అధికారులు పట్టాలివ్వడంతో అక్కడి గిరిజనులు ఇళ్లు నిర్మించుకున్నారు. అన్ని మౌలిక వసతులు పొందారు. కానీ అదంతా అటవీ భూమి అని, మీకు ఎటువంటి హక్కులు లేవని రెండేళ్ల నుంచి అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన పట్టాలు చూపినా అవి చెల్లుబాటు కావని స్పష్టం చేస్తున్నారు. అక్కడ వ్యవసా యం చేస్తున్న రైతులకు వివిధ కారణాలు చూపి జరిమానాలు కూడా విధిస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో తాండా వాసులు సమస్యను ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కమిషన్ ఇప్పటికే ఒకసారి విచారణ నిర్వహించింది. సోమవారం కూడా హైదరాబాద్‌లో దీనిపై రెండో విడత విచారణ చేపట్టినప్పటికీ సమస్య కొలిక్కిరాలేదు. దీంతో తాండా వాసులు ఆందోళన చెందుతున్నారు. పుల్లలచెరువు మండలంలోని ఎర్రగొండపాలెం - మాచర్ల జాతీయ రహదారికి ఇరువైపులా ప్రస్తుతం కనిపించే నరజాముల తాండా గ్రామం ఏర్పడి వందల సంవత్సరాలు గడిచింది. 258 కుటుంబాల వారు ఇక్కడ నివసిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఈ గ్రామం మీదుగా జాతీయ రహదారి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో రోడ్డు కోసం సేకరించిన భూమికి పరిహారం కావాలని రైతులు కోరారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఉంటున్న ఇళ్లకు కేటాయించిన భూమి కానీ, రైతులంతా వ్యవసాయం కోసం వినియోగించుకుంటున్న 300 ఎకరాల పొలాలు కానీ మీవి కావు, వాటిపై మీకు ఎటువంటి హక్కు లేదని అటవీ అధికారులు చెప్పడంతో తాండా ప్రజల్లో అలజడి మొదలైంది. అటు పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారుల వద్దకు, ఇటు అటవీ శాఖ ఉన్నతాధికారుల వద్దకు తిరిగినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో కొందరు గిరిజనులు 2024 ఆగస్టు 14న జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి సమాచారంతో తమ ముందు హాజరుకావాలని రెవెన్యూ, అటవీ అధికారులకు ఎస్టీ కమిషన్ నోటీసులు ఇచ్చింది. 2025 ఆగస్టు 11న హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశానికి అప్పటి ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్, మార్కాపురం డీఎఫ్‌వో హాజరయ్యారు. తమకు మరో రెండు నెలలు సమయం ఇస్తే రికార్డులతో వస్తామని చెప్పారు. ఇప్పుడు మార్కాపురం జిల్లా ఏర్పాటవడంతో సోమవారం జరిగిన సమావేశానికి మార్కాపురం ఆర్డీవో శివరామిరెడ్డి, అటవీ శాఖ అధికారులు హాజరయ్యారు. అయినా ఇంకా సమస్యపై స్పష్టత రాలేదు.
రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమస్య ఇదీ
నరజాముల తాండా గిరిజనులు 1976-77లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావును కలిసి తాము వ్యవసాయం చేసుకునేందుకు చెరువు నిర్మాణానికి అనుమతి కావాలని కోరారు. అనంతరం 250 ఎకరాల్లో పెద్దవాగు చెరువు నిర్మాణం చేపట్టడం జరిగింది. గ్రామానికి వ్యవసాయ భూమి, ఇళ్ల స్థలాల కోసం 1994లో గిరిజనులు దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు వారికి భూమి ఇచ్చేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని అటవీ శాఖ జీవో ఇచ్చింది. దీని ఆధారంగా 300 ఎకరాల వ్యవసాయ భూమి, 40 ఎకరాల నివాస స్థలానికి రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చారు. రెండేళ్ల క్రితం ఈ ప్రాంతం మొత్తం అటవీశాఖ పరిధిలోనే ఉందని, దీనిపై గిరిజనులకు ఎటువంటి హక్కులు లేవని అప్పట్లో మార్కాపురం డీఎఫ్‌వోగా ఉన్న విఘ్నేష్ అప్పావ్ చెప్పడంతో వివాదం మొదలైంది. అటవీ శాఖ అనుమతి ఇచ్చినట్టు జీవో కానీ, ఇతర ఆధారాలు ఉంటే తేవాలని ఆయన చెప్పారు. అయితే అవి లభ్యం కాలేదని రెవెన్యూ అధికారులు దాటవేస్తూ వస్తున్నారు. 1994లో 515 సర్వే నెంబరు నుంచి 565వరకు ఎఫ్‌ఎంబీలు సిద్ధం చేసి పట్టాలు ఇచ్చామని మాత్రం వారు చెప్తున్నారు. అవన్నీ అక్రమంగా ఇచ్చినవని అటవీ అధికారులు వాదిస్తున్నారు. అయితే 300 ఎకరాలను 40 మంది సర్వేయర్లు సర్వే చేస్తూ భూములను తమకు కేటాయిస్తున్నప్పుడు అటవీ అధికారులు ఏమయ్యారని గిరిజనులు వాదిస్తున్నారు. దీనిపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాలోతు హుస్సేన్ సోమవారం మరోమారు సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశానికి రెవెన్యూ, అటవీశాఖ అధికారులు హాజరైనప్పటికీ సమస్యపై స్పష్టత లేక మళ్లీ వాయిదా పడింది. అటవీ, రెవెన్యూశాఖలు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో విచారణ, రికార్డులు పరిశీలించి సమస్యను పరిష్కరించాలని కమిషన్ సభ్యులు సూచించారు.