Share News

విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:05 PM

రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చెప్పారు.

విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం
దివ్యాంగ పిల్లలకు పరికరాలు అందజేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే, జేసీ

దివ్యాంగులకు పరికరాలు అందజేసిన ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల

ఒంగోలు కలెక్టరేట్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చెప్పారు. అందులో భాగంగానే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వారికి అవసరమైన వస్తువులను అందించేందుకు చర్యలు తీసుకుందన్నారు. సర్వశిక్ష అభియాన్‌ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని మీకోసం హాలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌తో కలిసి ఎంపీ రూ.30 లక్షల విలువ చేసే వివిధ రకాల వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ విభిన్న అవసరాలు కలిగిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఇస్తున్న పింఛన్లను పెంచారన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్‌ విద్యాశాఖలో అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే జిల్లాకు ఏడు ఆర్టీసీఎం కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం అనుమతులు పొందారన్నారు. శాసనసభ్యుడు దామచర్ల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్య రంగంతో పాటు వివిధ లోపాలతో పుట్టిన పిల్లలను ఆదుకునేందుకు ప్రత్యేకచర్యలు తీసుకుంటోందన్నారు. జేసీ కల్పనాకుమారి మాట్లాడుతూ ఐఈఆర్టీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను వివరించారు. అనంతరం దివ్యాంగులకు అవసరమైన పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో రేణుక, సర్వశిక్ష అభియాన్‌ కో ఆర్డినేటర్‌ అనిల్‌కుమార్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆర్‌. వెంక ట్రావు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 11:05 PM