Share News

భూగర్భ జలాల పెంపే లక్ష్యం

ABN , Publish Date - Apr 06 , 2026 | 11:46 PM

చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, తద్వారా భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. సోమవారం గిద్దలూరు మండలం కంచుపల్లె గ్రామంలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

భూగర్భ జలాల పెంపే లక్ష్యం
కంచుపల్లెలోని రంగారెడ్డి చెరువును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

రంగారెడ్డి చెరువును

పరిశీలించిన ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

కంచుపల్లెలో నీటి భద్రత

సాగునీటి సంఘాల బాధ్యత

గిద్దలూరు టౌన్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి) : చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, తద్వారా భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. సోమవారం గిద్దలూరు మండలం కంచుపల్లె గ్రామంలో నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా గ్రామ సమీపంలో ఉన్న రంగారెడ్డి చెరువును ఆయన పరిశీలించారు. అధికారులకు, సాగునీటి సంఘాల సభ్యులకు ఈసందర్భంగా పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమంలో భాగంగా రానున్న 90 రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుకు నిదర్శనమన్నారు. ప్రస్తుతం చెరువుల పరిస్థితిని గమనించి పూడికతీత, కాలువల అనుసంధానం తద్వారా చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపడతారన్నారు. రంగారెడ్డి చెరువు వద్ద ఆయకట్టుదారులు, స్థానికులతో చెరువు స్థితిగతుల గురించి అవసరమైన మరమత్తులు చేసి నీటి నిలువలు పెంచాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ డీఈ సీహెచ్‌ రామారావు, మార్కెట్‌యార్డు చైర్మన్‌ బైలడుగు బాలయ్య, జడ్పీటీసీ సభ్యుడు బుడతమధుసూదన్‌, మాజీ సర్పంచ్‌ దప్పిలి శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో సీతారామారావు, ఆయకట్టు చైర్మన్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

జల వనరుల సంక్షరణకు పెద్దపీట .. ఎరిక్షన్‌బాబు

పెద్దదోర్నాల : జలవనరుల సంరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పేర్నొన్నారు. మండలంలోని చిన్నగుడిపాడు చెరువు వద్ద నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. చెరువు కట్టపై గంగమ్మ అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన సభలో ఎరిక్షన్‌బాబు మా ట్లాడుతూ కరువుతో అల్లాడుతున్న ఈప్రాంతం సస్యశ్యామలం కావాలంటే నీటి వనరులు అభివృద్ధి చెందాలన్నారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తు చర్యల్లో భాగంగా నీటి వనరుల అభివృద్ధి చేపట్టారన్నారు. సంబంధిత అధికారులు, సాగునీటి సంఘాల అధ్యక్షులు, సభ్యులు చెరువుల అభివృద్ధికి నిదేదికలు రూపొందించాలన్నారు. ఇప్పటికే నియోజకవర్గానికి రూ.9కోట్ల నిధులు మంజూరు చేయగా పెద్దబొమ్మలాపురం చెరువుకు రూ.4,72లక్షలు మంజూరైనట్లు చెప్పారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నట్లు ఆయన ఎరిక్షన్‌బాబు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసూనదేవి, తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌రెడ్డి, ఇరిగేషన్‌ ఏఈ పోలు రాజు, ఏవో జవహర్‌లాల్‌ నాయక్‌, పీఆర్‌ ఏఈ సుబ్బారెడ్డి, సొసైటీ అధ్యక్షుడు బట్టు సుధాకర్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు షేక్‌ మాబు, శేషాద్రి, మల్లయ్య పాల్గొన్నారు.

కనిగిరి : నీటి సంరక్షణకు నీటి సంఘ కమిటీలు బాధ్యత వహించాలని జలవనరుల శాఖ కనిగిరి డీఈఈ విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. స్థానిక అమరావతి గ్రౌం డ్స్‌లో సోమవారం నీటి సంఘాల సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నీటి సంరక్షణతో పాటు చెరువుల అభివృద్ధి కోసం ప్రభుత్వం మరింత ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో మరమ్మతులకు గురై ఆదరణ కోల్పోయిన చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్ర త్యేక కార్యాచరణను అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నీటి సంఘాల కమిటీ సభ్యులు మోపాడు చైర్మన్‌ కొండయ్య, మండలపార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఫిరోజ్‌, నాగిరెడ్డి, బాలబాబు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2026 | 11:46 PM