ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయం
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:08 AM
ఉద్యోగుల సమస్యల పరిష్కా రమే ధ్యేయంగా వచ్చేనెల 5వతేదీన ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు ఏపీఆర్‌ఎస్‌ఏ జేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు.
వచ్చేనెల 5న నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయాలి
ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
ఒంగోలు కలెక్టరేట్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : ఉద్యోగుల సమస్యల పరిష్కా రమే ధ్యేయంగా వచ్చేనెల 5వతేదీన ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు ఏపీఆర్‌ఎస్‌ఏ జేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. స్థానిక రెవెన్యూ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. 12వ పీఆర్సీ అమలుతోపాటు మధ్యంతర భృతి మంజూరు చేయాలన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న బకాయిల సాధనే ఈ మహాసభల ప్రధాన లక్ష్యమన్నారు. ఉద్యోగులకు రూ.25వేల కోట బకాయిలు ఉన్నాయని, వాటన్నింటిని ప్రభుత్వం విడుదల చేయాలన్నారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌యాదవ్ హాజరవుతున్న ఈ మహాసభలో ఉద్యోగుల గళాన్ని ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్తామన్నారు. ఉద్యోగులందరూ ఈ మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయాలని బొప్పరాజు కోరారు.
ఒంగోలు డివిజన్ నూతన కార్యవర్గం ఎన్నిక
ఏపీ జేఏసీ అమరావతి ఒంగోలు డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డివిజన్ చైర్మన్‌గా బి.సత్యసాయి శ్రీనివాసరావు(తహసీల్దార్), అసోసియేట్ చైర్మన్‌గా కే. చిరంజీవిరావు, వైస్‌చైర్మన్లుగా పి.రజిని, ఆర్.పుల్లయ్య, జి.నాగరాజు, కార్యదర్శిగా జీ.మాధవరావు, జాయింట్ సెక్రటరీలుగా టి.అజయ్‌బాబు, వి.సతీష్‌బాబు, కే.పద్మావతి, కోశాధికారిగా రోహిత్‌రెడ్డి, సభ్యులుగా ఎ.జార్జి, బి.వెంకటేష్‌లను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గసభ్యులను అభినందించారు. కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నాయకులు నాగేశ్వరరావు, సంగీతరావు, జిల్లా చైర్మన్ పిన్నిక మధుసూదనరావు, పోలయ్య, సుబ్రహ్మణ్యం, ఊతకోలు శ్రీనివాసరావు, రాజేష్, ప్రశాంత్, రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శి ఆర్.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.