Share News

పేదలకు పక్కా గృహాల కల్పనే లక్ష్యం

ABN , Publish Date - Mar 30 , 2026 | 11:56 PM

ప్రతి పేద కుటుంబానికి స్వంతంగా ఇల్లు కల్పించటమే ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. మున్సిపాల్టీ 7వ వార్డు పరిధిలోని చాకిరాల వద్ద పీఎంఏవై పథకం కింద నిర్మించిన గృహాన్ని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి సోమవారం ప్రారంభించారు.

పేదలకు పక్కా గృహాల కల్పనే లక్ష్యం
గృహాన్ని ప్రారంభించి నమూనాను యజమానికి అందజేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

పీఎంఏవై గృహ ప్రవేశ మహోత్సవంలో

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

కనిగిరి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : ప్రతి పేద కుటుంబానికి స్వంతంగా ఇల్లు కల్పించటమే ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. మున్సిపాల్టీ 7వ వార్డు పరిధిలోని చాకిరాల వద్ద పీఎంఏవై పథకం కింద నిర్మించిన గృహాన్ని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ స్వంత ఇల్లు ఉండాలనేది ఆకాంక్షగా ఉంటుందన్నారు. దాన్ని నెరవేర్చుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నందు వలన పేదవాడికి స్వంత ఇల్లు కలగానే మిగిలిపోతుందని చెప్పారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.5లక్షల ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో పీఎంఏవై పథకం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నిధులతో బృహత్తర కార్యక్రమాన్ని కార్యరూపం ఇచ్చి విజయవంతంగా అమలు చేసిందన్నారు. రానున్న మూడేళ్లలో కనిగిరి ప్రాంతంలో ప్రతి పేద కుటుంబానికి స్వంత ఇల్లు నిర్మించి ఇచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. అనంతరం గృహ యజమానులు మునగాల హైమావతి, మాల్యాద్రిల దంపతులకు గృహ నమూనాను అందచేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ డీఈ కోటిరెడ్డి, ఏఈ ముసలయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ పర్వతనేని శ్రీధర్‌, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఫిరోజ్‌ పాల్గొన్నారు.

మార్కాపురం టౌన్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మార్కాపురం కలెక్టర్‌ ఎం.విజయ సునీత అన్నారు. స్థానిక 16వ వార్డులోని భగత్‌సింగ్‌ కాలనీలో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్లల్లో సోమవారం గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌ విజయ సునీత మాట్లాడుతూ పీఎంఏవై పథకం పేదలకు వరంలాంటిదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కింద 2.50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. మార్కాపురం జిల్లాలో త్వరితగతిన ఎక్కువ గృహాలు నిర్మించేందుకు అధికారులు చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పథకం కింద నియోజకవర్గంలో 3,241 గృహాలను పూర్తి చేసినట్లు తెలిపారు. మొత్తం రూ.3లక్షలు ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రభు త్వం అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పి.ప్రభాకర్‌, హౌసింగ్‌ పీడీ మోహన్‌రావు, డీఈ పవన్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు, ఏఎమ్‌సీ ఛైర్మన్‌ మాలపాటి వెంకటరెడ్డి, కౌన్సిలర్‌ దారివేముల హర్షితబాబీ పాల్గొన్నారు.

పేదలకు కూడు, గుడ్డ అందించడమే ధ్యేయం

నూతన గృహప్రవేశాల్లో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు టౌన్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): పేదలకు కూడు, గుడ్డు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని మోడంపల్లి లేఅవుట్‌ పక్కన గల ఎన్టీఆర్‌ కాలనీలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా నూతన గృహ నిర్మాణంలో భాగంగా కొత్త లక్ష్మీదేవి, సుబ్బరత్నం దంపతులకు నూతన గృహం మంజూరు అయి వారు నిర్మించుకున్న అనంతరం ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ప్రారంభించి యజమాని దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని, ఇళ్లు లేని వారికి గృహ నిర్మాణ సంస్థ ద్వారా లబ్ది చేకూరేలా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్‌ బైలడుగు బాలయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ ఈవీ రమణబాబు, టీడీపీ నాయకులు పాలుగుళ్ల ప్రతాపరెడ్డి, పాలుగుళ్ల చిన్నశ్రీనివాసరెడ్డి, కడియం శేషగిరి, లొక్కు రమేష్‌, దేమా నరసింహులు పాల్గొన్నారు.

పేదల ఇంటి కల నెరవేర్చడమే ధ్యేయం

టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం రూరల్‌ : నిరు పేదల ఇంటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. సోమవారం మండలంలోని మిల్లంపల్లి పంచాయతీ పరిధిలో వేగినాటి కోటయ్య నగర్‌లోని మంగ్లి హనుమమ్మ ఇంటిని నిర్మించగా గృహ ప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం ద్వారా ఎస్టీలకు రూ.2.30లక్షలతో ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల ఇంటి కలను సాకారం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని ఎరిక్షన్‌బాబు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ చేకూరి సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల వెంగళరెడ్డి, గృహ నిర్మాణ శాఖ డీఈ సురేష్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రకాష్‌, వేగినాటి శ్రీను, కంచర్ల సత్యనారాయణ గౌడ్‌, మహేష్‌ నాయుడు పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2026 | 11:56 PM