సత్వర వైద్యసేవలే లక్ష్యం
ABN , Publish Date - Jun 25 , 2026 | 03:19 AM
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త విధానానికి సంకల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ విధానాన్ని అమలులోకి తెస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలం కృష్టంశెట్టిపల్లి (కేఎస్‌పల్లి) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంజీవిని డిజిటల్ సర్వ్‌ను ఈనెల 27న ప్రారంభిం చనున్నారు
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంజీవని డిజిటల్ సర్వ్ సెంటర్లు
27న ప్రారంభించనున్న సీఎం
ఒంగోలు కలెక్టరేట్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త విధానానికి సంకల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ విధానాన్ని అమలులోకి తెస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలం కృష్టంశెట్టిపల్లి (కేఎస్‌పల్లి) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంజీవిని డిజిటల్ సర్వ్‌ను ఈనెల 27న ప్రారంభిం చనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా టాటా డిజిటల్ సర్వ్ సెంటర్ సహకారంతో అమలుకు చర్యలు తీసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒకరిని పెషేంట్ కేర్ కోఆర్డినేటర్‌గా నియమిస్తారు. పీహెచ్‌సీలకు వైద్యం కోసం వచ్చే వారి వివరాలన్నింటినీ నమోదు చేస్తారు. వాటిని కంప్యూటరీకరణ చేసి డాక్టర్ వద్దకు పంపిస్తారు. డాక్టర్ ఆ రోగిని పరీక్షించిన అనంతరం అవసరమైతే వైద్య పరీక్షలు చేయిస్తారు. ఆ వివరాలను డిజిటలైజేషన్ చేస్తారు. ఆయనకు ఇచ్చిన మందులను కూడా అందులోనే నమోదు చేస్తారు. మరలా డాక్టర్ వద్దకు ఎప్పుడు రావాలన్న వివరాలను కూడా పొందుపరుస్తారు.
నిత్యం అందుబాటులో ఉంటూ..
సాధారణంగా కొద్దిగా వ్యాధి తగ్గిదంటే ఇక తిరిగి వైద్యశాలకు ఎవరూ రారు. అయితే ఆరోగ్య కేంద్రంలో నియమించిన సంజీవిని డిజిటల్ సర్వ్ సెంటర్‌లో నియమించిన కేర్ కోఆర్డినేటర్ నిత్యం ఆ రోగితో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటారు. డాక్టర్ వద్ద వైద్యం పొందిన అనంతరం ఆరోగ్యం ఎలా ఉంది? మందులు వేసుకుంటున్నారా? తదితర వివరాలన్నింటినీ సేకరిస్తారు. మరలా వైద్యుడికి చూపించుకునే ముందు రోజు కోఆర్డినేటర్ రోగికి ఫోన్ చేసి ఆ విషయాన్ని గుర్తు చేస్తారు. వైద్యశాలకు ఎప్పుడు వస్తారన్నది తెలుసుకుంటారు. అలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగికి అవసరమైన వైద్య సహాయం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో కూడా ఓ కోఆర్డినేటర్‌ను నియమించనున్నారు. ఆయన ఆ నియోజకవర్గ పీహెచ్‌సీల్లో పనిచేసే కేర్ కోఆర్డినేటర్లను సమన్వయం చేసుకుంటూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించే దిశగానే ప్రభుత్వం సంజీవిని డిజిటల్ సర్వ్‌ను ప్రారంభిస్తోంది.