కనిగిరిలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - Aug 10 , 2026 | 11:53 PM
కనిగిరిలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు.
ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి
రూ.177కోట్లతో మంచినీటి పైపులైన్ పనుల ప్రారంభానికి భూమిపూజ
కనిగిరి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : కనిగిరిలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. పట్టణ సమీపంలోని మోడల్‌స్కూల్ సమీపంలో ఇంటింటికీ నీటి కుళాయిల కోసం చేపట్టిన మంచినీటి పైపులైన్ పనులకు సోమవారం ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఇంటింటికీ మంచినీటీని అందించేందుకు కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్నారు. అందులో భాగంగా తొలిదశలో రూ.4కోట్లతో మోడల్‌స్కూల్ వద్ద ఉన్న లేఅవుట్‌లో దాదాపు 1000 కనెక్షన్‌లు 5.5 కిలోమీటర్ల మేర మంచినీటి పైపులైన్ ఏర్పాటు చేస్తామన్నారు. వెనువెంటనే మున్సిపాల్టీ పరిధిలోని 11,500 కుళాయిలు ఇస్తామని చెప్పారు. అందులో భాగంగా కనిగిరి పట్టణంలో ఎంఎన్‌ఎం కాలేజీ, కొత్తూరు, కాశిరెడ్డినగర్, మోడల్‌స్కూల్ వద్ద 4 ఓహెచ్‌ఆర్ ట్యాంకులను నిర్మిస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం శిలాఫలకాలకే పరిమితమైందని విమర్శించారు. వీలైౖనంత త్వరగా వచ్చే ఏడాది 2027 ఆగస్టు నాటికి పనులు పూర్తి చేసి ప్రజలకు మంచి నీటిని అందించాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. గతంలో వెలిగొండ ప్రాజెక్టు నుంచి కనిగిరికి నీరు వస్తుందా, లేదా అనే అపోహలో ఉన్నామని, ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్కాపురం వచ్చిన సందర్భంలో కనిగిరి ప్రాంత దుస్థితిపై వివరించినట్లు చెప్పారు. ప్రస్తుతం మార్కాపురంలోని గొట్టిపడియకు రూ.3వేల కోట్లు వెచ్చించి నీళ్ళు నింపే కార్యాక్రమానికి వచ్చే నెల 1వ తేదీకి శ్రీకారం పలికినట్లు తెలిపారు. దాని ద్వారా రూరల్ ప్రాంతాలకు నీళ్లు మళ్లించే ప్రక్రియలో భాగంగా కనిగిరి ప్రాంతానికి కూడా నీటిని తెప్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అంతేకాకుండా రామతీర్థ నుంచి సాగర్ నీటి మళ్లింపుతో పాటు గొట్టిపడియ నీటిని ఇంటర్‌చేంజ్ కార్యక్రమాన్ని చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. దీంతో కనిగిరి ప్రాంతానికి శాశ్వత మంచినీటి సమస్యకు పరిష్కారం లభిస్తుదన్నారు. భవిస్యత్తులో కనిగిరి ప్రాంతంలోని ఏ బిడ్డకు ఫ్లోరైడ్‌తో ప్రాణాలతో చెలగాటమాడే ఇబ్బందుల నుంచి తప్పించటమే తన సంకల్పమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ పవన్‌కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ నాయబ్‌రసూల్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, సిబ్బంది, నాయకులు రాచమల్ల శ్రీనివాసులురెడ్డి, షేక్ ఫిరోజ్, దొడ్డా సురే్‌షరెడ్డి, కొట్టే ప్రసాద్, ఏనుగు శ్రీనివాసులరెడ్డి, జానీ, నజిముద్దీన్, కాంట్రాక్టర్ మామిడాల భాస్కర్ పాల్గొన్నారు.