వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
ABN , Publish Date - Nov 26 , 2026 | 02:40 AM
వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వరంగ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. ఎస్ఎస్సీ మిషన్ మార్చి-27 పేరుతో దీన్ని తయారు చేసింది.
పదో తరగతి విద్యార్థులకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక
ఎస్ఎస్సీ మిషన్-27కు అంతా సిద్ధం
1నుంచి ప్రత్యేక తరగతులు, పరీక్షలు
ఒంగోలు విద్య. నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వరంగ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. ఎస్ఎస్సీ మిషన్ మార్చి-27 పేరుతో దీన్ని తయారు చేసింది. అందుకు సంబంధించి రెండో దశ వంద రోజుల ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ తయారు చేసింది. వచ్చేనెల 1 నుంచి దీన్ని అమలు చేయనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెలాఖరులోపు సిలబస్ పూర్తిచేసి డిసెంబరు 1 నుంచి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టనున్నారు. మిషన్ మార్చి-27 రెండో దశ కార్యాచరణ ప్రణాళిక అమలులో విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రత్యేక తరగతులు, పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులను పూర్తిస్థాయిలో పరీక్షలకు సన్నద్ధం చేయడంపైనే దృష్టి సారించనున్నారు. ఈ రెండో దశ డిసెంబరు 1 నుంచి మార్చి 14 వరకు వంద రోజులపాటు కొనసాగ నుంది. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 9 గంటల వరకు చదువులో వెనుకబడిన విద్యార్థుకు రెమెడియల్ తరగతులు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నాలుగు సెషన్ల లో వివిధ సబ్జెక్టుల తరగతులు ఉంటాయి. సాయంత్రం 4 నుంచి 5గంటల వరకు రోజువారీ అసెస్మెంట్ స్లిప్ టెస్టులు నిర్వహిస్తారు. విద్యార్థుల్లో సబ్జెక్టులపై పట్టు పెంచడం, వెనుకబడిన వారికి ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా పరీక్షల పట్ల భయం తొలగించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యాచరణను అమలు చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా కృషిచేయాలని పాఠశాల హెచ్ఎంలు, సబ్జెక్టు ఉపాధ్యాయులను ఆదేశించింది. జనవరిలో విద్యార్థులకు ఫార్మెటివ్ అసెస్మెంట్-3, ఫిబ్రవరిలో ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 5 వరకు గ్రాండ్ టెస్టులు ఉంటాయి. మార్చి 11 నుంచి 14 వరకు తుది విడత పునఃశ్చరణ చేపడతారు.