Share News

కారులో ఉన్న గంజాయి, మద్యం సీజ్‌ చేసినవే!

ABN , Publish Date - Aug 18 , 2026 | 02:25 AM

రోడ్డు ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న గంజాయి, మద్యం ఓ కేసులో సీజ్‌ చేసినవేనని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి అద్దంకి మండలం శంఖవరప్పాడు (పాతరెడ్డిపాలెం)లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమా దం పూర్వాపరాలను ఆయన సోమవారం సాయంత్రం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులకు వివరించారు.

కారులో ఉన్న గంజాయి, మద్యం సీజ్‌ చేసినవే!
వివరాలను వెల్లడిస్తుస్ప ఎస్పీ హర్షవర్ధన్‌రాజు

ఎలాంటి అపోహలకు తావులేదు

ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు ఎస్‌ఐలు దగ్గరుండి

క్షతగాత్రులను వైద్యశాలకు పంపించారు

అద్దంకిలో ఎస్పీ హర్షవర్ధన్‌రాజు వెల్లడి

అద్దంకి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న గంజాయి, మద్యం ఓ కేసులో సీజ్‌ చేసినవేనని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి అద్దంకి మండలం శంఖవరప్పాడు (పాతరెడ్డిపాలెం)లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమా దం పూర్వాపరాలను ఆయన సోమవారం సాయంత్రం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులకు వివరించారు. ఎస్పీ కథనం మేరకు.. బల్లికురవ, సంతమాగులూరు ఎస్‌ఐలు నాగరాజు, నాగమల్లేశ్వరరావు ఆదివారం బల్లికురవ నుంచి అద్దంకికి కారులో వస్తున్నారు. ఈక్రమంలో శంఖవరప్పాడులో మోటార్‌ సైకిల్‌ను తప్పించే క్రమంలో వారి కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. అందులో ఉన్న ముగ్గురికి గాయాలవడంతో ఇద్దరు ఎస్‌ఐలు బాధ్యతగా కారు దిగి వెంటనే 108 వాహనానికి ఫోన్‌ చేశారు. స్థానికులకు ఘటన గురించి వివరించడంతోపాటు తాము బల్లికురవ, సంతమాగులూరు ఎస్‌ఐలమని చెప్పారు. 108 వాహనం వచ్చేవరకు అక్కడే ఉండి క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు. ఎస్‌ఐలు ఇద్దరూ మరో కారులో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి తీవ్రగాయాలైన మహిళను మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని ప్రైవేటు వైద్యశాలకు పంపించారు. ఎస్‌ఐలు మద్యం సేవించి ఉన్నారనడం పూర్తి అవాస్తవమని ఎస్పీ చెప్పారు. కారులో స్థానికులు గుర్తించిన గంజాయి, మద్యం బాటిళ్లు వేరే కేసులో పట్టుబడినవని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదం జరగడం విచారకరమన్నారు. అయితే, పోలీసుల ప్రతిష్ట దిగజార్చే విధంగా వివిధ రకాలుగా కథనాలు వ్యాప్తి చేయడం సరైనది కాదన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియచెప్పాలన్న ఉద్దేశంతోనే తాను అద్దంకి వచ్చి వివరాలు వెల్లడిస్తున్నట్టు చెప్పారు. ఆటోను కారు ఢీకొన్న ఘటనపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేస్తామన్నారు. వివిధ కేసుల పనిమీద వెళ్లే సమయంలో ప్రైవేట్‌ కారు వినియోగించడం, యూనిఫాంలో కాకుండా సివిల్‌ డ్రస్‌లో వెళ్లడం సాధారణంగా జరుగుతుందన్నారు. పట్టుబడ్డ గంజాయి, మద్యంపై బల్లికురవ, సంతమాగులూరు ఎస్‌ఐలు నాగరాజు, నాగమల్లేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చెప్పారు. సమావేశంలో దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, అద్దంకి సీఐ సుబ్బరాజు పాల్గొన్నారు. అంతకుముందు రోడ్డు ప్రమాదానికి కారణమైన కారును ఎస్పీ పరిశీలించారు. ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న క్షతగాత్రుల వద్దకు ఇద్దరు ఎస్‌ఐలు వెళ్లిన సీసీ ఫుటేజ్‌ను డీఎస్పీ విలేకరులకు చూపించారు.

Updated Date - Aug 18 , 2026 | 02:25 AM