Share News

ఇక మాజీలే..

ABN , Publish Date - Apr 02 , 2026 | 02:38 AM

జిల్లాలో గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం గురువారంతో ముగియ నుంది. శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన రానుంది. ప్రకాశం జిల్లాలో 519 గ్రామ పంచాయతీలు ఉండగా 518 పంచాయతీలకు 2021లో ఎన్నికలు జరిగాయి. కొండపికి గత ఏడాది నిర్వహించారు.

ఇక మాజీలే..

నేటితో ముగియనున్న పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం

రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన

జిల్లాలో 518 పంచాయతీలకు స్పెషల్‌ ఆఫీసర్ల నియామకం

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం గురువారంతో ముగియ నుంది. శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన రానుంది. ప్రకాశం జిల్లాలో 519 గ్రామ పంచాయతీలు ఉండగా 518 పంచాయతీలకు 2021లో ఎన్నికలు జరిగాయి. కొండపికి గత ఏడాది నిర్వహించారు. కొండపి మినహా మిగిలిన అన్ని గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగి గురువారంతో ఐదేళ్లు పూర్తవుతోంది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవడంతో పాలకవర్గాల పదవీ కాలం ముగిసిన వెంటనే ప్రత్యేక పాలనలోకి వెళ్తున్నాయి. మండలాల్లో పనిచేస్తున్న గెజిటెడ్‌ హోదా స్థాయి అధికారులను వాటికి స్పెషలాఫీసర్లుగా నియమిస్తూ కలెక్టర్‌ రాజాబాబు ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశారు. మండల స్థాయిలో పనిచేసే ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మండల విద్యాధికారి-1,2, వ్యవసాయ, పశుసంవర్థక శాఖ అధికారులు, డిప్యూటీ ఎంపీడీవోలు, ఎంపీడీవో కార్యాలయాల్లో పనిచేసి అడ్మిస్ట్రేటివ్‌ ఆఫీసర్లు(ఏవో), ఇంజనీరింగ్‌ శాఖ అధికారులను నియమించాలని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీచేయడంతో తదనుగుణంగా చర్యలు తీసుకున్నారు. కొన్ని మండలాల్లో 20నుంచి 24 పంచాయతీలు ఉండగా అటువంటి మండలాల్లో ఎంపీడీవోలు, తహసీల్దార్లను, డిప్యూటీ ఎంపీడీవోలను కూడా నియమించారు. గ్రామ పంచాయతీల్లో ఆర్థిక పరిస్థితి బాగా ఉండే పంచాయతీలకు సమర్థవంతమైన అధికారులను నియమించారు. ఆయా మండలాల నుంచి ఎంపీడీవోలు పంపిన జాబితాలకు అనుగుణంగా జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకటేశ్వరరావు పరిశీలించి కలెక్టర్‌ రాజాబాబుకు నివేదించారు. ఆ జాబితాలకు కలెక్టర్‌ ఆమోదముద్ర వేశారు. ఆయా పంచాయతీలకు నియమితులైన ప్రత్యేక అధికారుల జాబితాలను మండల స్థాయి అధికారులకు తిరిగి పంపించారు. ప్రత్యేక అధికారులు శుక్రవారం వారిని నియమించిన పంచాయతీల్లో బాధ్యతలు స్వీకరించాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించినట్లు సమాచారం.

Updated Date - Apr 02 , 2026 | 02:38 AM