Share News

తొలిరోజు సజావుగా...

ABN , Publish Date - Feb 24 , 2026 | 01:34 AM

మ్మడి జిల్లాలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు సోమ వారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రశాంతంగా జరిగాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదన్న నిబంధనతో అందరూ ఉరుకులు పరుగుల మీద కేంద్రాలకు చేరుకున్నారు.

తొలిరోజు సజావుగా...
ఒంగోలులోని పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులను స్కాన్‌ చేస్తున్న సిబ్బంది

ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు

కేంద్రాలకు ఫస్టియర్‌ విద్యార్థుల ఉరుకులు పరుగులు

తొలి రోజు 21,584మంది హాజరు

ఒంగోలు విద్య, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు సోమ వారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రశాంతంగా జరిగాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదన్న నిబంధనతో అందరూ ఉరుకులు పరుగుల మీద కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులను ఉదయం 8.30 నుంచి లోపలికి అనుమతించారు. విద్యార్థి జీవితంలో ఇంటర్‌ అత్యంత కీలకమైనది. దీంతో వారు తమ ఇళ్లలోనూ, దేవాలయాలకు వెళ్లి ఇష్టదైవాలకు ప్రార్థనలు, పూజలు చేసి పరీక్షకు బయల్దేరారు.

1,475 మంది గైర్హాజరు

పరీక్షలకు తొలిరోజు ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు 21,584 మంది హాజరయ్యారు. మొత్తం 23,059 మంది హాజరు కావాల్సి ఉండగా 1,475 మంది గైర్హాజరయ్యారు. జనరల్‌ 20,997 మందికి గాను 19,795 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 2,062 మందికి 1,789 మంది హాజరయ్యారు. మొదటి రోజు విద్యార్థులకు తెలుగు/సంస్కృతం/హిందీ/ ఉర్దూ పరీక్ష జరిగింది. ఆర్‌ఐవో, డీఈసీ సభ్యులు, స్క్వాడ్‌ అధికారులు మొత్తం 67కు గాను 46 కేంద్రాలను సందర్శించారు. ఆర్‌ఐవో ఆంజనేయులు ఇంటర్మీడియట్‌ బోర్డు ఓఎస్‌డీ సీవీసుబ్బారావులు ఒంగోలు నగరంలోని 7 కేంద్రాలను సందర్శించారు. పరీక్షల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. సీసీ కెమెరాల ద్వారా కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పోలీసులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్‌ పరీక్షల వల్ల సోమవారం ఒంగోలులోని పలు పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కోర్టు సెంటరులోని నారాయణ జూనియర్‌ కళాశాల, అంజయ్యరోడ్డులోని ఏకేవీకే జూనియరు కళాశాల వద్ద పిల్లలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. కళాశాల నుంచి బయటకు వస్తే నేరుగా ప్రధానరోడ్డులోకి వెళ్లాల్సి రావడం, కళాశాలకు సమీపంలో ఆస్పత్రులు ఉండటంతో అంబులెన్స్‌లు, ఇతర వాహనాలతో అరగంటకు కాని విద్యార్ధులందరూ బయటకు రాలేకపోయారు. లాయర్‌పేట, కోర్టుసెంటర్‌ వద్ద కూడా వాహనాలు రాకపోకలు ఎక్కువకావడంతో ఇబ్బందులు పడ్డారు. పరీక్షా కేంద్రాలు వద్ద ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు పోలీసు అధికారులను కోరుతున్నారు.

శభాష్‌ పోలీస్‌

కాలిగాయంతో ఇబ్బందిపడుతున్న విద్యార్థినికి సహాయం అందించి ఆమెను పరీక్ష హాలులోకి కూర్బోబెట్టి ఒక పోలీసు మానవత్వాన్ని చాటుకున్నారు. కాలుకు గాయం కారణంగా తన తల్లి సహాయంతో ఒక విద్యార్థిని స్థానిక అంజయ్యరోడ్డులోని ఏకేవీకే కళాశాలలో పరీక్ష రాసేందుకు ఆటోలో వచ్చారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఒక కానిస్టేబుల్‌ వారిని గమనించి ఆమెకు అండగా నిలిచి జాగ్రత్తగా మెట్లు ఎక్కించారు. అనంతరం ఆమెను పరీక్ష హాలులో కూర్చోబెట్టి వచ్చారు. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడి విద్యార్థుల తల్లిదండ్రులు అతనిని మెచ్చుకున్నారు.

Updated Date - Feb 24 , 2026 | 01:34 AM