పల్లె రోడ్లకు పండగొచ్చింది
ABN , Publish Date - Feb 15 , 2026 | 11:28 PM
వైసీపీ ఐదేళ్ల పాలనలో రోడ్ల మరమ్మతులకు పైసా విదల్చకపోవటంతో గ్రామీణ రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. గుంతల రోడ్లతో నిత్య ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాఽథుడే కరువయ్యాడు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది.
గ్రామీణ ప్రాంతాల్లో రూ.11.29 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం
కనిగిరి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ ఐదేళ్ల పాలనలో రోడ్ల మరమ్మతులకు పైసా విదల్చకపోవటంతో గ్రామీణ రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. గుంతల రోడ్లతో నిత్య ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాఽథుడే కరువయ్యాడు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. గత నెలలో ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించగా, తాజాగా మళ్లీ గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లకు నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కనిగిరి నియోజకవర్గంలో రూ.11.29 కోట్లతో రోడ్ల అభివృద్ధి
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రజాప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో సీసీ, బీటీ రోడ్ల అభివృద్ధికి రూ.11.29 కోట్ల నిధులు కేటాయించగా పనులు ప్రారంభమయ్యాయి. గతంలో పాడైన రోడ్లకు నిధులు కేటాయించగా, తాజాగా కొత్త రోడ్ల నిర్మాణాలకు పంచాయతీరాజ్‌శాఖ ద్వారా నిధులను మంజూరు చేసింది. కనిగిరి, పామూరు మండలాల్లోనే దాదాపు రూ.8కోట్లకు పైగా నిధులు కేటాయించి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది.
నిధులు మంజూరైన రోడ్ల వివరాలు
కనిగిరి మండలానికి 12పనులకు రూ.4.26 కోట్లు మంజూరయ్యాయి. కంభం రోడ్డులోని అర్బన్‌కాలనీలో 5 పనుల కింద రూ.2.05కోట్లతో 18 సీసీరోడ్లు నిర్మించనున్నారు. వాటిలో ఇప్పటికే దాదాపు సగానికి పైగా నిర్మాణాలు చేపట్టారు. మిగతా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చాకిరాలలో రూ.45లక్షలతో సీసీ రోడ్డు వేయనున్నారు. మండల పరిధిలోని గుడిపాడులో 4 సీసీ రోడ్లకు రూ.1.36కోట్ల నిధులు మంజూరయ్యా యి. గానుగపెంటలో రూ.20లక్షలతో రోడ్లు, చీర్లదిన్నెలో మరో రూ.20లక్షలతో రోడ్డు నిర్మించనున్నారు.
పామూరు మండలంలో రూ.4.09 కోట్లతో 16 సీసీ రోడ్ల నిర్మాణానికి మోక్షం లభించింది. వాటిలో బలిజపాలెంలో 8 ప్రాంతాల్లో మెటల్ రోడ్ల నిర్మాణానికి రూ. 2కోట్లు వెచ్చించనున్నారు. నర్రమారెళ్ల గ్రామంలో రూ.20లక్షలతో, వీరభద్రాపురంలో రూ.20లక్షలతో, కోడిగుంపల గ్రామంలో రూ.20లక్షలతో, లక్ష్మీనరసింహాపురం(ఎల్‌ఎన్‌పురం) గ్రామంలో రూ.60లక్షలతో 3 సీసీరోడ్లు, పడమటకట్టకిందపల్లి (వెస్ట్‌కట్టకిందపల్లి)లో రూ.99లక్షల వ్యయంతో 2 సీసీ రోడ్లు నిర్మించనున్నారు.
హనుమంతునిపాడు మండలం మిట్టపాలెంలో రూ.45లక్షలతో, వేములపాడులో రూ.49లక్షలతో సీసీ రోడ్డు వేయనున్నారు.
సీఎ్‌సపురం మండలంలోని 4 సీసీ రోడ్లకు రూ.60లక్షలు కేటాయించారు. అంబవరంలో రూ.15లక్షలతో, అంబవరం కొత్తపల్లి రూ.15లక్షలతో, రేగులచెలక గ్రామంలో రూ.20లక్షలు, చెర్లోపల్లిలో రూ.10లక్షలతో గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
పీసీపల్లి మండలంలోని 5సీసీ రోడ్లకు రూ.80లక్షలు కేటాయించారు. వాటిలో పెదఅలవలపాడులో రూ.10లక్షలు, వెంగళాయపల్లిలో రూ.20లక్షలు, గుంటుపల్లి రూ.20లక్షలు, తలకొండపాడు రూ.20లక్షలు, నేరేడుపల్లిలో రూ.10లక్షలతో సీసీ రోడ్డు నిర్మించనున్నారు.
వెలిగండ్ల మండలంలోని కోటాలపల్లి గ్రామంలో 2 సీసీ రోడ్లను రూ.60లక్షల వ్యయం నిర్మించేందుకు నిధులు కేటాయించగా, వాటిలో కొన్నిచోట్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.