Share News

కన్న కుమార్తెను కడతేర్చిన తండ్రి

ABN , Publish Date - Mar 26 , 2026 | 11:47 PM

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటుందన్న నెపంతో కన్న కూతురిని తండ్రి కడతేర్చిన ఘటన గురువారం త్రిపురాంతకంలో చోటుచేసుకుంది.

కన్న కుమార్తెను కడతేర్చిన తండ్రి

వివాహేతర సంబంధాన్ని భార్యకు చెబుతుందన్న అనుమానంతో హత్య

ఎర్రగొండపాలెం రూరల్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటుందన్న నెపంతో కన్న కూతురిని తండ్రి కడతేర్చిన ఘటన గురువారం త్రిపురాంతకంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. త్రిపురాంతకానికి చెందిన మోటకట్ల శివారెడ్డి, ఈశ్వరమ్మకు పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక పాప తులసి(9), బాబు జోష్ణవ్‌రెడ్డి ఉన్నారు. శివారెడ్డి, తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబంలో కలహాలు ఏర్పడుతున్నాయి. మద్యానికి బానిసైన శివారెడ్డి ఇంటికి దగ్గరలో ఉన్న ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తరచూ ఆ ఇంటికి వెళ్లి వస్తుండడాన్ని కుమార్తె తులసి చూస్తుండడంతో ఇంట్లో చెప్తుందని శివారెడ్డి అనుమానించాడు. ఆ పాపను కడతేర్చాలని భావించాడు. గురువారం తెల్లవారుజామున శివారెడ్డి బయటకు వెళ్లే సమయంలో తులసి ఒక్కటే మంచంపై కనిపించింది. తులసి నోటిలో గుడ్డలు కుక్కి వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఇంటికి బలవంతంగా మోసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలసి ఆ పాపను హత్య చేసి దుప్పటిలో చుట్టి మంచం కిందికి నెట్టారు. ఆ ఇంటికి తాళం వేసి ఏమి తెలియనట్లు ఇద్దరు బయటకు వెళ్లిపోయారు. కూతురు కనిపించకపోవడంతో భర్త శివారెడ్డితో కలిసి భార్య కూడా చుట్టుపక్కల వెదికింది. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు, తల్లి ఈశ్వరమ్మ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి తాళం వేసిన ఆమె ఇంటిలో చూడగా మంచం కింద విగతజీవిగా తులసి ఉంది. కూతురిని భర్త ఆ మహిళ కలసి హత్య చేశారని ఈశ్వరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు సీఐ అస్సాన్‌ తెలిపారు.

Updated Date - Mar 26 , 2026 | 11:47 PM