గతి తప్పిన చీమకుర్తి మున్సిపల్ పాలన
ABN , Publish Date - Apr 26 , 2026 | 11:37 PM
ప్రత్యేక అధికారుల ఇలాఖాలో చీమకుర్తి మున్సిపల్ పాలన గతి తప్పింది. ఆలనాపాలనా చూడాల్సిన ప్రత్యేక అధికారి మున్సిపల్ కార్యాలయం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవటంతో సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.
కార్యాలయం వైపు ఒక్కసారి కూడా కన్నెత్తి చూడని ప్రత్యేక అధికారి
సమస్యలతో కునారిల్లుతున్న ప్రజలు
వస్తున్నాం.. పోతున్నాం అన్నట్లు వ్యవహరిస్తున్న సిబ్బంది
చీమకుర్తి, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి) : ప్రత్యేక అధికారుల ఇలాఖాలో చీమకుర్తి మున్సిపల్ పాలన గతి తప్పింది. ఆలనాపాలనా చూడాల్సిన ప్రత్యేక అధికారి మున్సిపల్ కార్యాలయం వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవటంతో సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. సమయపాలన లేమి, అవినీతి ఆరోపణలు, పరిపాలనలో అలవిమాలిన నిర్లక్ష్యం వెరసి పాలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అందుకు కొన్ని ఉదాహరణలు ఇవి...
టెక్నికల్ అనుమతుల మంజూరులో జాప్యం
చీమకుర్తి మునిసిపల్ పాలకవర్గం ఉన్న సమయంలో ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహించటానికి ఏకగ్రీవంగా తీర్మానించిన వాటికి టెక్నికల్ అనుమతులు మంజూరు కాలేదు. వాటి కోసం ప్రయత్నించే సిబ్బందే కరువయ్యారు. దీంతో అభివృద్థి పనులు ముందుకు సాగడం లేదు. సిబ్బంది సమయపాలనపై అజమాయషీ లేకపోవటంతో వస్తున్నాం.. పోతున్నాం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
అవినీతికి ఆలవాలంగా మెప్మా కార్యాలయం..
మున్సిపాల్టీ పరిధిలోని మెప్మా కార్యాయలం అవినీతికి ఆలవాలంగా మారిందని ఇటీవల ఆర్‌పీ పూనాటి ధనలక్ష్మి బహిరంగంగా మీడియా ముందు ధ్వజమెత్తారు. ఇక్కడ పనిచేసే సీవో.. గ్రూపుల్లో మెంబర్‌ని యాడ్ చేయాలంటే ఐదువందలు, లోన్ మంజూరు చేయిస్తే రెండువేల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని, సమయపాలన అసలు పాటించకపోవటం మహిళా గ్రూపు సభ్యులకు ఇబ్బందికరంగా మారిందని ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవటం గమనార్హం. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న విషయాలపై నిగ్గు తేల్చకపోవడం గమనార్హం.
వెలగని విద్యుత్ దీపాలు, ధ్వంసమవుతున్న రోడ్లు
పట్టణ శివారు ప్రాంతాలలో విద్యుత్ దీపాలు సరిగ్గా వెలగటం లేదు. రామనగర్‌కు వెళ్లే సీసీ రోడ్డు ధ్వంసమై రాకపోకలు ప్రమాదకరంగా మారినా పట్టించుకునేవారే కరవయ్యారు. రకరకాల సమస్యలతో అల్లాడిపోతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ అనునిత్యం ఎంత బిజీగా ఉన్నా కార్పొరేషన్ పాలనను పక్కన పెట్టకుండా సమీక్షిస్తూ అభివృద్ధికి పాటుపడుతున్నారు. కాని చీమకుర్తి ప్రత్యేక అధికారికి చీమకుర్తి అభివృద్ధిపై చీమకుట్టినట్లు కూడా లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇకనైనా గెలాక్సీపురంగా ప్రసిద్ధిగాంచిన చీమకుర్తి అభివృద్ధిపై దృష్టిసారించి, మున్సిపల్ పాలనను గాడిలో పెట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు.