వెలిగొండ పూర్తి ఘనత చంద్రబాబుదే
ABN , Publish Date - Sep 03 , 2026 | 02:47 AM
పశ్చిమప్రాంతానికి వరప్రసాదమైన వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే దక్కుతుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి అన్నారు. 30 ఏళ్ల క్రితం ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడే ఆ పనులు పూర్తిచేసి ప్రారంభించారన్నారు.
జగన్ తలకిందులుగా తపస్సు చేసినా
మార్కాపురం ప్రాంత ప్రజలు నమ్మరు
కృష్ణా జలాలను చూసి హర్షాతిరేకాలు
మంత్రి డాక్టర్ శ్రీబాలవీరాంజనేయస్వామి
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : పశ్చిమప్రాంతానికి వరప్రసాదమైన వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకే దక్కుతుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి అన్నారు. 30 ఏళ్ల క్రితం ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడే ఆ పనులు పూర్తిచేసి ప్రారంభించారన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెలిగొండను పూర్తిచే యకుండానే ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు 2024లో జగన్ జాతికి అంకితం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2024 ఎన్నికల్లో తిరిగి చంద్రబాబునాయుడు అఽధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక దృష్టిపెట్టి పూర్తిచేశారన్నారు. నిర్వాసితులకు పరిహారం చెల్లింపుతోపాటు అన్ని పనులు పూర్తిచేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారన్నారు. జగన్ తలకిందులుగా తపస్సు చేసినా మార్కాపురం ప్రాంత ప్రజలు ఆయన్ను నమ్మే పరిస్థితి లేదన్నారు. వెలిగొండ నీళ్లు చూసి ఆ ప్రాంత ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. 2014లో అధికారంలోకి వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి రాజధాని నిర్మాణ పనులు చేపట్టారన్నారు. వాటిని 2019లో సీఎం అయ్యాక జగన్మోహన్‌రెడ్డి నిలిపివేశారని మండిపడ్డారు. తిరిగి అధికారంలోకి వచ్చాక చంద్రబాబునాయుడు రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేశారన్నారు. అదేవిధంగా పోలవరం ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్ర కలలను నిజం చేస్తూ నీటిని వదిలే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. చంద్రబాబు చిత్తశుద్ధికి ఇది నిదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.