Share News

విత్తన వెతలు

ABN , Publish Date - Nov 26 , 2026 | 02:44 AM

రైతులను విత్తన వెతలు వెంటాడుతున్నాయి. వర్షాలతో శనగ సాగుకు సిద్ధమైన వారిని కొరత వేధిస్తోంది. ఏటా పంట సాగు సీజన్‌ కన్నా ముందుగానే సబ్సిడీ విత్తనాన్ని సిద్ధం చేసి జిల్లాలకు పంపించే వ్యవసాయ శాఖ రాష్ట్రస్థాయి అధికారులు ఈ ఏడాది ఆ ప్రక్రియలో విఫలమయ్యారు.

విత్తన వెతలు

శనగలను ముందస్తుగా సిద్ధం చేయడంలో

ఉన్నతాధికారుల వైఫల్యం

రాష్ట్రస్థాయిలో టెండర్లకు బదులు

స్థానికంగా సేకరణకు ఆలస్యంగా ఆదేశాలు

జిల్లాలో ప్రాసెసింగ్‌ యూనిట్ల

వైపు ఇక్కడి అధికారుల పరుగు

బహిరంగ మార్కెట్లో ధరలు పెరగడంతో

సబ్సిడీ విత్తనాల కోసం రైతుల ఎదురుచూపు

ఏ రోజుకారోజు సరఫరా చేస్తున్న వైనం

అదునులో విత్తనం అందక అవస్థలు

ఒంగోలు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : రైతులను విత్తన వెతలు వెంటాడుతున్నాయి. వర్షాలతో శనగ సాగుకు సిద్ధమైన వారిని కొరత వేధిస్తోంది. ఏటా పంట సాగు సీజన్‌ కన్నా ముందుగానే సబ్సిడీ విత్తనాన్ని సిద్ధం చేసి జిల్లాలకు పంపించే వ్యవసాయ శాఖ రాష్ట్రస్థాయి అధికారులు ఈ ఏడాది ఆ ప్రక్రియలో విఫలమయ్యారు. ఆ ప్రభావం ప్రస్తుత పంట సాగుకు సిద్ధమైన రైతులపై పడింది. అదునులో విత్తనం దొరక్క ఇక్కట్లు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తక్కువే అయినప్పటికీ నాణ్యమైన విత్తనం దొరుకుతుందన్న నమ్మకంతో ఉన్న రైతులకు సకాలంలో అవి సరఫరా కాకపోవడం సమస్యగా మారింది. జిల్లాలో సుమారు 33వేల హెక్టార్లలో శనగ పంట సాగు చేస్తారు. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అన్న తేడా లేకుండా అన్నిచోట్లా రబీలో ప్రధాన పంటగా దీనిని వేస్తారు. మెట్ట ప్రాంతంలో ప్రత్యేకించి నల్లరేగడి ఉండే చోట్ల విస్తారంగా సాగు చేస్తారు. జిల్లాలో రబీ సీజన్‌లో అన్నిరకాల పంటలు కలిపి సుమారు లక్షా 17వేల హెక్టార్లలో సాగవుతుండగా అందులో ఇంచుమించు 30శాతం విస్తీర్ణంలో శనగే ఉంటుంది. అయితే ఈ ఏడాది సాగర్‌ నీరు రాక మాగాణి ప్రాంత రైతులు, అలాగే పొగాకు మార్కెట్‌ తీవ్ర ఒడిదొడుకుల నేపథ్యంలో ఆ పంట వేసే కొంత మంది శనగ సాగు వైపు చూస్తున్నారు. రెండేళ్లుగా ధరలు లేక కోల్డ్‌స్టోరేజీల్లో భారీగా శనగ నిల్వలు ఉండగా రెండు నెలలుగా ధరలు పెరుగుతూ అమ్మకాలు జోరందుకున్నాయి. ఇది కూడా ప్రస్తుత సీజన్‌లో శనగ సాగు విస్తీర్ణం పెరగడానికి కారణంగా కనిపిస్తోంది.

వివిధ కారణాలతో పెరగనున్న సాగు

సాధారణంగా జిల్లాలో సాగు విస్తీర్ణం 33వేల హెక్టార్లకు అదనంగా మరో 50శాతం విస్తీర్ణం పెరిగి 50వేల హెక్టార్లలో శనగ సాగుకావచ్చని తెలుస్తోంది. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం హెక్టారుకు క్వింటా విత్తనం వంతున జిల్లాలో ఈ సీజన్‌ పంట సాగుకు సుమారు 50వేల క్వింటాళ్ల విత్తనం అవసరం. అంత పరిమా ణంలో ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే అవ కాశం లేకపో యినా కనీసం జిల్లాకు కేటాయించిన విత్త నం కూడా ప్రస్తుతం సరఫరా కాక రైతులు ఇక్కట్లు పడుతున్నారు. సాధారణంగా పంట సాగు సీజన్‌కు రెండు, మూడు నెలల ముందుగానే అన్ని జిల్లాల నుంచి విత్తనాల అవసరంపై అంచనాలు తీసుకొని ఆమేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు సీడ్‌ కార్పొరేషన్‌ ద్వారా విత్తన సేకరణ చేసి జిల్లాలకు ముందుగా పంపుతారు. అలా జిల్లాకు 29,350 క్వింటాళ్ల శనగ విత్తనం ఈ సీజన్‌కు కేటాయించారు.

33శాతం సబ్సిడీతో అందజేత

రైతులకు 33.30శాతం సబ్సిడీతో క్వింటా ఎర్ర శనగలు రూ.9,200, తెల్లశనగలు రూ.9,600కు సరఫరా చేయాలని నిర్ణయించారు. అయితే కేటా యింపులు తప్ప సకాలంలో జిల్లాలకు విత్తనాలు సీడ్‌ కార్పొరేషన్‌ నుంచి అందలేదు. అందుకు నిర్ణీత సమయంలో రాష్ట్రస్థాయి విత్తన సేకరణకు టెండర్లు ఖరారు చేయకపోవడం ప్రధాన కారణమైనట్లు సమాచారం. టెండర్లు పిలిచేందుకు ఎప్పటిలాగే ఉన్నతాధికారులు దృష్టిసారించినా ఖరీఫ్‌ ఆరంభంలో ఇచ్చిన పచ్చిరొట్ట విత్తనాలకే సదరు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి డబ్బు చెల్లింపులు జరక్కపోవడంతో ప్రస్తుత సీజన్‌ శనగ, ఇతర విత్తనాల సరఫరాకు వారు ముందుకు రాలేదని తెలుస్తోంది. దీనిని గుర్తించిన ఉన్నతాధికారులు జిల్లాస్థాయిలో విత్తనాలు సేకరించి ప్రాసెసింగ్‌ చేయించి రైతులకు సరఫరా చేయాలని సూచించారు. అలా ఆలస్యంగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో జిల్లాలో ఉన్న ప్రాసెసింగ్‌ యూనిట్ల వైపు జిల్లా అధికారులు పరుగులు తీయాల్సి వచ్చింది.

విత్తనం కోసం పరుగులు

జిల్లాస్థాయిలో జేసీ అధ్యక్షతన ఉండే కమిటీ ఎర్రశనగలు క్వింటా రూ.9వేలు, తెల్లశనగలకు క్వింటా రూ.9,600 ధర నిర్ణయించి ఆ మేరకు సరఫరా చేయాలని ప్రాసెసింగ్‌ యూనిట్లకు సూచించింది. అయితే జిల్లాలో అందుబాటులో ఉండే ప్రాసెసింగ్‌ యూనిట్ల ద్వారా రోజుకు వెయ్యి క్వింటాళ్లు కూడా సరఫరా జరిగే అవకాశం లేదు. ఇక్కడి నుంచే రాయలసీమ జిల్లాలకు కూడా విత్తనం పంపాల్సి రావడంతో జిల్లాకు మరింత ఇబ్బందికరంగా మారింది. ఇదేసమయంలో సాగు చేసే విస్తీర్ణంలో సాధారణంగా సగం విస్తీర్ణానికి రైతులు సొంతంగా, మిగతా సగం విస్తీర్ణానికి సబ్సిడీ విత్తనం కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈసారి బహిరంగ మార్కెట్లో గతం కన్నా ధరలు పెరగడంతోపాటు సాగు విస్తీర్ణం కూడా భారీగా పెరిగే పరిస్థితి ఏర్పడింది. దీంతో అత్యధికశాతం మంది రైతుల సబ్సిడీ విత్తనం కోసం ఎగబడుతున్నారు.

అవసరం మేరకు సరఫరా లేక ఇక్కట్లు

వ్యవసాయశాఖ సూచనలకు అనుగుణంగా 66.67శాతం మొత్తాన్ని చెల్లించి సబ్సిడీ విత్తనం కోసం రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. ఇటీవల తుఫాన్‌తో వర్షాలు పడటంతో ఒక్కసారిగా విత్తనానికి డిమాండ్‌ పెరిగింది. అయితే అందుకు అనుగుణంగా విత్తనాలు సరఫరా చేయలేని పరిస్థితికి జిల్లాలో వ్యవసాయశాఖ, సీడ్‌ కార్పొరేషన్లు వచ్చాయి. జిల్లాకు తొలుత కేటాయించిన 29,350 క్వింటాళ్లలో ఇప్పటివరకు కేవలం 11వేల క్వింటాళ్లను మాత్రమే సరఫరా చేసినట్లు తెలుస్తోంది. వాటిని కూడా కీలక ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి వస్తున్న ప్రాంతాలకు పంపిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఆయా ప్రాంతాల్లో అవసరాలకు అనుగుణంగా ముందుగానే విత్తనం పంపి నిల్వ ఉంచే అధికారులు ప్రస్తుతం యాప్‌లలో నమోదు అధికంగా ఉన్న లేదా ఒత్తిడి వస్తున్న ప్రాంతాలకు ఏ రోజుకారోజు పంపడానికే ఇబ్బందిపడుతున్నారు. దీంతో సబ్సిడీ తక్కువ అయినా ఆ విత్తనం కోసం వస్తున్న రైతులు తమకు సకాలంలో విత్తనం అందడం లేదని వాపోతున్నారు.

విస్తీర్ణం పెరగడంతోనే ఒత్తిడి

ఈ పరిస్థితిపై జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్‌.శ్రీనివాసరావు స్పందిస్తూ ఉన్నతాధికారుల సూచనలకు అనుగుణంగా జిల్లాలోనే విత్తన సేకరణ చేస్తున్నామన్నారు. ఈ ఏడాది పలు కారణాలతో విస్తీర్ణం పెరిగే పరిస్థితి ఏర్పడిందని దాని వల్ల ఒక్కసారిగా విత్తనం కోసం ఒత్తిడి వస్తున్నదన్నారు. దీంతో తొలుత జిల్లాకు కేటాయించిన 29,350 క్వింటాళ్లకు అదనంగా మరో 14వేల క్వింటాళ్ల కేటాయింపునకు ఉన్నతాధికారులను కోరామన్నారు. త్వరలో అనుమతి వస్తుందని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో సాగు అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న విత్తనాలను సీడ్‌ కార్పొరేషన్‌ ద్వారా ఆయా ప్రాంతాలకు సరఫరా చేస్తున్నామన్నారు. రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దని ఆయన కోరారు.

Updated Date - Nov 26 , 2026 | 02:44 AM