పాలకుల మోసాలను రట్టు చేయాలి
ABN , Publish Date - Apr 22 , 2026 | 02:11 AM
పాలకుల మోసాల గుట్టును రట్టు చేసేందుకు ప్రజా కళాకారులు నడుం బిగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. బూర్జువా కళలకు ప్రత్యామ్నాయంగా ప్రజాకళలు నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
అందుకు ప్రజా కళాకారులు నడుం బిగించాలి
బూర్జువా కళలకు ప్రత్యామ్నాయంగా నిలవాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య పిలుపు
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి) : పాలకుల మోసాల గుట్టును రట్టు చేసేందుకు ప్రజా కళాకారులు నడుం బిగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. బూర్జువా కళలకు ప్రత్యామ్నాయంగా ప్రజాకళలు నిలవాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక మల్లయ్యలింగం భవన్‌లో ఏపీ ప్రజానాట్య మండలి కోస్తా జిల్లాల సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ కళారూపాల ద్వారా ప్రజలను చైతన్య వంతం చేసి ఉద్యమాల వైపు నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దేశంలో పాలకుల దుర్మార్గమైన విధానాలకు వ్యతిరేకంగా కళాకారులు కదం తొక్కాల్సిన అవసరం వచ్చిందన్నారు. కళలు చాలా శక్తివంతమైనవని, వాటి ద్వారా ప్రజలను మేల్కొల్పడానికి ప్రజా సాంస్కృతిక సంఘాలు సమైక్యంగా నడవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజా కళాకారులు నూతన రచనలతో, కొత్త పాటలతో ప్రజల వద్దకు వెళ్లాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రజాకళాకారులు సంఘటితంగా పనిచేస్తే పాలకుల విధానాలను ఎండగట్టవచ్చని తెలిపారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రజాకళాకారుడు సంజీవి, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్, జాతీయ కార్యదర్శి గని, కోటి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆర్.వెంకట్రావు, ఆర్.పిచ్చయ్య, ఎస్‌కే నజీర్, రామారావుతోపాటు వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు, సాంస్కృతిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.