ఉద్యోగ విరమణకు ముందు రోజే..
ABN , Publish Date - Feb 05 , 2026 | 02:35 AM
కంభం మండలం తురిమెళ్ల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ యేలెం వెంకటరమణ (45) బ్రెయిన్ స్ర్టోక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. అసోం రాష్ట్రం దిబ్రూగడ్‌లో మంగళవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
బ్రెయిన్ స్ర్టోక్‌తో ఆర్మీ జవాన్ మృతి
అసోంలోని దిబ్రూగడ్‌లో ఘటన
నేడు అధికార లాంఛనాలతో తురిమెళ్లలో అంత్యక్రియలు
నెలక్రితమే ఆయన తండ్రి మృతి
కంభం ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి) : కంభం మండలం తురిమెళ్ల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ యేలెం వెంకటరమణ (45) బ్రెయిన్ స్ర్టోక్‌కు గురై ప్రాణాలు కోల్పోయారు. అసోం రాష్ట్రం దిబ్రూగడ్‌లో మంగళవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. బుధవారం వెంకటరమణ ఉద్యోగమిరమణ చేయాల్సి ఉంది. సరిగ్గా ముందురోజే ఆయన మృతి చెందడం అందరినీ కలచి వేసింది. లెఫ్ట్‌నెంట్ హోదాలో ఉన్న ఆయన సోమవారం విధుల్లో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తోటి జవాన్‌లు వెంటనే వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆయన తండ్రి నెల రోజుల కిందటే మృతిచెందగా.. వెంకటరమణ స్వగ్రామం తురిమెళ్లకు వచ్చి కర్మకాండలు చేసి తిరిగి విధుల్లో చేరారు. అంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. వెంకటరమణ మృతదేహాన్ని స్వగ్రామమైన తురిమెళ్లకు గురువారం ఉదయం తీసుకురానున్నారు. అనంతరం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వెంకటరమణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.