‘వెలుగు’లో చీకటి కోణం
ABN , Publish Date - Jan 22 , 2026 | 02:57 AM
మహిళా సంఘాల సభ్యులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న నిధులు పక్కదారిపడుతున్నాయి. పొదుపు సభ్యులకు తెలియకుండా గ్రూపు లీడర్లు, వీవోఏలు వాడేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
కార్యాలయాల్లో తవ్వేకొద్దీ అవినీతి
వలేటివారిపాలెం, బడేవారిపాలెం సమాఖ్యల్లో వీవోఏల చేతివాటం
ఇప్పటికే అకౌంటెంట్ సస్పెన్షన్
ఫోర్జరీ సంతకాలు, నకిలీ రశీదులతో పెద్దఎత్తున నిధులు డ్రా
వేతనాలు స్వాహా చేసిన సీసీలు
ఉల్లాస్ నిధులు కూడా పక్కదారి
కొన్నిచోట్ల బినామీ పేర్లతో స్వాహా చేసిన గ్రూపు లీడర్లు
తాళ్లూరులోనూ భారీగా అక్రమాలు
దారిమళ్లిన స్త్రీనిధి, సీఐఎఫ్ నిధులు
మహిళా సంఘాల సభ్యులకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న నిధులు పక్కదారిపడుతున్నాయి. పొదుపు సభ్యులకు తెలియకుండా గ్రూపు లీడర్లు, వీవోఏలు వాడేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాలోని తాళ్లూరు, వలేటివారిపాలెం వెలుగు కార్యాలయాలు అవినీతికి ఆలవాలంగా మారాయి. వీవీపాలెం వెలుగు కార్యాలయంలో అయితే డ్వాక్రా సభ్యులు, వీవోఏలు, సీసీలు, ఏపీఎం, అకౌంటెంట్ తదితర సిబ్బంది మధ్య ఏర్పడిన వివాదాలతో అక్రమాల కంపు రచ్చకెక్కింది. తవ్వేకొద్దీ ఒక్కో చీకటి కోణం వెలుగులోకి వస్తోంది.
వలేటివారిపాలెం/తాళ్లూరు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): వెలుగులో అవినీతి కంపుకొడుతోంది. అనేక అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా ఆ శాఖ ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రధానంగా స్త్రీనిఽధికి సంబంధించి వీవోఏల సిఫార్సుల మేరకు రుణాల కోసం నిధులు మంజూరు చేస్తున్నారు. అయితే అవి పెద్దఎత్తున గోల్‌మాల్ అవుతున్నాయి. ముఖ్యంగా తాళ్లూరు, వలేటివారిపాలెం మండలాల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీవీపాలెం మండలంలో 1,089 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. అందులో 10,890 మంది సభ్యులున్నారు. 31 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. 28 మంది వీవోఏలు పనిచేస్తున్నారు. వెలుగులో పనిచేసే అకౌంటెంట్ తీర్మానాలు, బిల్లులు, రశీదులు లేకుండానే ఫోర్జరీ సంతకాలతో నకిలీ బిల్లులతో డబ్బులు డ్రా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఆదివారం సెలవు దినాలలో, పండుగ సమయాలలో మండల సమాఖ్య సమావేశాలు నిర్వహించినట్లు నకిలీ తీర్మానాలు, బిల్లులు పెట్టి రూ.18,73,264 స్వాహా చేసినట్లు డీఆర్‌డీఏ అధికారులు గుర్తించి కొంతకాలం క్రితం చర్యలు తీసుకున్నారు. అవినీతి అంతటితో ఆగలేదు. గత ఏడాది బడేవారిపాలెంలోని ఒక గ్రామైక్య సంఘంలో ఓ గ్రూపు సభ్యులు బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి సంబంధించి ప్రతినెలా చెల్లిస్తున్న ఈఎంఐను డ్వాక్రా లీడరు బ్యాంకుకు చెల్లించకుండా రూ.12లక్షలకుపైగానే సొంతానికి వినియోగించుకున్నట్లు అధికారుల విచారణలో తేలింది. వలేటివారిపాలెంలో ఒక గ్రామైక్య సంఘంలో వీవోఏ తమ డ్వాక్రా గ్రూపులోని సభ్యులకు తెలియకుండానే వాళ్ల పోర్జరీ సంతకాలతో సుమారు రూ.11 లక్షలు రుణం తీసుకొని బ్యాంకుకు చెల్లించలేదని అధికారుల విచారణలో తెలింది. 2024లో అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో జూన్, జూలై నెలలకు ప్రభుత్వం నుంచి మంజూరైన వీవోఏల వేతనాలు రూ.2,24,000 అప్పటి వీవోఏలకు ఇవ్వలేదు. ప్రభుత్వం మారడంతో సీసీలు ప్రస్తుతం ఉన్న వీవోఏల పేరు మీదకు మార్చి స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళా సంఘాల్లోని నిరక్షరాస్యులైన వయోజన మహిళలను అక్షరాస్యులుగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఉల్లాస్ పథకం’ కింద వీవోఏలకు మంజూరు చేసిన నిధులు సుమారు రూ.50వేలకుపైగానే వీవోఏలకు ఇవ్వకుండా పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. వలేటివారిపాలెం ఓ గ్రామైక్య సంఘంలోని డ్వాక్రా గ్రూపులో వెలుగు సీసీ తన అత్తను చేర్చి ఎస్‌హెచ్‌జీ రుణం తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక సీసీ నకిలీ గ్రూపు తయారు చేసి ఎస్‌హెచ్‌జీ రుణం తీసుకున్నట్లు డ్వాక్రా గ్రూపుల్లో బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెలుగులో ‘తిలాపాపం తలాపిడికెడు’ అన్న చందంగా ఎవరి స్థాయిని బట్టి వాళ్లు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతికి పాల్పడిన అకౌంటెంట్‌ను పదిరోజుల క్రితం సస్పెండ్ చేశారు. అయితే రికవరీలు ఏవి అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. వెలుగు కార్యాలయంలో రెండేళ్లలో సుమారు రూ.50 లక్షలకుపైగానే అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. రెండేళ్లలో అంత అవినీతి జరిగితే వైసీపీ ప్రభుత్వ హయంలో మిగిలిన మూడేళ్లలో ఎంత అవినీతి జరిగిందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
సభ్యుల పేర్లతో రుణాలు తీసుకున్న వీవోఏలు
తాళ్లూరు మండలంలో స్త్రీనిధి ద్వారా ఇచ్చిన రుణాల్లో రూ.23,48,200 రికవరీ కాని బకాయిలు(ఎన్‌పీఏ)ఉన్నాయి. మరో 15,31,948 రూపాయలు 90 రోజులలోపు చెల్లించాల్సిన బకాయిలుగా ఉన్నాయి. నాగంబొట్లపాలెం, దారంవారిపాలెం గ్రామాల్లో వీవోఏలు మహిళా సభ్యుల పేర్లతో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించపోవడంతో మొండిబకాయిలుగా మిగిలిపోయాయి. స్త్రీనిధి నిధులు, సీఐఎఫ్ నిధులను దారిమళ్లించి దుర్వినియోగం చేశారని సభ్యులు ఆరోపిస్తున్నారు. కొంతమంది పొదుపు మహిళలకు అవసరం లేకపోవడంతో వారి పేర్లను గ్రూపు లీడ ర్లు, వీవోఏలు తీసుకుని వాడుకుని సక్రమంగా చెల్లించకపోవడం తో లక్షల్లో బకాయిలు పేరుకుపో యాయి. వాటిని చెల్లించని గ్రామసంఘాల సమైఖ్యలకు స్త్రీనిధి రుణాలు నిలిపివేశారు.
వెలుగు అధికారుల ఉదాసీనత
ఒక్కో వీవోఏలో దాదాపు పది పొదుపు గ్రూపు సంఘాలు ఉన్నాయి. ఒక పొదుపు గ్రూపునకు చెందిన మహిళలు స్త్రీనిధి రుణం చెల్లించకపోవటంతో మొత్తం నిలిపివేయటంతో పొదుపు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాళ్లూరు మండలంలో అత్యధికంగా స్త్రీనిధి రుణాలు నాగంబొట్లపాలెం వీవో పరిధిలో రూ.7,99,348, వెలుగువారిపాలెం-2లో రూ.4,07,701, రమణాలవారిపాలెంలో రూ.2,37,217లు బీమ్‌రామ్ వీవో పరిధిలో రూ.1,81,549, శ్రీలక్ష్మి వీవో పరిధిలో రూ.1,77,549, రాజశేఖరరెడ్డి వీవో పరిధిలో రూ.1,19,905లు, తాళ్లూరు-1లో రూ.1,08,190, విఠలాపురంలో రూ.1,04,773 స్త్రీ నిధి బకాయిలు చెల్లించలేదు. దీంతో ఈ గ్రూపుల మహిళలకు గతేడాది కాలంగా రుణం రుణాలు ఇవ్వటం లేదు. బకాయిలు తీసుకున్న మహిళల వద్ద నుంచి వసూలు చేయాల్సిన వీవోఏలు మిన్నకుంటున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా వెలుగు అధికారులు సరిగా స్పందించటం లేదని సభ్యులు ఆరోపిస్తున్నారు. రుణాలు చెల్లించని వారిపట్ల, స్త్రీనిధి నిధులను దుర్వినియోగం చేసిన వారిపట్ల వెలుగు అధికారులు ఉదాశీనత వ్యవహిస్తున్నందునే పొదుపుసంఘాల లక్ష్యం నీరుగారిపోతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.