Share News

కార్పొరేషన్‌ ఖాళీ

ABN , Publish Date - Apr 29 , 2026 | 03:13 AM

ఒంగోలు నగరపాలక సంస్థ అంతా ఖాళీ అయింది. మార్చి వరకు పాలకవర్గ సభ్యులు, పూర్తిస్థాయి అధికారులతో కళకళలాడిన కార్పొరేషన్‌ కార్యాలయం ఇప్పుడు ఇన్‌చార్జుల పాలనలో నడుస్తోంది. గత నెలలో పాలకవర్గ పదవీకాలం ముగిసింది.

కార్పొరేషన్‌ ఖాళీ
ఒంగోలు కార్పొరేషన్‌ కార్యాలయం

కీలక బాధ్యులంతా ఇన్‌చార్జులే

అంతంతమాత్రంగా పౌర సేవలు

పారిశుధ్యం అధ్వానం.. తాగునీటి సరఫరా అస్తవ్యస్తం

పనిచేసేవారు లేరు.. పర్యవేక్షించేవారు కరువు

ప్రజా సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం

ఒంగోలు నగరపాలక సంస్థ అంతా ఖాళీ అయింది. మార్చి వరకు పాలకవర్గ సభ్యులు, పూర్తిస్థాయి అధికారులతో కళకళలాడిన కార్పొరేషన్‌ కార్యాలయం ఇప్పుడు ఇన్‌చార్జుల పాలనలో నడుస్తోంది. గత నెలలో పాలకవర్గ పదవీకాలం ముగిసింది. తాజాగా కీలక అధికారులు పలు కారణాలతో సెలవుపై వెళ్లడంతో పౌరసేవలు అంతంతమాత్రంగా మారాయి. పనిచేసేవారు లేకపోగా, పర్యవేక్షించేవారు కరువయ్యారు. మరోవైపు నగరంలో పారిశుధ్యం అధ్వానంగా మారింది. తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. ఏ విభాగంలో చూసినా ఇన్‌చార్జులే కావడంతో సిబ్బంది పనితీరులో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. దీంతో ప్రజా సమస్యల పరిష్కారంలోనూ జాప్యం నెలకొంది.

ఒంగోలు కార్పొరేషన్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో సేవలు అంతంతమాత్రంగా మారాయి. కమిషనర్‌ కె.వెంకటేశ్వరరావు నెలరోజులపాటుసెలవుపై వెళ్లడంతో ఇన్‌చార్జిగా అసిస్టెంట్‌ కమిషనర్‌ రాంభూపాల్‌రెడ్డి కొనసాగుతున్నారు. పట్టణ ప్రణాళిక విభాగం (టౌన్‌ ప్లానింగ్‌) అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌గా ఉన్న సుధాకర్‌ రెండు నెలల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. అప్పటి నుంచి టౌన్‌ ప్లానింగ్‌ అధికారి (టీపీవో) బాబూరావు ఇన్‌చార్జి ఏసీపీగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఆయన వ్యక్తిగత కారణాలతో ఇటీవల నెల రోజులపాటు సెలవుపై వెళ్లారు. దీంతో టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ సూపర్‌వైజర్‌ (టీపీబీఎస్‌) రసూల్‌ టౌన్‌ ప్లానింగ్‌ ఇన్‌చార్జ్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. అలాగే అభివృద్ధిలో కీలకమైన ఇంజనీరింగ్‌ విభాగంలోఏడాది కాలంగా మునిసిపల్‌ ఇంజనీర్‌ పోస్టు ఖాళీగా ఉంది. డీఈ ఏసయ్యకు ఇన్‌చార్జి ఎంఈగా కొనసాగుతున్నారు. ఆ విభాగంలో ఐదుగురు డీఈలకు ఏడాది కాలంగా ఒక డీఈనే కొనసాగుతున్నారు. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు ఎనిమిది ఉండగా ప్రస్తుతం ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన వాటిలో ఎమినిటీ సెక్రటరీలు ఏఈలుగా కొనసాగుతున్నారు. కార్యాలయంలో పరిపాలనా విభాగానికి సంబంధించి రెగ్యులర్‌ మేనేజర్‌ లేరు. సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీహరి ఇన్‌చార్జి బాధ్యతల్లో కొనసాగుతున్నారు.

శానిటేషన్‌లోనూ అదే పరిస్థితి

ప్రజారోగ్య విభాగమైన శానిటేషన్‌లో మునిసిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌గా డాక్టర్‌ వైష్ణవి విధులు నిర్వరిస్తుండగా, శానిటేషన్‌ సూపర్‌వైజర్లుగా ఎన్‌.పిచ్చయ్య, షేక్‌ బాబ్జి కొనసాగుతున్నారు. శానిటేషన్‌ను ఐదు డివిజన్లుగా విభజించగా ఆయా డివిజన్లకు పూర్తిస్థాయి ఇన్‌స్పెక్టర్లు లేకపోవడంతో సూపర్‌వైజర్లతోపాటు ఓ శానిటరీ సెక్రటరీ, మరో ఇద్దరు ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్లు కొనసాగుతున్నారు. ఇక పన్నుల వసూళ్ల విభాగమైన రెవెన్యూ సెక్షన్‌లో అసిస్టెంట్‌ కమిషనర్‌ రాంభూపాల్‌రెడ్డి ఆ విభాగం అధికారిగా ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ఆయన ఇన్‌చార్జి కమిషనర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఒక ఆర్‌వోతోపాటు ఏడుగురు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ఉండగా,ప్రస్తుతం ఆర్‌వోగా భాస్కర్‌, ఐదుగురు మాత్రమే ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్నారు. పలు ఇతర సెక్షన్‌లలోనూ సిబ్బంది కొరత ఏర్పడటంతో ఇన్‌చార్జులతో నెట్టుకొస్తున్నారు. దీంతో ఆయా విభాగాల్లో సిబ్బంది కొరత కారణంగా పౌర సేవలు అంతంతమాత్రంగా మారాయి.

వేళాపాళా లేకుండా నీటి సరఫరా

ఒంగోలు నగరంలో నెలరోజుల నుంచి నీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. పదేపదే మోటార్ల సమస్య ఉత్పన్నమవుతుండటంతో వేళాపాలా లేకుండా నీరు విడుదలవుతోంది. దీంతో ఎప్పుడొస్తాయో తెలియని నీటి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఒంగోలు నగరంలో 50 డివిజన్లు ఉండగా, వాటన్నింటికీ నీటి సరఫరాకు మూడు మోటార్లు ఏర్పాటు చేశారు. గతంలో ఎప్పుడో కొనుగోలు చేసిన మోటార్లు కావడంతో పదేపదే సమస్య ఉత్పన్నమవుతోంది. ఒక్క మోటారు మొరాయించినా కాలనీలకు నీటి సరఫరా షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఒకటి, రెండు రోజులు ఆలస్యంగా రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయంగా మోటార్లు ఏర్పాటు చేసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

అధ్వానంగా పారిశుధ్యం

ప్రతిరోజూ ఇంటింటి చెత్త సేకరణ చేయాల్సి ఉండగా కొన్ని ప్రాంతాలలో మూడు రోజులకు ఒకసారి కూడా జరుగుతున్న పరిస్థితి లేదు. మరోవైపు చెత్త సేకరణ, వీధుల శుభ్రం ప్రధాన ప్రాంతాలకే పరిమితమవుతోంది. నగరంలో పారిశుధ్యంపై ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్‌ సర్వే నిర్వహించగా రాష్ట్రవ్యాప్తంగా అధ్వానంగా ఉన్న పట్టణాలలో ఒంగోలు 5వ స్థానంలో ఉంది. పేరుకు 681 మంది కాంట్రాక్టు, మరో వంద మందికొవిడ్‌ కార్మికులు, 180 పర్మినెంట్‌ కార్మికులు, 70మంది సచివాలయ సెక్రటరీలు, ఐదుగురు సూపర్‌వైజర్లు, ఇన్‌చార్జ్‌ ఇన్‌స్పెక్టర్లు ఉన్నప్పటికీ పారిశుధ్యంపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి.

Updated Date - Apr 29 , 2026 | 03:13 AM