Share News

పట్టాభిషేకం నేడే

ABN , Publish Date - Nov 22 , 2026 | 11:04 PM

అర్బన్‌ స్థానిక సంస్థల నూతన పాలకవర్గాలు కొలువుదీరే వేళయ్యింది. జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్‌, అద్దంకి, దర్శి, చీమకుర్తి, మునిసిపల్‌ పాలకవర్గాల ప్రమాణ స్వీకారం సోమవారం జరగనుంది.

పట్టాభిషేకం నేడే
ఒంగోలు కార్పొరేషన్‌ కార్యాలయంలో పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి చేసిన ఏర్పాట్లు

కొలువుదీరనున్న మునిసిపల్‌ పాలకవర్గాలు

ఒంగోలు కార్పొరేషన్‌, అద్దంకి, దర్శి చీమకుర్తిల్లో ఏర్పాట్లు

డిప్యూటీ మేయర్‌, వైస్‌చైర్మన్ల ఎన్నిక

చేతులెత్తే విధానంలో నిర్వహణ

నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు,

ఎక్స్‌అఫిషియో సభ్యులకు ఆహ్వానాలు

అర్బన్‌ స్థానిక సంస్థల నూతన పాలకవర్గాలు కొలువుదీరే వేళయ్యింది. జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్‌, అద్దంకి, దర్శి, చీమకుర్తి, మునిసిపల్‌ పాలకవర్గాల ప్రమాణ స్వీకారం సోమవారం జరగనుంది. డిప్యూటీ మేయర్‌/వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు. అందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు ఇందుకోసం ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన మేయర్‌, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతోపాటు వాటిలో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉండే ఎంపీ, ఎమ్మెల్యేలు వంటి ప్రజాప్రతినిధులకు హాజరుకావాలని ఆహ్వానాలను పంపారు.

ఒంగోలు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : కార్పొరేషన్‌, మున్సిపల్‌ పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధమైంది. సోమవారం ఆప్రక్రియ జరగనుంది. జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌, అద్దంకి, దర్శి, చీమకుర్తి, కందుకూరు మునిసిపాలిటీలు ఉండగా తొలిదశలో కందుకూరు మినహా మిగతా నాలుగింటిలో ఎన్నికలు జరిగిన విషయం విదితమే. దర్శి మునిసిపాలిటీలో చైర్మన్‌తోపాటు వార్డులన్నీ ఏకగ్రీవం కాగా, మిగిలిన మూడు చోట్ల ఈనెల 1న పోలింగ్‌ నిర్వహించి 3న ఓట్లు లెక్కించారు. నాలుగింటిలోనూ కూటమి గెలుపొందింది. ఒంగోలు కార్పొరేషన్‌ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్పతోపాటు 48 డివిజన్లలో టీడీపీ కూటమి విజయం సాధించింది. అద్దంకిలో టీడీపీ అభ్యర్థి కాకాని అశోక్‌, చీమకుర్తిలో టీడీపీ అభ్యర్థి శిద్దా సుధాకర్‌రావు చైర్మన్లుగా గెలుపొందడంతోపాటు అత్యధిక వార్డు కౌన్సిలర్‌ స్థానాలను కూటమి దక్కించుకుంది. ఇక దర్శి మునిసిపాలిటీని జనసేనకు కేటాయించగా చైర్మన్‌గా దారం సుబ్బారావుతోపాటు మొత్తం కౌన్సిలర్‌ల స్థానాలను ఏకగ్రీవంగా కూటమి పార్టీలు కైవసం చేసుకున్నాయి. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ ముగిసిన వారం రోజుల్లోనే ప్రమాణ స్వీకారం ఉంటుంది. అయితే మునిసిపల్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే పరిషత్‌, ఆ వెంటనే గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తుండటంతో ప్రమాణ స్వీకారం సోమవారం ఏర్పాటు చేశారు.

ఏర్పాట్లు చేసిన అధికారులు

జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌, అద్దంకి, దర్శి, చీమకుర్తి, మునిసిపల్‌ పాలకవర్గాల ప్రమాణ స్వీకారాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఇందుకోసం ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన మేయర్‌, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతోపాటు వాటిలో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉండే ఎంపీ, ఎమ్మెల్యేలు వంటి ప్రజాప్రతినిధులకు హాజరుకావాలని ఆహ్వానాలను పంపారు. సభ్యులను మాత్రమే అనుమతించేలా సమావేశ ప్రాంగణంలో ఏర్పాట్లతోపాటు బయట భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. చైర్మన్‌, సభ్యుల ప్రమాణస్వీకారాల తర్వాత పరోక్ష పద్ధతిలో డిప్యూటీ మేయర్‌/వైస్‌ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. చేతులెత్తే విధానంలో ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. ఇతర అంశాలు ఏవీ చర్చలేకుండా కేవలం ప్రమాణ స్వీకారం వరకే ఈ ప్రత్యేక సమావేశాలు పరిమితం కానున్నాయి. ఒంగోలు కార్పొరేషన్‌ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని కలెక్టర్‌ పి.రాజాబాబు, ఇతర మునిసిపాలిటీల్లో సంబంధిత అధికారులు నిర్వహిస్తారు.


మార్కాపురం జిల్లాలోనూ...

మార్కాపురం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో కొత్తగా ఎన్నికైన పాలకవర్గాలు సోమవారం కొలువుదీరనున్నాయి. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి పురపాలక సంఘాల చైర్మన్‌లుగా వక్కలగడ్డ మల్లికార్జున్‌, జేవీ నారాయణ, అచ్చాల తిరుపతమ్మ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వారితోపాటు వార్డు కౌన్సిలర్లు కూడా ప్రమాణం చేస్తారు. ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన చైర్మన్‌తోపాటు వార్డు కౌన్సిలర్లు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తరువాత కౌన్సిలర్ల నుంచి వైస్‌ చైర్మన్‌ను ఎన్నుకుంటారు.

మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి పురపాలక సం ఘాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పట్టణ ఓటర్లు కూటమి అభ్యర్థులకు పట్టం కట్టారు. మార్కాపురంలో చైర్మన్‌ పదవికి పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థి వక్కలగడ్డ మల్లికార్జున్‌కు అత్యధిక మెజారిటీ ఇచ్చారు. మొత్తం 40 వార్డుల్లో కూడా కౌన్సిలర్‌లుగా 39 మంది కూటమి పార్టీల నుంచే ఎన్నికయ్యారు. కేవలం ఒక్క వార్డులోనే వైసీపీ గెలిచింది. ప్రమాణ స్వీకార ఏర్పాట్లను మున్సిపల్‌ కమిషనర్‌ నారాయణరావు సిద్ధంచేశారు. గిద్దలూరు మున్సిపాలిటీలో చైర్మన్‌ పదవి పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించగా ఇక్కడ వైసీపీ అభ్యర్థిపై జేవీ నారాయణ చైర్మన్‌గా గెలుపొందారు. మొత్తం 28 వార్డుల్లో 25 మంది కౌన్సిలర్లు కూటమి నుంచి విజయం సాధించగా, ఇద్దరు స్వతంత్రులు, ఒకరు వైసీపీ నుంచి గెలిచారు. వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మార్కాపురం, గిద్దలూరులో ఏర్పాట్లను కలెక్టర్‌ విజయసునీత పరిశీలించారు.

కనిగిరి మున్సిపాలిటీలో తిరుగులేని విజయం కూటమికి దక్కింది. ఇక్కడ నామినేషన్ల ఉపసంహరణ రోజుకే టీడీపీ తరఫున పోటీ చేసిన అచ్చాల తిరుపతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతే కాకుండా 32 వార్డులకు గాను 30 వార్డులు ఏకగ్రీవంగా కూటమిపరమయ్యాయి. మిగిలిన రెండు వార్డులకు ఎన్నికలు జరిగినా అవికూడా కూటమి ఖాతాలోనే పడ్డాయి. ఇలా మూడు మున్సిపాలిటీల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న చైర్మన్‌, కౌన్సిలర్లు అంతా సోమవారం పదవీ ప్రమాణం చేస్తున్నారు. పట్టణాల్లో గత పాలకుల హయాంలో నెలకొన్న దుస్థితిని తొలగించి ప్రజల సమస్యల పరిష్కారంలోనూ, పట్టణాల అభివృద్ధిపైనా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Nov 22 , 2026 | 11:04 PM