సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Oct 05 , 2026 | 10:59 PM
జరుగుమల్లి మండలం నర్సింగోలులో ఈనెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పిలుపునిచ్చారు.
భారీగా తరలివచ్చి ఘనస్వాగతం పలకాలి
టీడీపీ నాయకులు, కార్యకర్తలకు
మంత్రి స్వామి, సత్య పిలుపు
తూర్పునాయుడుపాలెం(కొండపి), అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : జరుగుమల్లి మండలం నర్సింగోలులో ఈనెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పిలుపునిచ్చారు. భారీగా తరలివచ్చి సీఎంకు ఘన స్వాగతం పలకాలని కోరారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం వద్ద ఉన్న దామచర్ల సత్య కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కొండపి నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొన్నారు. మంత్రి స్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చంద్రబాబు తన పర్యటన సందర్భంగా హామీలు ఇచ్చే అవకాశం ఉందన్నారు. మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారి సీఎం చంద్రబాబు నాయుడు నియోజకవర్గానికి వస్తున్నారన్నారు. నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి కొండపి టీడీపీకి కంచుకోట అని మరోసారి నిరూపించాలని కోరారు. భారీ జనసమీకరణ లక్ష్యంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని నాయకులను కోరారు. 1,500 మంది కార్యకర్తలకు చంద్రబాబుతో ఫొటో సెషన్, ఇంటరాక్షన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. టీడీపీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణతో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. అందుకు అనుగుణంగా కమిటీలు ఏర్పాటు చేసుకొని పనిచేయాలని సూచించారు. సమావేశంలో టీడీపీ మండలాల అధ్యక్షులు పోకూరి రవీంద్రబాబు, చదలవాడ చంద్రశేఖర్, మించల బ్రహ్మయ్య పార్టీ సీనియర్ నాయకులు పోటు శ్రీనివాసమురళి, బెజవాడ వెంకటేశ్వర్లు, యర్రమోతు శ్రీనివాసులు నియోజకవర్గంలోని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.