రైతుల ప్రయోజనాలే బోర్డు లక్ష్యం
ABN , Publish Date - Sep 06 , 2026 | 03:02 AM
పొగాకు రైతుల ప్రయోజనాల కోసమే బోర్డు పనిచేస్తుందని ఆర్‌ఎం ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్ గాడిలో పడిందన్నారు. అందువల్ల రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
అపరాధ రుసుంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
ప్రభుత్వ సూచనల ప్రకారం ప్రతిపాదనలు పంపాం
129 రోజుల్లో 63.64 మిలియన్ కిలోల అమ్మకం
పొగాకు బోర్డు ఆర్‌ఎం ప్రసాద్
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : పొగాకు రైతుల ప్రయోజనాల కోసమే బోర్డు పనిచేస్తుందని ఆర్‌ఎం ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్ గాడిలో పడిందన్నారు. అందువల్ల రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. స్థానిక పొగాకు బోర్డు ఆర్‌ఎం కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణాది ప్రాంతంలో వేలం ప్రారంభమై 129 రోజులు గడిచిందన్నారు. ఇప్పటి వరకు ఎస్‌బీఎస్ ప్రాంతంలో 31.41 మిలియన్ కిలోలు, ఎస్‌ఎల్‌ఎస్ ప్రాంతంలో 32.24 మిలియన్ కిలోలు కలిపి 63.64 మిలియన్ కిలోల పంట అమ్మకాలు జరిగాయన్నారు. బోర్డు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రెండు రీజియన్లలో 89 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా సుమారు 150 మిలియన్ కిలోలు పండిందని ఆయన పేర్కొన్నారు. ఇంకా అనుమతిచ్చిన పొగాకు కొనాల్సి ఉందన్నారు. రైతులు అదనంగా పండించిన పంటపై ప్రభుత్వం సూచించిన విధంగా పొగాకు బోర్డు కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపిందని తెలిపారు. అందువల్ల అపరాధ రుసుంపై రైతులు అప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం నోబిడ్‌లు లేకుండా కొనుగోళ్లు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులపై ఆర్థికభారం పడకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 2026-27 పంట కాలంలో పొగాకు బోర్డు అనుమతించిన మేరకే సాగుకు రైతులు సహకరించాలని కోరారు. పొగాకు బోర్డులో రిజిస్టర్ చేసుకున్న రైతులు మాత్రమే పంట సాగు చేయాలన్నారు. రిజిస్టర్ కాని రైతులు ఎట్టి పరిస్థితుల్లో సాగు చేయవద్దని సూచించారు. కౌలు భూముల్లో పొగాకు సాగు లాభదాయకం కాదని, అందువల్ల సొంత భూములు, బ్యారన్ లైసెన్సు ఉన్నవారు మాత్రమే పంటను సాగు చేయాలన్నారు. రైతులు వేలం ప్రక్రియలో అఽధికారులకు సహకరించి తమ పొగాకును మార్కెటింగ్ చేసుకోవాలని ప్రసాద్ కోరారు.