ఆరంభం.. ఆందోళనకరం
ABN , Publish Date - Mar 26 , 2026 | 02:34 AM
పొగాకు మార్కెట్ ఆరంభమే రైతులను నిరాశపరిచింది. గరిష్ఠ ధరలు భారీగా తగ్గాయి. పెరిగిన ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా కాకపోయినా కనీసం గత ఏడాది వేలం ప్రారంభం రోజున ఇచ్చిన ధర కూడా దక్కకపోవడం రైతులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.
దక్షిణాదిలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభం
కిలోకు రూ.250 లభించిన ప్రారంభ ధర
గతేడాది కన్నా రూ.30 తగ్గింపు
రైతుల్లో తీవ్ర అసంతృప్తి
ఇంకా దిగజారుతాయంటున్న వ్యాపారులు
జీఎస్టీ పెంపునకుతోడు యుద్ధమే కారణమని ప్రచారం
ఈ ఏడాది భారీగా పెరిగిన పెట్టుబడులు
ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్రంగా నష్టపోనున్న రైతులు
పొగాకు మార్కెట్ ఆరంభమే రైతులను నిరాశపరిచింది. గరిష్ఠ ధరలు భారీగా తగ్గాయి. పెరిగిన ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా కాకపోయినా కనీసం గత ఏడాది వేలం ప్రారంభం రోజున ఇచ్చిన ధర కూడా దక్కకపోవడం రైతులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఈ సీజన్ పొగాకు కొనుగోళ్లు రాష్ట్రంలో బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి దశలో ద క్షిణాది రీజియన్లలోని పొదిలి, కందుకూరు-1 వేలం కేంద్రాలు, ఉత్తరాదిలోని ఐదు చోట్ల చేపట్టారు. మొదటిరోజే వ్యాపారులు ధరలకు కోత పెట్టారు. దీంతో భవిష్యత్ మార్కెట్ ఎలా ఉండబోతుందోనన్న ఆందోళన రైతులను వెంటాడుతోంది.
ఒంగోలు, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : పొగాకు మార్కెట్ ఈ ఏడాది ఆరంభంలోనే రైతులకు ప్రతికూలమైంది. వ్యాపారులు ధరలను భారీగా తగ్గించి కొనుగోలు చేశారు. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. దక్షిణాదిలోని పొదిలి వేలం కేంద్రంలో పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ, ఒంగోలు రీజనల్ మేనేజర్ జి.లీలాకృష్ణప్రసాద్ పాల్గొని వేలంను ప్రారంభించారు. కందుకూరు-1 కేంద్రంలో పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయ ఆర్‌ఎం రామారావు ప్రారంభించారు. రెండుచోట్లా ప్రారంభ ధర కిలోకు రూ.250 మాత్రమే ఇచ్చారు. పొదిలి కేంద్రానికి అగ్రహారం గ్రామానికి చెందిన 27 బేళ్లను తీసుకు రాగా, కందుకూరు-1 కేంద్రానికి తిమ్మపాలెం క్లస్టర్ నుంచి 18 బేళ్లను తెచ్చారు. రెండుచోట్లా అన్ని బేళ్లను కిలో రూ.250 ప్రకారం బయ్యర్లు కొనుగోలు చేశారు. గతేడాది మార్చి 10న పొగాకు వేలం ప్రారంభం కాగా తొలిరోజు ప్రారంభ ధర కిలో రూ.280 పలికింది.
ఈ ధరలు ఉండకపోవచ్చు
గతేడాది ఒక దశలో కిలో రూ.370కు గరిష్ఠ ధర చేరింది. 2023-24లో సగటు ధర కిలోకు రూ.216.16 లభించగా, గతేడాది (2024-25) సగటు ధర కిలోకు రూ.223.14 దక్కింది. అలాంటిది ఈ సీజన్ ప్రారంభ ధర గతేడాది కన్నా కిలోకు రూ.30 తగ్గించి రూ.250 మాత్రమే ఇవ్వడంపై రైతులు తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తొలిరోజు కావడంతో కొంత సంయమనంతో ఉన్నారు. వివిధ కంపెనీల బయ్యర్లు మాత్రం మున్ముందు ఈ ధరలు కూడా ఉంటాయన్న నమ్మకం లేదన్న వ్యాఖ్యలను వేలం కేంద్రాల వద్ద రైతుప్రతినిధులతో ప్రైవేటు సంభాషణల్లో వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కేంద్రం సిగరెట్ ఉత్పత్తులపై జీఎస్టీని 40శాతానికి పెంచడం ప్రతిబంధకమైంది. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ యుద్ధ ప్రభావం ఎగుమతులపై పడుతున్నదని, దాని వల్ల ధరలు లభించే అవకాశం లేదని కూడా చెప్తున్నట్లు రైతులు అంటున్నారు. బోర్డు అధికారులు సైతం ప్రస్తుత సీజన్ బాగా ఉండే అవకాశం లేదని, ఉన్న ధరకు అమ్ముకోవడం మంచిదని హితవు చెప్పే విధంగా మాట్లాడుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. బుధవారం ఉత్తరాదిలోని రాజమండ్రి రీజియన్‌లో వేలంను బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్‌కుమార్ ప్రారంభించారు. అక్కడ ప్రారంభ ధర కిలో రూ.265 లభించినట్లు సమాచారం. అక్కడి రైతులు కూడా ధరలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ ఇలాగే కొనసాగితే ఈ ఏడాది పొగాకు రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.
వేలం కేంద్రం అధికారులతో ఈడీ సమీక్ష
పొదిలిలో పొగాకు కొనుగోళ్లను ప్రారంభించిన బోర్డు ఈడీ విశ్వశ్రీ సాయం త్రం ఒంగోలులోని ఆర్‌ఎం కార్యాలయంలో దక్షిణాది రీజియన్‌లోని వివిధ వేలం కేంద్రాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. దక్షిణాదిలోని రెండు కేంద్రాల్లో ప్రారంభ ధరలపై రైతులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. మిగతా కేంద్రాల్లో వచ్చేనెల 9 నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, ఆయా వేలం కేంద్రాల పరిధిలో పంట ఉత్పత్తి, రెండో విడత కొనుగోళ్లకు జరుగుతున్న ఏర్పాట్లు తదితర అంశాలపై ఈడీ సమీక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఒంగోలు ప్రాంతీయ మేనేజర్ లీలాకృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యాలయ అధికారి శీలం రామారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.