Share News

ఆరంభం అదుర్స్‌

ABN , Publish Date - Feb 15 , 2026 | 02:53 AM

పాకల బీచ్‌ ఫెస్టివల్‌ ఆరంభం అదిరిపోయింది. తీరంలో రాష్ట్ర సంస్కృతి, పర్యాటక వైభవాన్ని ప్రతిబింబించేలా వేడుకలు మొదలయ్యాయి. శనివారం ఉదయం ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీ, కలెక్టర్‌ రాజాబాబు తదితరులు ఉత్సవాలను ప్రారంభించారు.

ఆరంభం అదుర్స్‌
బీచ్‌ ఫెస్టివల్‌లో మాట్లాడుతున్న మంత్రి దుర్గేష్‌, పక్కన మంత్రులు రవికుమార్‌, స్వామి, కలెక్టర్‌ రాజాబాబు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు

ఉత్సాహంగా పాకల బీచ్‌ ఫెస్టివల్‌

తీరానికి పోటెత్తిన వేలాది మంది ప్రజలు

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

హాజరైన మంత్రులు కందుల దుర్గేష్‌, స్వామి, గొట్టిపాటి,

ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు, సత్య, నూకసాని

సింగరాయకొండ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): పాకల బీచ్‌ ఫెస్టివల్‌ ఆరంభం అదిరిపోయింది. తీరంలో రాష్ట్ర సంస్కృతి, పర్యాటక వైభవాన్ని ప్రతిబింబించేలా వేడుకలు మొదలయ్యాయి. శనివారం ఉదయం ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీ, కలెక్టర్‌ రాజాబాబు తదితరులు ఉత్సవాలను ప్రారంభించారు. సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్‌, డాక్టర్‌ డీఎస్‌బీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌తోపాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కీలక నేతలు పాల్గొన్నారు. రాత్రి బీచ్‌ ఫెస్టివల్‌ కార్యక్రమాలకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. పాకల తీరం జనంతో హోరెత్తింది. తొలుత వేద పండితుల మంత్రోచ్ఛారణల నుడుమ సముద్రానికి శాస్ర్తోక్తంగా జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫుడ్‌స్టాల్స్‌ పర్యాటకులతో కిటకిటలాడాయి. బీచ్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టేజిపై నిర్వహించిన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. ప్రముఖ యాంకర్‌ సుమవ్యాఖ్యానం, జబర్దస్త్‌ ఫేమ్‌ ఆటో రామ్‌ప్రసాద్‌ స్కిట్స్‌, లైవ్‌ బ్యాండ్‌ మ్యూజికల్‌ నైట్‌ ఆకట్టుకుంది. తీరంలో మిరుమిట్లు గొలిపే కాంతులతో ఆకాశంలోకి దూసుకుపోయిన క్రాకర్స్‌ షో అబ్బురపరిచింది.

ఉత్సాహంగా బీచ్‌ క్రీడా పోటీలు..

పాకల బీచ్‌ ఫెస్టివల్‌ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలకు విశేష స్పందన లభించింది. బీచ్‌ వాలీబాల్‌ పోటీల్లో 78జట్లు, కబడ్డీ పోటీల్లో 60 జట్లు, టెన్నీకాయి డ్‌కు 22జట్లు, బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలలో 8 జట్లు పాల్గొన్నాయి. ఈ జట్ల మధ్య పోటీలు ఫ్లడ్‌లైట్లు వెలుగులో సాగుతున్నాయి.

Updated Date - Feb 15 , 2026 | 02:53 AM