‘అమృత్’ ఘడియలొచ్చేశాయ్..!
ABN , Publish Date - Oct 08 , 2026 | 02:36 AM
ఒంగోలు నగర ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పట్టణ ప్రాంతాల్లో తాగునీటి వనరులు పెంచేందుకు చేపట్టిన అమృత్ 2.0 పనులు చురుగ్గా సాగుతున్నాయి.
2.0 కింద ఒంగోలులో రూ.424.42 కోట్లతో పనులు
నగరానికి చేరిన పైపులు, ఐరన్, ఇతర సామగ్రి
ఒంగోలు కార్పొరేషన్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగర ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పట్టణ ప్రాంతాల్లో తాగునీటి వనరులు పెంచేందుకు చేపట్టిన అమృత్ 2.0 పనులు చురుగ్గా సాగుతున్నాయి.నగరంలోని ప్రజలకు ప్రస్తుతం రెండు రోజులకు ఒకసారి తాగునీటి సరఫరా జరుగుతోంది. పలు శివారు కాలనీల్లో కనీసం పైపులైన్లు కూడా లేకపోవడంతో ప్రతిరోజూ ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉండగా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించలేదు. ఈ నేపథ్యంలో ఇకపై ఒంగోలు ప్రజలకు 24 గంటలు తాగునీరు అందించే దిశగా స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు రూ.424.42 కోట్లను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు. ప్రస్తుతం పనులు చురుగ్గా సాతున్నాయి. ఇప్పటికే ఓవర్ హెడ్ నిర్మాణాలకు అవసరమైన ఐరన్, తాగునీటి పైపులైనులు, ఇతర సామగ్రి ఒంగోలుకు చేరాయి.
51,340 ఇళ్లకు తాగు నీటి కొళాయిలు
అమృత్ 2.0 పథకానికి సంబంధించి పనులకుమంత్రి లోకేష్ ఈ ఏడాది ఆగస్టు 28న స్థానిక రంగారాయుడు చెరువు వద్దపైలాన్ ఆవిష్కరించారు. ఈ పథకం కింద ఒంగోలు నియోజకవర్గానికి ప్రభుత్వం రూ.424.42 కోట్లు కేటాయించగా, రెండేళ్లలో పనులు పూర్తయ్యేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. పబ్లిక్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో పనులు చేపడుతున్నారు. 13.975 కి.మీ శుద్ధి కేంద్రాలకు నీటి సరఫరా చేసే పైపులైను, అలాగే త్రోవగుంట, కొప్పోలు, పబ్లిక్ హెల్త్ ఆఫీస్ కాంపౌండ్‌లో కోటి యాభై లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన మూడు నీటి శుద్ధి కేంద్రాలు నిర్మించనున్నారు. వాటితోపాటు 52.985 కి.మీ శుద్ధి చేసిన తాగునీటి పంపింగ్ ప్రధాన పైపులైను నిర్మాణం, 18 ప్రాంతాల్లో తాగునీటి నిల్వ ట్యాంకులు, నగరం మొత్తాన్ని 35 జోన్‌లుగా విభజించి 605.30 కి.మీ పైపులైను నిర్మాణం, 51,340 నివాసాలకు ఇంటింటికీ కొళాయిలు ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులు పూర్తయితే ప్రతిరోజూ మంచినీరు అందుతుంది.