Share News

కూటమితోనే శ్రీరామరక్ష

ABN , Publish Date - Sep 29 , 2026 | 01:01 AM

కూటమి పాలనే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని జల వనరులశాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు అన్నారు. చీమకుర్తి-కారుమంచి మేజర్‌ కెనాల్‌ జలహారతి కార్యక్రమంలో సోమవారం మంత్రి పాల్గొన్నారు.

కూటమితోనే శ్రీరామరక్ష
కారుమంచి మేజర్‌ కెనాల్‌ వద్ద పూజ చేస్తున్న మంత్రి నిమ్మల, ఎమ్మెల్యే బీఎన్‌, కలెక్టర్‌ రాజాబాబు, ఎన్‌ఆర్‌ఐ శేషయ్య

మరో ఇరవై ఏళ్లు ప్రజామోదం లభిస్తే సంపూర్ణ అభివృద్థి

గొడ్డలి పార్టీకి శాశ్వత సమాధితోనే రాష్ట్రం సుభిక్షం

కూటమి గెలుపులో శేషయ్యలాంటి ఎన్‌ఆర్‌ఐల కృషి అభినందనీయం

జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

పునరుద్ధరించిన కారుమంచి మేజర్‌ ప్రారంభం

చీమకుర్తి, సెప్టెంబర్‌ 28 (ఆంధ్రజ్యోతి) : కూటమి పాలనే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని జల వనరులశాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు అన్నారు. చీమకుర్తి-కారుమంచి మేజర్‌ కెనాల్‌ జలహారతి కార్యక్రమంలో సోమవారం మంత్రి పాల్గొన్నారు. రూ.2.69 కోట్లతో పునరుద్ధరించిన కెనాల్‌ను ఎమ్యెల్యే బీఎన్‌.విజయ్‌కుమార్‌, కలెక్టర్‌ రాజాబాబు, ఎన్‌ఆర్‌ఐ నల్లూరి వెంకటశేషయ్య, ఇరిగేషన్‌ సీఈ రమేష్‌తోలతో కలిసి మంత్రి ప్రారంభించారు. తర్వాత కెనాల్‌లో ప్రవహిస్తున్న సాగర్‌ జలాలకు హారతి ఇచ్చారు. అనంతరం జరిగిన బహిరంగసభలో మంత్రి నిమ్మల ప్రసంగించారు. సూపర్‌ ఎల్‌నినో లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం చంద్రబాబునాయుడు తన దార్శనికతతో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చేశారన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పత్రికలు సీఎంను వాటర్‌మ్యాన్‌గా అభివర్ణించడాన్ని గుర్తుచేశారు. రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి సాధించాలంటే మరో ఇరవై ఏళ్ల పాటు కూటమి పాలన ఉంటేనే సుసాధ్యం అన్నారు. అలాగే గొడ్డలి పార్టీకి శాశ్వత సమాధి కడితేనే సాధ్యమన్నారు.

సాగునీటి రంగంలో కీలక పురోగతి

రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో సాగునీటి రంగంలో కీలక పురోగతి సాధించామని మంత్రి లెక్కలతో సహా తెలిపారు. హంద్రీనీవా, నల్లమల సాగర్‌, పోలవరం ద్వారా ఉత్తరాంధ్రను సుభిక్షం చేయడం రాష్ట్ర ప్రజలందరికీ విదితమేనని తెలిపారు. సాగునీటి వ్యవస్థల నిర్వహణ, మరమ్మతులకు గత వైసీపీ ప్రభుత్వం తన ఐదేళ్ల కాలంలో కేవలం రూ.200 కోట్లు కేటాయిస్తే, కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.1,320కోట్లు ఇచ్చిందన్నారు. కారుమంచి మేజర్‌ కూలిపోయి 18 గ్రామాల ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నా గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం కొలువు దీరిన రెండేళ్లలోనే కెనాల్‌ని పునరుద్ధరించి ప్రజలకు సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించిందన్నారు.

ఎన్‌ఆర్‌ఐల సహకారం మరవలేం..

వైసీపీ దుష్టపాలనను అంతమొందించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో ఎన్‌ఆర్‌ఐల సహకారం మరవలేనిదని రామానాయుడు కొనియాడారు. మారుమూల గ్రామంలో పుట్టి పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి అధిపతి అయినా సొంత ఊరికోసం పాటుపడుతున్న కూనంనేనివారిపాలెం గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ నల్లూరి వెంకటశేషయ్య గొప్పవారన్నారు. కారుమంచి మేజర్‌ కెనాల్‌ పునరుద్ధరణలో ఆయన కీలక పాత్ర పోషించడం ఆదర్శనీయం అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. కాగా రామతీర్థం రిజర్వాయర్‌ సామర్థ్యం పెంపు, గుండ్లకమ్మ జలాశయం కింద రెండు చెక్‌డ్యామ్‌లు నిర్మించడం, కేవీపాలెం బ్రిడ్జి ఆవశ్యకత తదితరాలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ అందజేశారు. ఎమ్యెల్యే తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

హామీని త్వరితగతిన నెరవేర్చాం

ఎమ్యెల్యే బీఎన్‌.విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ కారుమంచి కెనాల్‌ పునరుద్ధరణ హామీని లోకేష్‌ పాదయాత్ర సమయంలో ఇచ్చారని, దానిని త్వరితగతిన నెరవేర్చటం సంతోషంగా ఉందన్నారు. దీనికి సహకరించిన ఎన్‌ఆర్‌ఐ నల్లూరి శేషయ్య, కలెక్టర్‌, ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఎమెల్యే దామచర్ల జనార్దన్‌ మాట్లాడుతూ సంక్షేమ పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు పూర్తిస్థాయిలో మద్దతు పలకాలని కోరారు. కలెక్టర్‌ రాజాబాబు మాట్లాడుతూ నిధులు మంజురు చేసిన ఐదునెలలలోపు కెనాల్‌ పనులను పూర్తిచేసి రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావటం సంతోషంగా ఉందన్నారు. దర్శి ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సుచిత్ర, మన్నం ప్రసాద్‌, శిరిపురం వెంకట్రావు, ఎన్‌ఆర్‌ఐ తక్కెళ్లపాటి రమేష్‌, గొట్టిపాటి రాఘవరావు, కాట్రగడ్డ రమణయ్య, డీసీ అధ్యక్షులు పాలడుగు వెంకటనారాయణ, సీఈ రమేష్‌, ఎస్‌ఈ వరలక్ష్మి, ఈఈ గురిజాల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2026 | 01:01 AM