బీచ్ ఫెస్టివల్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
ABN , Publish Date - Feb 16 , 2026 | 11:27 PM
సింగరాయకొండ మండలం పాకలలో జరిగిన బీచ్ ఫెస్టివల్ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ధన్యవాదాలు తెలిపారు.
విలేకరుల సమావేశంలో ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ సత్య
ఒంగోలు కార్పొరేషన్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి) : సింగరాయకొండ మండలం పాకలలో జరిగిన బీచ్ ఫెస్టివల్ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ఒంగోలులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్య మాట్లాడుతూ మారిటైం బోర్డు, ఏపీ టూరిజం కార్పొరేషన్ సంయుక్తంగా పాకల సముద్రతీరంలో ఈనెల 14, 15 తేదీలలో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ వేడుకలు ఊహించిన దానికంటే అత్యంత ఘనంగా విజయవంతంలో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతులు తెలిపారు. స్థానిక వనరులు, సంస్కృతి, సంప్రదాయలను కాపాడుకునేందుకు, నేటి తరానికి తెలియజేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో జిల్లాలో తొలిసారిగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించామన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు తరలివచ్చే విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ఎటువంటి ఇబ్బంది రాకుండా వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్దన్ రాజు, అలాగే ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు ప్రతిష్టాత్మకంగా భావించి అతి తక్కువ సమయంలో తీసుకున్న నిర్ణయాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా కష్టపడి పనిచేశారన్నారు. వేడుకల నిర్వహణలో పాల్గొన్న జిల్లా మంత్రులు డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్, కొల్లు రవీంద్రతోపాటు శాసనసభ్యులు, ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. బీచ్ ఫెస్టివల్‌లో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ టూర్, బోట్ రైడింగ్‌ను మంగళవారం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఏటా బీచ్ ఫెస్టివల్ వేడుకలను నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డాక్టర్ ఉగ్ర నరసింహా రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా పాకల సముద్ర తీరంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం, ఆ కార్యక్రమాన్ని ఊహించని రీతిలో విజయవతం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.