Share News

తల్లికి వందనం నేడే

ABN , Publish Date - Jul 22 , 2026 | 01:18 AM

తల్లికి వందనం పథకానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు బుధవారం నుంచి ప్రభుత్వం నగదు జమ చేయనుంది. ఈ పథకం కింద జిల్లాలో 2,07,944 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించారు.

తల్లికి వందనం నేడే

ఖాతాల్లో నగదు జమ

2.07 లక్షల మంది అర్హులు

మూడు రకాల జాబితాలు

ఒంగోలు కలెక్టరేట్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : తల్లికి వందనం పథకానికి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు బుధవారం నుంచి ప్రభుత్వం నగదు జమ చేయనుంది. ఈ పథకం కింద జిల్లాలో 2,07,944 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించారు. వారికి సంబంధించిన 1,31,572 మంది తల్లుల ఖాతాల్లో నిధులు జమకానున్నాయి. తల్లికి వందనానికి సంబంధించి విద్యార్థుల్లో అర్హులు, అనర్హులు, అండర్‌ వెరిఫికేషన్‌ జాబితాలను విడివిడిగా స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో బుధవారమే ప్రదర్శించనున్నారు. వీటిపై అభ్యంతరాలను ఈనెల 22 నుంచి ఆగస్టు 3 వరకు స్వీకరిస్తారు. అభ్యంతరాలను స్వర్ణగ్రామ- స్వర్ణవార్డు కార్యాలయాల్లోనే సమర్పించాల్సి ఉంటుంది. వాటిని ఆగస్టు 4 నుంచి 10వ తేదీ వరకు పరిశీలించి అర్హులైన వారి సప్లిమెంటరీ జాబితాలను సిద్ధం చేస్తారు. అండర్‌ వెరిఫికేషన్‌లో తల్లి మరణించిన కేసులు, డూప్లికేట్‌ ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ, ఆధార్‌, తల్లీపిల్లలకు సేమ్‌ ఆధార్‌, పెండింగ్‌ ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ రికార్డులు ఉంటాయి. ఎన్‌పీసీఐ ఇన్‌ యాక్టివ్‌ లేదా మ్యాపింగ్‌ లోపాలతో నిలిచిపోయిన బ్యాంకు ఖాతాలను సవరించడంతోపాటు ఒకవేళ తల్లి మరణించి ఉంటే అదే హౌస్‌హోల్డ్‌లోని తండ్రిని లేదా ఇతర సభ్యుడిని ఎంచుకొనేలా డ్రాప్‌ డోన్‌ ఆప్షన్‌ను ప్రభుత్వం ఇచ్చిందని స్వర్ణగ్రామ- స్వర్ణ వార్డు అధికారి ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. హోస్‌ హోల్డ్‌ డేటా బేస్‌లో లభించని విద్యార్థుల చిరునామాలు/ ఫోన్‌ నెంబర్లను సంప్రదించి వారిని వెంటనే హౌస్‌ హోల్డ్‌లో యాడ్‌ చేస్తామన్నారు. పాఠశాలల్లో 1వ తరగతి, ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశించిన వారిలో ఆగస్టు 25వరకు చేరిన వారినే తల్లికివందనం పథకానికి అర్హులుగా ప్రకటించారు. ఆగస్టు 25 తర్వాత చేరే విద్యార్థులకు ఈ పథకం వర్తించదు. ఆ అర్హుల జాబితాను ఆగస్టు 30న సచివాలయాల్లో ప్రకటిస్తారు. వీరికి 30వతేదీనే నగదు జమవుతుంది. ఈ పథకం కింద ఇచ్చే రూ.15 వేలల్లో 13వేలు తల్లుల ఖాతాలకు జమచేస్తారు మిగిలిన రూ.2వేలు పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు, టాయిలెట్ల నిర్వహణకు వినియోగిస్తారు.

Updated Date - Jul 22 , 2026 | 01:18 AM