Share News

దర్శిలో ఉద్రిక్తత

ABN , Publish Date - Oct 18 , 2026 | 03:07 AM

దర్శి మున్సి పాలిటీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా కూటమి, వైసీపీ వర్గీయుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఇరువర్గాలు ఎదురెదురు పడటంతో కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీ చైర్మన్‌అభ్యర్థి వెంకటరెడ్డి నామినేషన్‌ వేసేందుకు పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీగా బయల్దేరారు.

దర్శిలో ఉద్రిక్తత
వైసీపీ నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు

నామినేషన్‌కు ర్యాలీగా బయల్దేరిన వైసీపీ అభ్యర్థి

గడియార స్తంభం వద్ద అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం

ఇరు పార్టీలు ఎదురుపడటంతో ఘర్షణ వాతావరణం

దర్శి, అక్టోబరు 17ఆంధ్రజ్యోతి) : దర్శి మున్సి పాలిటీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా కూటమి, వైసీపీ వర్గీయుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఇరువర్గాలు ఎదురెదురు పడటంతో కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీ చైర్మన్‌అభ్యర్థి వెంకటరెడ్డి నామినేషన్‌ వేసేందుకు పార్టీ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీగా బయల్దేరారు. గడియార స్తంభం వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి నామినేషన్లు వేసేందుకు లోపలికి నలు గురు మాత్రమే వెళ్లాలని సూచించారు. అం దుకు వైసీపీ నాయకులు అంగీకరించకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బారికేడ్లు దాటి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు నియంత్రించారు.

ఏఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు

ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు వచ్చిన అడిషనల్‌ ఎస్పీ యుగంధర్‌, దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే శివప్రసా ద్‌రెడ్డితో పోలీసు అధికారులు కొద్దిసేపు చర్చిం చారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఆతర్వాత వెంకటరెడ్డి నామినేషన్‌ వేసేందుకు అక్కడి నుంచి బయల్దేరారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత అనేక మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు వారిని అనుసరించారు. అదేసమయంలో అటువైపు నుంచి వస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎదురుపడటంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఇరువర్గాల వారు తోపులాటకు దిగారు. కొంతసేపు అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇంతలో నామినేషన్ల దాఖలుకు సమయం మించిపో యింది. దీంతో వైసీపీ అభ్యర్థి నామినేషన్‌ వేయకుండానే వెనుదిరిగారు.

పోలీసుల కవాతు

దర్శి పట్టణంలో శనివారం రాత్రి పోలీసులు కవాతు నిర్వహించారు. సీఐ ఎన్‌.నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో వివిధప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు అధికారులు, ప్రత్యేక పోలీసు దళాలు ప్రధాన వీధుల్లో కవాతు చేశాయి. ఎన్నికల సందర్భంగా ఎవరైనా గొడవలకు పాల్పడినా, శాంతి భద్రతలకు విఘాతం కల్గించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నాగమల్లేశ్వరరావు హెచ్చరించారు.

Updated Date - Oct 18 , 2026 | 03:07 AM