Share News

అడవిలోపల్లిలో ఉద్రిక్తత

ABN , Publish Date - Jul 11 , 2026 | 02:54 AM

మండలంలోని అడవిలోపల్లిలో గ్రామకంఠం భూమి విషయమై నెలకొన్న వివాదం వైసీపీ, టీడీపీ గ్రూపుల మధ్య ఘర్షణకు దారితీసింది. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకోవడంతో 8 మంది గాయపడ్డారు.

అడవిలోపల్లిలో ఉద్రిక్తత

గ్రామకంఠం భూమి విషయమై టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ

కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు

8 మందికి గాయాలు... ఆసుపత్రిలో చేరిక

కేసు నమోదు చేసిన పీసీపల్లి పోలీసులు

పీసీపల్లి, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని అడవిలోపల్లిలో గ్రామకంఠం భూమి విషయమై నెలకొన్న వివాదం వైసీపీ, టీడీపీ గ్రూపుల మధ్య ఘర్షణకు దారితీసింది. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకోవడంతో 8 మంది గాయపడ్డారు. పీసీపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని గ్రామకంఠం భూమి విష యమై టీడీపీ మద్దతుదారుడైన మూలె శ్రీను, వైసీపీ మద్దతుదా రుడైన కోడూరి కొండారెడ్డి గ్రూపుల మధ్య కొద్దిరోజులుగా వివాదం నడుస్తోంది. ఇది గురువారం పీసీపల్లి పోలీసుస్టేషన్‌కు చేరింది. ఎస్సై నరసింహారావు రెండు వర్గాల వారిని పిలిచి విచారించారు. అది ప్రభుత్వ భూమి అయినందున ఎవరూ అందులోకి ప్రవేశించవద్దని, ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపించారు. శుక్రవారం ఉదయం వివాద భూమికి పక్కనే ఉన్న మరో స్థలంలో మూలె శ్రీను గ్రూపునకు చెందిన గేదెలు కట్టేసి ఉన్నాయి. వైసీపీకి చెందిన కోడూరి కొండారెడ్డి గ్రూపు.. శ్రీను అనుయాయులతో ఘర్షణకు దిగింది. ఇది కాస్తా పెరిగి కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. టీడీపీ మద్దతుదారులైన శ్రీను, రమణయ్య, పెద్దిరెడ్డి, కె.మాల్యాద్రిలకు తల భాగంలో తీవ్రగాయాలయ్యాయి. వీరితోపాటు మహాలక్ష్మి అనే మహిళకు కూడా గాయాలు కావడంతో చికిత్స కోసం పీసీపల్లి వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. ఈ ఘర్షణలో వైసీపీకి చెందిన కొండారెడ్డి, మల్లికార్జున, మాలకొండయ్యలకు కూడా గాయాలయ్యాయి. ఇరుపక్షాల ఫిర్యాదుల మేరకు పీసీపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jul 11 , 2026 | 02:54 AM