Share News

కట్టుదిట్టంగా పది ఎస్‌ఏ-1 పరీక్షలు

ABN , Publish Date - Nov 10 , 2026 | 02:31 AM

పదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ-1) పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించేం దుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి ప్రారంభమైన ఎస్‌ఏ-1 పరీక్షల్లో కాపీయింగ్‌కు కళ్లెం వేయడంతోపాటు జవాబుపత్రాల మూల్యాంకనం పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా పరిశీలకులను నియమించింది.

కట్టుదిట్టంగా పది ఎస్‌ఏ-1 పరీక్షలు

పర్యవేక్షణకు ప్రత్యేక పరిశీలకులు

ఒంగోలు విద్య, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ-1) పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించేం దుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి ప్రారంభమైన ఎస్‌ఏ-1 పరీక్షల్లో కాపీయింగ్‌కు కళ్లెం వేయడంతోపాటు జవాబుపత్రాల మూల్యాంకనం పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా పరిశీలకులను నియమించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. పరిశీలకులుగా స్కూల్‌ అసిస్టెంట్లను నియమించారు. పరీక్షల పర్యవేక్షణకు పొరుగు మండలం నుంచి.. మూల్యాంకనం, మార్కుల నమోదు పరిశీలనకు అదే మండలంలోని పొరుగు పాఠశాలల అసిస్టెంట్లను నియమించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీషు పరీక్షలకు భాషేతర సబ్జెక్టులైన గణితం, పీఎస్‌, బీఎస్‌, సోషల్‌ స్కూల్‌ అసిస్టెం ట్లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ప్రత్యేకంగా నిర్వహిస్తున్న మిషన్‌ మార్చి-27 కార్యక్రమంలో మొదటి స్టడీలో విద్యార్థుల స్థాయి, వారు సాధిస్తున్న మార్కులను అంచనా వేసేందుకు పరీక్షలను పక్కాగా నిర్వహిస్తున్నారు. పరీక్షల పర్యవేక్షకులుగా నిమితులైన వారు విద్యార్థులు స్వయంగా పరీక్ష రాస్తున్నారా? కాపీయింగ్‌ జరుగుతుందా? ఉపాధ్యాయులు, ఇతరులు సమాధానాలు చెప్పడం వంటి అక్రమాలకు పాల్పడుతున్నారా? అని గమనిస్తారు. బయటి వ్యక్తులు పరీక్ష గదుల్లోకి ప్రవేశించకుండా, విద్యార్థులు పరీక్ష హాలులో మొబైల్‌ ఫోన్లు వినియోగించకుండా వారు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పరిశీలకులు ఉదయం 8.30కు వారు నియమితులైన పాఠశాలలకు వెళ్లి అక్కడే ఉదయం హాజరు నమోదు చేయాలి. పరీక్ష ముగిసిన అనంతరం తమ మాతృ పాఠశాలలకు వెళ్లి రెగ్యులర్‌ విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

మూల్యాంకనం, మార్కుల నమోదుకు షెడ్యూల్‌

జవాబుపత్రాల మూల్యాంకనం, మార్కుల నమోదుకు షెడ్యూల్‌ను ప్రకటించారు. పరీక్ష పూర్తయిన అనంతరం జవాబుపత్రాలను సంబంధిత పాఠశాలలోనే అదే సబ్జెక్టు ఉపాధ్యాయుడు మూల్యాంకనం చేయాలి. పరీక్ష జరిగిన తేదీ నుంచి మూడు పని దినాల్లో మూల్యాంకనం పూర్తిచేయాలి. జవాబుపత్రాలు బయటకు తీసుకెళ్లరాదు. విద్యార్థుల మార్కులను రిజిస్టర్‌లో నమోదు చేయాలి. పరీక్ష జరిగిన నాల్గో రోజు అదే సబ్జెక్టుకు సంబంధించిన మరో పాఠశాల స్కూల్‌ అసిస్టెంట్‌ మూల్యాంకనాన్ని తనిఖీ చేయాలి. పరిశీలకులు జవాబుపత్రాల ధ్రువీకరణ అనంతరం 4వ రోజు నుంచి 7వరోజు వరకు లీవ్‌ యాప్‌లో మార్కులు నమోదు చేయాలని పాఠశాలల హెచ్‌ఎంలను ఆదేశించారు.

Updated Date - Nov 10 , 2026 | 02:31 AM