Share News

విద్యార్థులు లేని పరీక్షకు పది మంది విధులు

ABN , Publish Date - May 27 , 2026 | 03:14 AM

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో భాగంగా మంగళవారం నిర్వహించిన హిందీ పరీక్షకు కేవలం 57మంది విద్యా ర్థులు మాత్రమే హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలోని 23 కేంద్రాల్లో ఒక్క విద్యార్థి కూడా హాజరుకాలేదు.

విద్యార్థులు లేని పరీక్షకు పది మంది విధులు

హిందీ రాసింది 57మంది మాత్రమే!

మూడు కేంద్రాల్లో అందరూ గైర్హాజరు

ఏడుచోట్ల ఒక్కొక్కరే హాజరు

ఒంగోలు విద్య, మే 26 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో భాగంగా మంగళవారం నిర్వహించిన హిందీ పరీక్షకు కేవలం 57మంది విద్యా ర్థులు మాత్రమే హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలోని 23 కేంద్రాల్లో ఒక్క విద్యార్థి కూడా హాజరుకాలేదు. పామూరు పరీక్షా కేంద్రంలో 11మంది, కొత్తపట్నంలో ఏడుగురు, చీమకుర్తిలో ఇద్దరు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా అందరూ గైర్హాజరయ్యారు. అయినప్పటికీ ప్రతి పరీక్షా కేంద్రంలో చీఫ్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్‌, ఇన్విజిలేటర్‌, ఇద్దరు జాయింట్‌ కస్టోడియన్లు, ఇద్దరు వైద్య సిబ్బంది, ఒక అటెండర్‌, ఇద్దరు పోలీసులు మొత్తం పది మంది విధులు నిర్వహించాల్సి వచ్చింది. మరో ఏడు కేంద్రాల్లో ఒక్కో విద్యార్థి హాజరు కాగా పది మంది చొప్పున అధికారులు, సిబ్బంది పనిచేశారు. ఉమ్మడి జిల్లాలో హిందీ పరీక్షకు 175 మంది హాజరుకావాల్సి ఉండగా కేవలం 57 మంది మాత్రమే రాశారు. 118 మంది గైర్హాజరయ్యారు. ఏపీ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ పదో తరగతి ఇంగ్లీషు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షకు 492 మందికి 392 మంది హాజరయ్యారు. ఇంటర్మీడియెట్‌ తెలుగు పరీక్షకు 519 మందికి 407 మంది హాజరుకాగా 112మంది గైర్హాజరయ్యారు. ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్‌ శ్రీనివాసరావు మూడు కేంద్రాలు, స్క్వాడ్‌ అధికారులు 16 కేంద్రాలను తనిఖీ చేశారు.

Updated Date - May 27 , 2026 | 03:14 AM