Share News

సజావుగా ‘పది’ పరీక్షలు

ABN , Publish Date - Mar 17 , 2026 | 03:02 AM

ఉమ్మడి జిల్లాలో సోమవారం నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. ఉమ్మడి జిల్లాలో 165 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 28,465 మంది విద్యార్థులకుగాను 28,302 మంది హాజరయ్యారు.

సజావుగా ‘పది’ పరీక్షలు
ఒంగోలులో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్‌ రాజాబాబు

28,302 మంది విద్యార్థులు హాజరు

163 మంది గైర్హాజరు

ఒంగోలులో పలు కేంద్రాలను సందర్శించిన కలెక్టర్‌

ఒంగోలు విద్య, మార్చి 16 (ఆంధ్ర జ్యోతి) : ఉమ్మడి జిల్లాలో సోమవారం నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. ఉమ్మడి జిల్లాలో 165 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 28,465 మంది విద్యార్థులకుగాను 28,302 మంది హాజరయ్యారు. 163 మంది గైర్హాజరైనట్లు డీఈవో సీవీ రేణుక తెలిపారు. మొదటిరోజు పరీక్షకు హాజరువుతున్న సందర్భంగా విద్యార్థులు ముం దుగా ఇళ్ల నుంచి బయల్దేరి ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహించి కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయాన్నే విద్యార్థులతో లాయర్‌పేటలోని సాయిబాబా మందిరం, ఇతర ఆలయాలు కిక్కిరిసిపోయాయి. విద్యార్థులు తమ ఇష్టదైవాల పాదాల చెంత హాల్‌ టిక్కెట్లు ఉంచి పూజలు చేశారు. అందరూ ఉదయం 9గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. అక్కడ ప్రధాన గేట్ల వద్దనే క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి విద్యార్థులను లోపలికి అనుమతించారు. సెల్‌ఫోన్లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాలను అనుమతించలేదు. కేంద్రాల పరిధిలోని జెరాక్స్‌, కంప్యూటర్‌ నెట్‌ సెంటర్లను మూయించారు.

మూడు కేంద్రాలను సందర్శించిన కలెక్టర్‌

ఒంగోలు నగరంలోని పీవీఆర్‌ బాలురు, బాలికల హైస్కూలు, కోర్టు సెంటర్‌లోని గౌతమ్‌ మోడల్‌ స్కూలులోని కేంద్రాలను కలెక్టర్‌ రాజాబాబు పరిశీలించారు. ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, డీఈవో రేణుక కలెక్టర్‌ వెంట ఉన్నారు. డీఈవో నగరంలోని మరో మూడు కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షల రాష్ట్ర పరిశీలకులు ఎ.సుబ్బారెడ్డి ఆరు కేంద్రాలను, మార్కాపురం జిల్లా పరిశీలకులు గీత ఐదు కేంద్రాలను, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ కార్యాలయ ప్రత్యేక అధికారి ఆరు కేంద్రాలను తనిఖీచేశారు.

Updated Date - Mar 17 , 2026 | 03:02 AM