Share News

చేపల వేటకు సాంకేతిక తోడు

ABN , Publish Date - Aug 06 , 2026 | 03:17 AM

సముద్రంపై రేయనక, పగలనక వేట సాగించే మత్స్యకారులు.. నడిసముద్రంలో ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని జీవితాలు. తుఫాన్లు, సుడిగుండాలు, అ ల్పపీడనాలు ఎప్పుడు ఏవిధంగా ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందో తెలియని పరిస్థితి.

చేపల వేటకు సాంకేతిక తోడు
కొత్తపట్నం తీరం వద్ద బోటుకు బిగిస్తున్న ట్రాన్స్‌పాండర్‌

ప్రమాద సమయంలో మత్స్యకారుల ప్రాణాలకు రక్షణ

బోట్లకు ట్రాన్స్‌పాండర్‌ పరికరాలను అమర్చుతున్న ప్రభుత్వం

అందుబాటులోకి సముద్రంలో చేపల జాడ తెలిపే టెక్నాలజీ

ఒంగోలు నగరం, ఆగస్టు 5 (ఆంరఽధజ్యోతి) : సముద్రంపై రేయనక, పగలనక వేట సాగించే మత్స్యకారులు.. నడిసముద్రంలో ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని జీవితాలు. తుఫాన్లు, సుడిగుండాలు, అ ల్పపీడనాలు ఎప్పుడు ఏవిధంగా ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందో తెలియని పరిస్థితి. వేట సాగిస్తూ ఎంతోమంది మత్స్యకారులు సంద్రంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇక నుంచి మత్స్యకారుల ప్రాణాలకు భరోసా కల్పిస్తూ ఇస్రో తయారు చేసిన ట్రాన్స్‌పాండర్‌ అనే పరికరం వారికి అందుబాటులోకి రానుంది. ఈ పరికరం మత్స్యకారులకు ఎంతోమేలు చేయనుంది. వేట సాగించే సమయంలో ముప్పు ఏవిధంగా వచ్చినా కాపాడేందుకు ఈ పరికరం పనిచేస్తుంది. మత్స్యకారులు ఈ పరికరంలో ఉన్న బటన్‌ నొక్కితే చాలు ఆ సమాచారం తీరంలోని గస్తీ దళానికి, ఇతర రక్షణ రంగాలకు క్షణంలో చేరిపోతుంది. ఇలా సమాచారం అందిన వెంటనే ఆ బోటు ఏ ప్రాంతంలో ఉందో గుర్తించి అక్కడికి గస్తీ దళాన్నో లేక ఇతర రక్షణ దళాన్నో పంపించి కాపాడతారు. ఇందుకోసం ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించిన ట్రాన్స్‌పాండర్‌ను మత్స్యకారులు వేట సాగించే అన్ని బోట్లకు అమర్చే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రధాన మంత్రి మత్స్యయోజన కింద కేంద్ర ప్రభుత్వం జిల్లాలోని అన్ని తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారుల బోట్లకు వీటిని ప్రస్తుతం అమర్చుతోంది. వీటి విలువ రూ.30 వేలకుపైగానే ఉండగా ప్రభుత్వం ఉచితంగానే ఇస్తోంది.

బహుళ ప్రయోజనాలు...

ట్రాన్స్‌పాండర్‌లను మత్స్యకారులు వేటకు ఉపయోగించే ఇన్‌బోట్‌ మోటార్లు, అవుట్‌ బోట్‌ మోటార్లు, యంత్రీకరణ జరిగిన ఇతర రకాల బోట్లకు ప్రభుత్వం అమర్చుతుంది. ఈ పరికరం ఉన్న బోటులో వేట సాగించే మత్స్యకారులకు నిరంతరం సముద్రంలోకే వాతావరణ సమాచారం చేరుతుంది. వేట సాగించే ప్రాంతంలో ప్రమాదకర పరిస్థితులు ఉంటే వెంటనే అప్రమత్తం చేస్తుంది. ఇక ప్రమాదంలో చిక్కుకుంటే వెంటనే ఆ విషయాన్ని గస్తీ దళాలకు, దగ్గర్లో ఉన్న అన్ని రక్షణ ప్రాంతాలకు క్షణాల్లో చేరవేస్తుంది. ప్రమాదస్థాయిని బట్టి వాయు మార్గంలో వెళ్లి కూడా రక్షించే అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోంది.

చేపల సమాచారం కూడా అందుబాటులోకి...

ఇప్పటివరకు మత్స్యకారులు రోజంతా సముద్రంలో వేట సాగించినా చేప పిల్ల కూడా వలకు చిక్కని ఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం బోట్లకు అమర్చుతున్న ట్రాన్స్‌పాండర్‌ సముద్రంలో ఏదిశలో ఎక్కువగా జలపుష్పం సంచరిస్తుందన్న విషయాన్ని కూడా బోటులోని మత్స్యకారులకు చేరవేస్తుంది. దీంతో ఆ దిశలోనే వేట సాగించే అవకాశం ఉంది. దీని ద్వారా మత్స్యకారులకు వేట ఇక నుంచి లాభదాయకంగా మారనుంది. సముద్రంలో కిలోమీటర్ల మేర వేట సాగిస్తూ డీజిల్‌ ఖర్చు, శ్రమ వృథా కాకుండా చేపలు పడే ప్రాంతంలోనే వేట సాగించి తక్కువ సమయంలోనే తిరిగి తీరానికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జిల్లాలో రెండు వేల బోట్లు

మత్స్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో రెండు వేల బోట్లు రిజిస్టర్‌ అయి ఉన్నాయి. తొలివిడత ప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా ఈ బోట్లకు ట్రాన్స్‌పాండర్‌ పరికరాన్ని ఉచితంగానే అమర్చుతోంది. వాటిని వినియోగించే విధానాన్ని మత్స్యశాఖ అధికారులు వారికి వివరిస్తున్నారు. త్వరలోనే అన్ని బోట్లకు ట్రాన్స్‌పాండర్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చి మత్స్యకారులకు వేటలో దిక్సూచిలా సేవలు అందించటంతోపాటు వారి ప్రాణాలకు భరోసా కల్పించనుంది.

Updated Date - Aug 06 , 2026 | 03:17 AM