ఉపాధ్యాయులు విద్యార్థుల సంరక్షకులు
ABN , Publish Date - Jan 30 , 2026 | 11:18 PM
ఉపాధ్యాయులు విద్యనందించడంతోపాటు విద్యార్థుల సంరక్షకులుగా పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు.
కొత్తగా నియమితులైన టీజీటీ, పీజీటీల శిక్షణ కార్యక్రమంలో మంత్రి స్వామి
ఒంగోలు కార్పొరేషన్, జనవరి 30 (ఆంధ్రజ్యోతి) : ఉపాధ్యాయులు విద్యనందించడంతోపాటు విద్యార్థుల సంరక్షకులుగా పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. డీఎస్సీ ద్వారా నూతనంగా అంబేద్కర్ గురుకులాల్లో నియమితులైన టీజీటీ, పీజీటీలకు శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక ఆంధ్రకేసరి యూనివర్సిటీలో నిర్వహించారు. డెటాల్ బనేగా స్వచ్ఛ ఇండియా పేరుతో షార్ట్స్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మంత్రి స్వామి మాట్లాడారు. విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రతపైఅవగాహన కల్పించడంతోపాటు ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పారు. అలాగే అంబేద్కర్ గురుకులాల్లో కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యాబోధన అందించాలన్నారు. విద్యార్థుల భద్రత, రక్షణ కోసం రూ. 14 కోట్లతో గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే ఐఐటీ, నీట్ ఎక్స్‌లెన్సీ సెంటర్లను పదికి పెంచామన్నారు. 2017లో ఐఐటీ, నీట్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా ఇరవై మంది విద్యార్థులకు ఎంబీబీఎస్, 37 మందికి ఎన్‌ఐటీ, ఐఐటీ సీట్లు వచ్చాయని గుర్తుచేశారు. ఆ విద్యార్థులకు ముఖ్యమంత్రి ఒక్కొక్కరికి లక్ష నగదు బహుమతిగా అందజేశామన్నారు. అలాగే నీట్‌లో అతి తక్కువ మార్కులతో సీటును మిస్ అయినవారికి విజయవాడలో 65 మందికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సింగరాయకొండ గురుకులంలో రూ. 2.25 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఈవీ మూర్తి, గురుకుల జాయింట్ సెక్రటరీ రూపావతి, డీసీవో జయ, నెల్లూరు డీసీవో ప్రభావతి, సోషల్ వెల్‌ఫేర్ డీడీ లక్ష్మానాయక్, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.