కొలిక్కిరాని టీచర్ల సర్దుబాటు
ABN , Publish Date - Jul 08 , 2026 | 01:43 AM
ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ మంగళవారం కూడా కొలిక్కి రాలేదు. మిగులు టీచర్ల సీనియారిటీ జాబితాల కోసం రెండు రోజులుగా మండల విద్యాధికారులు ఎదురుచూస్తున్నా వాటి జాడలేదు.
తుది జాబితాల కోసం ఎదురుచూపులు
ఏమి జరుగుతుందో తెలియని అయోమయం
ఒంగోలు విద్య, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ మంగళవారం కూడా కొలిక్కి రాలేదు. మిగులు టీచర్ల సీనియారిటీ జాబితాల కోసం రెండు రోజులుగా మండల విద్యాధికారులు ఎదురుచూస్తున్నా వాటి జాడలేదు. విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయ అధికారులను వాకబు చేస్తుంటే అవి ఏక్షణమైనా విడుదలవుతాయని, మీరు కౌన్సెలింగ్‌కు సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు. జాప్యానికి గల కారణాలను అధికారులు వెల్లడించకపోవడంతో ఉపాధ్యాయులు, అధికారులు అయోమయానికి గురవుతున్నారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో కేవలం 144 మంది మాత్రమే మిగులు టీచర్లు ఉన్నట్లు తేల్చారు. వీరిలో ప్రకాశంలో 74 మంది, మార్కాపురం జిల్లాలో 70మంది ఉన్నారు. అయితే సాంకేతిక వినియోగంలో పనులు సులభతరం కావాల్సింది పోయి మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి. విద్యాశాఖకు సంబంధించి క్షేత్రస్థాయిలో జరగాల్సిన పనులను కూడా పాఠశాల విద్య డైరెక్టర్ కార్యాలయమే చేపడుతుండటంతో గందరగోళం నెలకొంది. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో మండలానికి ఇద్దరు, ముగ్గురు మాత్రమే మిగులు టీచర్లు ఉన్నారు. ప్రకాశంలో మండలానికి సగటున కనీసం 20 మందికిపైగా, మార్కాపురంలో మండలానికి కనీసం 45మంది వరకు టీచర్లు అదనంగా కావాల్సి ఉంది. ఈక్రమంలో మండలంలో ఎంఈవోలు మాన్యువల్‌గా సర్దుబాటు కౌన్సెలింగ్ చేపడితే అంతా అర్ధగం టలో పూర్తవుతుంది. అటువంటిది ఈ 144 మంది సర్దుబాటుకు కౌన్సెలింగ్ నిర్వహించేం దుకు రెండు రోజులుగా ఎంఈవోలు, టీచర్లు ఎదురుచూపులు చూడాల్సి వచ్చింది.