ఎట్టకేలకు టీచర్ల సర్దుబాటు పూర్తి
ABN , Publish Date - Jul 12 , 2026 | 02:08 AM
జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. డివిజన్ స్థాయి మిగులు టీచర్ల సర్దుబాటు కౌన్సెలింగ్ శనివారం జరిగింది. ఆతర్వాత మిగులు టీచర్లు ఎవ్వరూ లేకపోవడంతో ప్రక్రియ పూర్తయినట్లు అయింది.
ముగిసిన డివిజన్ స్థాయి కౌన్సెలింగ్
ఒంగోలు విద్య, జూలై 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. డివిజన్ స్థాయి మిగులు టీచర్ల సర్దుబాటు కౌన్సెలింగ్ శనివారం జరిగింది. ఆతర్వాత మిగులు టీచర్లు ఎవ్వరూ లేకపోవడంతో ప్రక్రియ పూర్తయినట్లు అయింది. జూన్ 30నాటికి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 74మంది మిగులు ఉపాధ్యాయులను గుర్తించారు. వీరిలో 44 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు కాగా 30మంది స్కూలు అసిస్టెంట్లు ఉన్నారు. 44 మంది ఎస్‌జీటీలు, సింహభాగం స్కూలు అసిస్టెంట్లు ఎక్కడికక్కడే మండలాల్లోనే సర్దుబాటు అయ్యారు. డివిజన్ స్థాయిలో కేవలం కొద్దిమంది స్కూలు అసిస్టెంట్లు మాత్రమే మిగులుగా తేలారు. ఒంగోలు డివిజన్‌లో ఇద్దరు తెలుగు, ఇద్దరు హిందీ స్కూలు అసిస్టెంట్లు డివిజన్ స్థాయి కౌన్సెలింగ్‌కు హాజరు కాగా వీరిలో ఒక తెలుగు, ఒక హిందీ స్కూలు అసిస్టెంట్ 75శాతం వైకల్యం ఉండటంతో వారిని సర్దుబాటు నుంచి మినహాయించారు. మిగిలిన ఇద్దరు కౌన్సెలింగ్‌లో వారు కోరుకున్న స్థానాలను ఒంగోలు ఉపవిద్యాధికారి రంగయ్య కేటాయించారు. దీంతో ఒంగోలు డివిజన్ నుంచి జిల్లాస్థాయికి మిగులు టీచర్లు లేకుండాపోయారు. మిగిలిన చోట్ల కూడా ఆయా డివిజన్ స్థాయిలోనే సర్దుబాటు కావడంతో జిల్లాస్థాయి కౌన్సెలింగ్ అవసరం లేకుండాపోయింది. జిల్లాలో భర్తీకాకుండా పోయిన టీచర్ పోస్టులకు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేయాల్సి ఉంది. మరో వారంరోజుల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం కూడా పట్టాలెక్కే పరిస్థితి కనిపిస్తుంది.