త్వరలో టీడీపీకి సొంత కార్యాలయం
ABN , Publish Date - May 03 , 2026 | 02:18 AM
ఒంగోలులో తెలుగుదేశం పార్టీకి సొంత కార్యాలయం ఏర్పాటు కానుంది. త్వరలోనే నిర్మాణం చేపట్టనున్నారు. అందు కోసం కేటాయించిన స్థలంలో శనివారం జంగిల్ క్లియరెన్స్ పనులు పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి నేతృత్వంలో ప్రారంభమయ్యాయి.
ఒంగోలులో నిర్మాణానికి సన్నాహాలు
రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించిన ప్రభుత్వం
జంగిల్ క్లియరెన్స్ చేపట్టిన నేతలు
రూ.3కోట్లతో నిర్మించనున్నట్లు పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు డాక్టర్ ఉగ్ర వెల్లడి
ఒంగోలు, మే 2 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలులో తెలుగుదేశం పార్టీకి సొంత కార్యాలయం ఏర్పాటు కానుంది. త్వరలోనే నిర్మాణం చేపట్టనున్నారు. అందు కోసం కేటాయించిన స్థలంలో శనివారం జంగిల్ క్లియరెన్స్ పనులు పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి నేతృత్వంలో ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ ఒంగోలులో ఆ పార్టీకి సొంత కార్యాలయం లేదు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎవరు ఉంటే వారి ఆధ్వ ర్యంలో అద్దె భవనంలో లేదా వారి సొంత భవనాల్లో కార్యాలయాన్ని నడుపుతూ వస్తున్నారు. ఈ నేప థ్యంలో సొంత భవనం లేని అన్ని పార్లమెంట్ నియో జకవర్గ కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి యువనేత నారా లోకేష్ సంకల్పించారు. తదనుగుణంగా ఒంగోలులో కూడా సొంత భవనం రూపుదాల్చనుంది. అందుకోసం భాగ్యనగర్ 4వ లైన్ నుంచి జాతీయ రహదారిని కలిపే రోడ్డులోని ఏసీబీ ఆఫీసు సమీపంలో ఉన్న స్థలం అనువుగా ఉంటుందని గుర్తించారు. మామిడిపాలెం సర్వే నెంబరు 82/1బీ, బీ2లలో రెండు ఎకరాల స్థలాన్ని ఏడాదికి ఎకరాకు రూ.వెయ్యి వంతున 33 సంవత్సరాలు లీజుకు ఇస్తూ గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తీర్మానించింది.
పనులపై నేతల దృష్టి
కేబినెట్ తీర్మానం అయిన వెంటనే సదరు స్థలంలో అవసరమైన పనులపై పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనర సింహారెడ్డి దృష్టి సారించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు నూకసాని బాలాజీ, పార్టీ పార్లమెంట్ కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు తదితరులతో కలిసి శనివారం ఉదయం ఆ స్థలాన్ని సందర్శించారు. చిల్లచెట్లు అధికంగా ఉండటంతో ఎక్స్‌కవేటర్‌తో జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. సుమారు రూ.3కోట్ల వ్యయంతో పార్టీ రాష్ట్ర కమిటీ భవనాన్ని నిర్మిస్తుందని ఈ సంద ర్భంగా ఉగ్ర నరసింహారెడ్డి విలేకరులకు తెలిపారు. స్థలం, భవనం అన్నీ రాష్ట్ర కమిటీ పేరుతోనే ఉంటా యని స్పష్టం చేశారు.