విధేయతకు టీడీపీ అధిష్ఠానం పట్టం
ABN , Publish Date - Nov 18 , 2026 | 10:56 PM
సుమారు 40 ఏళ్లకు పైగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. పార్టీ పట్ల నిబద్ధత, అంకితభావం, విధేయత కనబరిచారు. వంకాయలపాటి మాల్యాద్రి సేవలను గుర్తించిన టీడీపీ అధిష్ఠానం ఆయన కుటుంబానికి పట్టం కట్టింది. సుమారు 25 ఏళ్ల క్రితం మాల్యాద్రిని వరిస్తుందనుకున్న ఎంపీపీ పదవి త్రుటిలో చేజారింది. నేడు ఆ పదవి ఆయన కుమార్తెకు దక్కింది. దీంతో ఆ తండ్రి కుమార్తెల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
25 ఏళ్ల క్రితం మాల్యాద్రికి త్రుటిలో చేజారిన ఎంపీపీ పదవి
అయినా కుంగిపోకుండా పార్టీ అభివృద్ధికి కృషి
నేడు కుమార్తెను వరించిన అదృష్టం
ఎమ్మెల్యే ఇంటూరికి కృతజ్ఞతలు తెలిపిన తండ్రీకుమార్తె
సుమారు 40 ఏళ్లకు పైగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. పార్టీ పట్ల నిబద్ధత, అంకితభావం, విధేయత కనబరిచారు. వంకాయలపాటి మాల్యాద్రి సేవలను గుర్తించిన టీడీపీ అధిష్ఠానం ఆయన కుటుంబానికి పట్టం కట్టింది. సుమారు 25 ఏళ్ల క్రితం మాల్యాద్రిని వరిస్తుందనుకున్న ఎంపీపీ పదవి త్రుటిలో చేజారింది. నేడు ఆ పదవి ఆయన కుమార్తెకు దక్కింది. దీంతో ఆ తండ్రి కుమార్తెల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
లింగసముద్రం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి) : మండలంలోని వీఆర్ కోట గ్రామానికి చెందిన వంకాయలపాటి మాల్యాద్రి 1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ, పార్టీకి, ప్రజలకు సేవచేస్తున్నారు. దీంతో టీడీపీ అధిష్ఠానం 1999లో ఆయనకు జిల్లా తెలుగు రైతు కార్యదర్శి పదవిని ఇచ్చింది. 2001లో జరిగిన ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలిచి, ఎంపీపీ పదవి రేసులో ఉన్నారు. ఎంపీపీ పదవి మాల్యాద్రిని వరిస్తుందని అందరూ ఊహించారు. ఆఖరి క్షణంలో అనూహ్యంగా ఆ పదవి చేజారిపోయింది. దీంతో అప్పట్లో ఆయనకు మండల వైస్ ఎంపీపీ పదవి దక్కింది. అయినా ఆయన కుంగిపోకుండా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తూ వచ్చారు. గత ఏడాది ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆయనకు క్లస్టర్ ఇన్‌చార్జ్ పదవిని ఇచ్చి మండలంలో పార్టీని బలోపేతం చేసే దిశగా బాధ్యతలు అప్పగించారు. మొన్నటి ఎంపీటీసీ ఎన్నికలలో వీఆర్ కోట స్థానం నుంచి ఆయన కుమార్తె ఆదెమ్మ ఏకగ్రీవంగా ఎంపిక కావడంతో పాటు మరో 9 ఎంపీటీసీ స్థానాలు టీడీపీకి వచ్చాయి. దీంతో ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆదెమ్మను ఎంపీపీగా ఎంపిక చేశారు. బుధవారం ఆమె ఎంపీపీగా ప్రమాణం చేయనున్నారు. ఈ సందర్భంగా మాల్యాద్రి, ఆయన కుమార్తె ఎమ్మెల్యే నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు చెప్పారు. పార్టీకి నిబద్దతతో పనిచేస్తే ఎప్పటికైనా పదవులు వాటంతట అవే వస్తాయనే దానికి మాల్యాద్రి ఉదంతం ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.