Share News

పంచాయతీల్లో పన్ను రాయితీ

ABN , Publish Date - Apr 26 , 2026 | 02:35 AM

మునిసిపాలిటీల తరహాలో గ్రామ పంచాయతీల్లో ముందస్తుగా ఇంటి పన్ను చెల్లించిన వారికి రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా ఐదు శాతం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను మొత్తాన్ని మే ఆఖరు లోపు చెల్లిస్తేనే ఇది వర్తిస్తుంది.

పంచాయతీల్లో పన్ను రాయితీ

వచ్చేనెల 1 నుంచి 31 వరకూ అవకాశం

స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు

మునిసిపాలిటీల తరహాలో అవకాశం కల్పించిన ప్రభుత్వం

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీల తరహాలో గ్రామ పంచాయతీల్లో ముందస్తుగా ఇంటి పన్ను చెల్లించిన వారికి రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా ఐదు శాతం ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను మొత్తాన్ని మే ఆఖరు లోపు చెల్లిస్తేనే ఇది వర్తిస్తుంది. ప్రకాశం జిల్లాలో 519, మార్కాపురం జిల్లాలో 406 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిల్లో పన్నుల రూపంలో రాబడి సుమారు రూ.60కోట్ల వరకూ ఉంటోంది. సాధారణంగా గ్రామ పంచాయతీల్లో ఏటా పంచాయతీ కార్యదర్శులు, ఆశాఖ పరిధిలోని ఉన్నతాధికారులు పన్నులు వసూలు చేస్తుంటారు. ఎక్కువ మొత్తంలో వసూలు కావాల్సిన పంచాయతీల్లో ఐదారుగురు అధికారులతో కలిసి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తుంటారు. అయితే గురువారం జరిగిన జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఇంటి పన్నుల చెల్లింపులకు 5 శాతం రాయితీని ప్రకటిం చింది. మే 1వ తేదీ నుంచి 31వతేదీ వరకు ఈ పన్నులు ఐదుశాతం రాయితీతో చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా సెల్‌ఫోన్‌ వినియోగం విస్తృతంగా ఉన్న నేపథ్యంలో ఇంటి పన్నుల చెల్లింపులను ఆన్‌లైన్‌లోనే చేసేవిధంగా చర్యలు తీసుకుంది. ప్రభుత్వం కల్పించిన ఈ సౌలభ్యం వల్ల ముందుగానే పంచాయతీలకు వసూలైన ఇంటి పన్నుల ద్వారా గ్రామాల్లో అత్యవసర పనులు చేపట్టే అవకాశం ఉంటుంది.

Updated Date - Apr 26 , 2026 | 02:35 AM