Share News

ప్రజల్లోకి ప్రభుత్వ విజయాలు

ABN , Publish Date - Jul 28 , 2026 | 03:09 AM

రాష్ట్రంలో రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది. రాష్ట్రమంత్రుల నుంచి క్షేత్ర స్థాయిలోని బూత్‌ కన్వీనర్ల వరకు వివిధ ప్రాంతా ల్లో తమ పరిధిలోని ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వ విజయాలపై ప్రచారం చేపట్టారు.

ప్రజల్లోకి ప్రభుత్వ విజయాలు
కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కొండపి మండలం ముప్పరాజుపాలెంలో మహిళలకు వివరిస్తున్న మంత్రి స్వామి (ఇన్‌సెట్‌లో) సంతమాగులూరు మండలం ఏల్చూరులో దివ్యాంగుడి యోగక్షేమాలు తెలుసుకుంటున్న మంత్రి రవికుమార్‌

ఇంటింటికీ టీడీ పీ ప్రారంభం

సొంత నియోజకవర్గాల్లో పాల్గొన్న మంత్రులు డాక్టర్‌ స్వామి, గొట్టిపాటి

పలుచోట్ల ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హాజరు

ఒంగోలు, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది. రాష్ట్రమంత్రుల నుంచి క్షేత్ర స్థాయిలోని బూత్‌ కన్వీనర్ల వరకు వివిధ ప్రాంతా ల్లో తమ పరిధిలోని ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి ప్రభుత్వ విజయాలపై ప్రచారం చేపట్టారు. రెండేళ్ల నమ్మకం, సంక్షేమం-అభివృద్ధి పేరుతో గతనెలలో నియోజకవర్గం, జిల్లాస్థాయిలో ప్రభుత్వ భాగస్వామ్యంతో టీడీపీ వేడుకలను నిర్వహించిన విషయం విదితమే. అదే నినాదంతో ప్రస్తుతం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సూపర్‌ సిక్స్‌తోపాటు ఇతర సంక్షేమ పథకాలు, అలాగే ప్రాంతాలవారీ జరుగుతున్న పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, పోర్టులు, ఇతర ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రజలకు వివరించాలని అధిష్ఠానం ఆదేశించింది. అదేసమయంలో నియోజకవర్గాల్లో ప్రత్యేకించి కార్యక్రమం జరుగుతున్న గ్రామాల్లో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించేలా స్థానిక నేతలు కార్యక్రమం రూపొందించారు.

అన్నిచోట్లా ప్రారంభం

తొలిరోజైన సోమవారం అన్ని నియోజకవర్గాల్లో కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లాకు చెందిన ఇరువురు రాష్ట్రమంత్రులు తమ సొంత నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కొండపి మండలం ముప్పరాజుపాలెంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డీస్‌బీవీ స్వామి ఇంటింటికి తిరిగీ ప్రజలను కలిసి ప్రభుత్వ విజయాలను వివరించారు. విద్యుత్‌ శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సంతమాగులూరు మండలం ఏల్చూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఉలవపాడులోని ఎస్టీకాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మద్దిపాడులోని బీసీకాలనీలో నిర్వహించిన కార్యక్రమానికి ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్‌.విజయకుమార్‌ హాజరయ్యారు. దర్శి పట్టణంలో జరిగిన కార్యక్రమంలో అక్కడి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పాపారావు పాల్గొన్నారు. కాగా ఒంగోలు నగర పరిధిలోని 36వ డివిజన్‌లో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ సోమవారం మధ్యాహ్నం లాంఛనంగా ప్రాంభించారు. సాయంత్రం స్థానిక పార్టీ కార్యాలయంలో టీడీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించి క్లస్టర్‌, బూత్‌ల వారీ కార్యక్రమ రూపకల్పనపై చర్చించారు. వివిధ ప్రాంతాల్లో మండల, క్లస్టర్‌ స్థాయి నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

టాప్‌టెన్‌లో కనిగిరి, మార్కాపురం

ఇంటింటి ప్రచారంపై టీడీపీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇంటింటికీ టీడీపీ కార్యక్ర మంలో ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం ముందంజలో నిలిచింది. ప్రత్యేకించి రాష్ట్రస్థాయిలో కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం రెండో స్థానంలో, మార్కాపురం 9వ స్థానంలో ఉంది. నియోజకవర్గంలో పార్టీశ్రేణులు ఎంతమందిని వ్యక్తిగ తంగా కలిసి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారన్న విషయంపై టీడీపీ అధిష్ఠానం ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోంది. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ కార్యక్రమం జయప్రదానికిజిల్లాలోని నాయకులందరికీ బాధ్యతలు కేటాయించినప్పటికీ కీలక వ్యవహారాలు ఇచ్చినందున కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి ముందుగానే అక్కడికి చేరారు. అయినప్పటికీ ఆ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచారు. ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గంలో తొలిరోజు 10,579 గృహాలను టీడీపీ శ్రేణులు సందర్శించారు. అందులో అత్యధికంగా కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో 4,773 మందిని కలిసి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించగలిగారు. ఆ తర్వాత అత్యధికంగా మార్కాపురం నియోజకవర్గంలో 1,766 మందిని, గిద్దలూరులో 1,660మందిని కలిశారు. దర్శిలో 786 మందిని, కొండపి నియోజకవర్గంలో 663 మందిని, వైపాలెంలో 877మందిని, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 54మందిని మాత్రమే ్టశ్రేణులు కలిసినట్లు పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. రాష్ట్రస్థాయిలో తొలిస్థానంలో 4,664 గృహాలను సందర్శించటం ద్వారా నెల్లూరు రూరల్‌ మొదటిస్థానంలో, 2,137 గృహాలను సందర్శించటం ద్వారా కనిగిరి 2వస్థానంలో నిలిచింది. 945 గృహాలను టీడీపీ శ్రేణులు సందర్శించటం ద్వారా మార్కాపురం నియోజకవర్గం 9వస్థానంలో ఉంది. కనిగిరి నియోజకవర్గంలో అత్యధికంగా పామూరు మండలంలో 1,116 మందిని, కనిగిరి పట్టణంలో 952 మందిని, సీఎస్‌పురం మండలంలో 782 మందిని, హెచ్‌ఎంపాడు మండలంలో 598 మందిని, కనిగిరి మండలంలో 563 మందిని, పీసీపల్లిలో 483 మందిని, వెలిగండ్లలో 212 మందిని టీడీపీ శ్రేణులు కలిసినట్లు పార్టీ ప్రకటించింది.

Updated Date - Jul 28 , 2026 | 03:09 AM