తహసీల్దార్ కార్యాలయం ఖాళీ
ABN , Publish Date - May 08 , 2026 | 02:51 AM
తర్లుపాడు తహసీల్దార్ కార్యాలయం పూర్తిగా ఖాళీ అయింది. తహసీల్దార్ 20 రోజులు సెలవుపై వెళ్లారు. డిప్యూటీ తహసీల్దార్, ఆర్‌ఐ, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి.
20 రోజులు సెలవులో తర్లుపాడు తహసీల్దార్
డీటీ, ఆర్‌ఐ, జూనియర్ అసిస్టెంట్ లేరు!
సేవలు అందక ప్రజలు, విద్యార్థుల ఇబ్బందులు
మార్కాపురం టౌన్, మే 7 (ఆంధ్రజ్యోతి) : తర్లుపాడు తహసీల్దార్ కార్యాలయం పూర్తిగా ఖాళీ అయింది. తహసీల్దార్ 20 రోజులు సెలవుపై వెళ్లారు. డిప్యూటీ తహసీల్దార్, ఆర్‌ఐ, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. మండల సర్వేయర్ గత నెల మొత్తం అనారోగ్య కారణా లతో సెలవులో ఉన్నారు. ఆయన ఇంకా విధుల్లో చేరలేదు. కార్యాలయంలో అటెండర్లు, వీఆర్వోలు, సచివాలయ సర్వేయర్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. దీంతో విద్యార్థులకు కుల, నివాస సర్టిఫికెట్లు.. రైతులకు, ప్రజ లకు అందించాల్సిన కొన్ని రకాల సేవలు స్తంభించాయి. జిల్లా కేంద్రానికి పక్కనే ఉన్న మండలంలో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఉన్నా ఉన్నతాధి కారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వేసవిలో ఖాళీగా ఉండే రైతులు పలు రకాలైన రెవెన్యూ సమస్యలను పరిష్కరించుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వస్తుంటారు. జూన్‌లో విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. దీంతో ముందుగానే పలు రకాలైన సర్టిఫికెట్లు సిద్ధం చేసుకునేందుకు విద్యార్థులు కూడా కార్యాలయానికి వెళ్తారు. భూములు బీళ్లుగా ఉన్న సమయంలోనే రైతులు కొలతలకు దరఖాస్తు చేస్తుంటారు. ప్రభుత్వం భూముల రీసర్వే కార్యక్రమాన్ని కూడా వేగంగా నిర్వహిస్తోంది. రెవెన్యూ సదస్సులు, మీకోసం, ఎమ్మెల్యే నిర్వహించే ప్రజాదర్బార్‌లో వచ్చే అర్జీలను త్వరగా పరిష్కరించాలని ఆదేశిస్తోంది. కానీ గత కొన్ని నెలలుగా తర్లుపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఏపనులు కూడా సక్రమంగా సాగడం లేదు. దీంతో వందలాది దరఖాస్తులు, అర్జీలు పెండింగ్‌లో ఉండిపోయాయి. తర్లుపాడుకు ఒక టీటీని బదిలీపై పంపినప్పటికీ జాయిన్ కాలేదు. ఇక్కడి ఆర్‌ఐ జాయింట్ కలెక్టర్‌కు సీసీగా డిప్యుటేషన్‌పై వెళ్లారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టు చాన్నాళ్ల నుంచి ఖాళీగా ఉంది. దీంతో ప్రజలకు సేవలు అందించలేని దుస్థితి ఏర్పడింది. పక్కమండలాల్లో పనిచేస్తున్న వారిలో ఒకరిని ఇన్‌చార్జి తహసీల్దార్‌గా నియమిస్తే కొన్ని రకాల సేవలు ప్రజలు అందే అవకాశం ఉంది. ఆదిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.