ఉద్యానానికి ఊపు
ABN , Publish Date - Feb 15 , 2026 | 11:31 PM
రాష్ట్ర బడ్జెట్ ఉద్యానానికి ఊపు తెచ్చింది. బడ్జెట్ కేటాయింపులు జిల్లాలోని వివిధ రంగాలకు మేలు చేసేలా ఉండగా, అత్యధికంగా ఉద్యాన రైతులకు బాగా ఊతమిచ్చేలా ఉంది. గ్లోబల్ రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేయబోతుండటం, అందులో పూర్వ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాలు ఉండడం విశేషం. ఇందుకోసం రూ.30 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటనతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బడ్జెట్‌లో హార్టికల్చర్ హబ్‌కు రూ.30వేల కోట్ల కేటాయింపు
పూర్వ ఉమ్మడి జిల్లాకు ఎంతో మేలు
మొత్తం 56 మండలాల్లో 17 క్లస్టర్ల ఏర్పాటు
ఆనందం వ్యక్తం చేస్తున్న పండ్ల తోటల రైతులు
రాష్ట్ర బడ్జెట్ ఉద్యానానికి ఊపు తెచ్చింది. బడ్జెట్ కేటాయింపులు జిల్లాలోని వివిధ రంగాలకు మేలు చేసేలా ఉండగా, అత్యధికంగా ఉద్యాన రైతులకు బాగా ఊతమిచ్చేలా ఉంది. గ్లోబల్ రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేయబోతుండటం, అందులో పూర్వ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాలు ఉండడం విశేషం. ఇందుకోసం రూ.30 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటనతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యాన రైతులకు ఉత్పత్తుల కోత అనంతర నష్టాలు, రవాణా కష్టాలు లేకుండా, నాణ్యమైన దిగుబడి వచ్చేలా, ధరల స్థిరీకరణ, మౌలికవసతులు కల్పించి రైతు జీవితాల్లో వెలుగులు నింపాలనేది ప్రభుత్వ లక్ష్యం.
మార్కాపురం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా మార్కాపురం జిల్లాలో పండ్ల తోటల సాగు పట్ల రైతులు ఆసక్తి చూపుతారు. దాదాపు 18 రకాల ఉద్యాన పంటలు సాగులో ఉంటే అందులో మార్కాపురం జిల్లాలోనే ఎక్కువ రకాల పంటలు దాదాపు 60 శాతం సాగవుతాయి. ఉదాహరణకు మిర్చి. ఈ పంట సాగు మార్కాపురం జిల్లాలోనే అధికం. ఏటా ఉమ్మడి జిల్లాలో దాదాపు 52 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తుంటే అందులో మార్కాపురం జిల్లాలోనే 32 వేల ఎకరాలు ఉంటుంది. ఇక అరటి, దానిమ్మ, బత్తాయి, నిమ్మ, బొప్పాయి లాంటి పంటల సాగు అధికంగానే ఉంటుంది. ఉద్యాన రైతులకు హార్టికల్చర్ హబ్ ఏర్పాటు ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతారు.
ఉమ్మడి జిల్లాలో క్లస్టర్ల ఏర్పాటు
పూర్వ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం 56 మండలాలు ఈ హబ్ పరిధిలో ఉన్నాయి. ప్రస్తుత ప్రకాశం జిల్లాలో 28 మండలాలతోపాటు బాపట్ల జిల్లాలో ఉన్న పర్చూరు, చీరాల, వేటపాలెం మండలాలను కలిపి 11 క్లస్టర్లు, మార్కాపురం జిల్లాలో 21 మండలాలను 6 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. రైతు సేవా కేంద్రాల ద్వారా హబ్ కార్యక్రమాలను అమలు చేయనున్నారు.
హబ్ ద్వారా చేపట్టే కార్యక్రమాలు
ఉద్యాన రైతులకు నాణ్యమైన మొ క్కలు సరఫరా చేసే దగ్గర నుంచి సాగు విస్తీర్ణం పెంచటం, సూక్ష్మ సేద్యం ప్రోత్సహించటం, పంట నాణ్యత కోసం ఫ్రూట్ కవర్ల ఏర్పాటు, వాటి తయారీ రంగంతో పలువురికి ఉపాధి దొరుకుతుంది.
పంట కోత తరువాత ప్యాకింగ్ యూనిట్లు నెలకొల్పటం, రవాణా సౌకర్యాలు మెరుగుపరచటం, ప్రపంచంలో ఉ న్న ఉత్తమసాగు విధానాలను ఇక్కడ రైతులకు అర్థమయ్యేలా వివరిస్తూ ఉత్పాదకత పెంచేలా చర్యలు తీసుకుంటారు.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులు పండించిన పంట నేరుగా అమ్ముకుని గిట్టుబాటు ధర పొందేలా మార్కెట్‌కు అనుసంధానం చేస్తారు.
వెనుకబడిన ప్రాంత రైతులకు మేలు
కె.వెంకటేశ్వర్లు(చిన్నా), పుల్లలచెరువు రైతు
వెనుకబడిన ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు లాంటి ప్రాంతాల్లో మిర్చి, బొప్పాయి వంటి పంటలు అధికంగా సాగు చేసే రైతులకు ఇలాంటి హబ్ ద్వారా మేలు చేకూరుతుంది. నేను గతేడాది 4 ఎకరాల్లో బొప్పాయి, ఈ ఏడాది 2 ఎకరాల్లో అరటి, మరో 3 ఎకరాల్లో మిర్చి వేశా. చాలామంది రైతులకు పండ్ల తోటలపై సరైన అవగాహన లేకున్నా దళారులు చెప్పిందే ధర అని అమ్ముకుని మోసపోతున్నారు. అలాంటి ఇబ్బందులు ఇక ఉండవు. ఇటువంటి హబ్‌ను కేంద్ర సహకారంతో రాష్ట్రం అమలు చేసేందుకు భారీగా నిధులు కేటాయించటం హర్షణీయం.
ఎంతో శుభపరిణామం
జి. వెంకటేశ్వరరెడ్డి, బోడపాడు రైతు
నేను 6 ఎకరాల్లో దానిమ్మ పంట సాగు చేశా. ఏటా దాదాపు రూ.70 నుంచి రూ.90 లక్షలను పంట ద్వారా పొందుతున్నా. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా ఉండి వ్యవసాయంపై ఉన్న మక్కువతో పండ్ల తోటలను ఎంచుకున్నా. ఎంతో మేలు చేకూరే ఇలాంటి ప్రాజెక్ట్‌కు బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించటం శుభపరిణామం. రైతులకు మెళకువలతోపాటు అమ్మకాలకు తోడ్పాటు దొరుకుతుంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.