Share News

ప్రాణాలు తీసిన ఈత సరదా

ABN , Publish Date - Jan 28 , 2026 | 02:25 AM

ముగ్గురు స్నేహితులు కలసి మద్యం తాగారు. ఆపైన ఒకరు సరదాగా ఈతకు దిగి గల్లంతయ్యాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో మిగిలిన ఇద్దరు నీటిలో మునిగిపోయారు. అటుగా వెళుతున్న వాహనదారులు గమనించి ఒకరిని కాపాడారు. మిగిలిన ఇద్దరు యువకులు మృతి చెందారు.

ప్రాణాలు తీసిన ఈత సరదా

సంప్‌లోకి దిగి ఒకరు.. కాపాడబోయి మరొకరు మృతి

కనపర్తి ఎత్తిపోతల పథకం కాలువ సైఫన్‌లో ఘటన

మరో యువకుడిని కాపాడిన వాహనదారులు

నాగులుప్పలపాడు, జనవరి 27 (ఆంధ్రజ్యోతి) : ముగ్గురు స్నేహితులు కలసి మద్యం తాగారు. ఆపైన ఒకరు సరదాగా ఈతకు దిగి గల్లంతయ్యాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో మిగిలిన ఇద్దరు నీటిలో మునిగిపోయారు. అటుగా వెళుతున్న వాహనదారులు గమనించి ఒకరిని కాపాడారు. మిగిలిన ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన మండలంలోని వినోదరాయునిపాలెం సమీపంలోని కనపర్తి ఎత్తిపోతల పథకం సైఫన్‌ వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కనపర్తి పంచాయతీ పరిధిలోని తోపుపాలెంకు చెందిన నల గర్ల జయకృష్ణ ఒంగోలు పట్లణంలోని గోపాల్‌నగరంలో నివాసం ఉంటూ కర్నూల్‌ రోడ్డులోని ఓ నగల దుకాణంలో పనిచేస్తున్నాడు. అతనికి పట్టణంలోని మరాఠిపాలెంకు చెందిన కార్పెంటర్‌ సాంబాని వెంకటేష్‌ (23), గోపాల్‌నగరానికి చెందిన పూల దుకాణంలో పనిచేసే తోట భరత్‌కుమార్‌ (21)స్నేహితులు. మంగళవారం సాయంత్రం ముగ్గురూ ఉలిచి చెక్‌డ్యాం వద్ద మద్యం తాగారు. తిరిగివస్తున్న క్రమంలో నాగులుప్పలపాడు-కనపర్తి రోడ్డులోని వినోదరాయునిపాలెం వద్దనున్న కనపర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ (రోడ్డు కింద నుంచి వెళ్లే) సైఫన్‌ బావిలో తోట భరత్‌కుమార్‌ ఈత కొట్టేందుకు దిగి గల్లంతయ్యాడు. అతడిని రక్షించేందుకు వెంకటేష్‌, జయకృష్ణలు కూడా బావిలోకి దూకారు. వారిద్దరు కూడా ఊపిరాడక కొట్టుమిట్టాడుతుండగా అటుగా వెళుతున్న వాహనదారులు జయకృష్ణను పైకి లాగారు. మిగిలిన ఇద్దరూ మృతిచెందారు. స్థానికులు భరత్‌కుమార్‌, వెంకటేష్‌ మృతదేహాలను బయటకు తీశారు. తనతో వచ్చిన ఇద్దరు మృతిచెందడంతో భయాందోళనకు గురైన జయ తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని కొద్దిసేపు హంగామా చేశాడు. సమాచారం అందుకొన్న ఎస్‌ఐ రజియాసుల్తానా సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jan 28 , 2026 | 02:25 AM